top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

అల్పసంతోషులు

[హాస్య కథానిక]

 

గొర్తి.వాణిశ్రీనివాస్

vani srinivas.JPG

ఏవే వాణీ... నీ మొహం అంతలా వెలిగిపోతోంది. ఏవిటీ సంగతి?"అంటూ అడిగిన భారతి మొహంలోకి చూసిన వాణి ఖంగు తింది.


విచారానికీ విలాపానికీ మధ్యన నలిగిపోతున్నట్టు ఉంది ఆమె వదనం.

"నా సంగతి సరే..నువ్వు చెప్పు. అసలేం జరిగింది. మొహం అలా వాడిపోయింది" అంది వాణీ.

చల్లని ఓదార్పు మాటలు వచ్చి నల్లని మేఘాల గుండెలో పిల్లగాలి సోకి భళ్ళుమని కురిసినట్టు భారతికి దుఃఖం పొంగింది.

అల్పపీడనం వాయుగుండంగా మారి కుండ పోత వర్షం మొదలయ్యింది.

"ఇంత కష్టాన్ని నీ గుండెల్లో దాచుకున్నావా? పిచ్చిదానా... నాకు చెప్పొచ్చుగా? నేను చచ్చిపోయాననుకున్నావా? ఈ పుట్టెడు దిగులుకి కారకులెవరు? “మా శీను బావా?"


"ప్చ్..మీ బావకి అంత శీను లేదు."

"మీ కిందింటి వాళ్ళా?"

"ఊహూ. వాళ్లసలు పైకి రారు."

"నువ్వెవర్ని పైకి రానిచ్చావులే"


"ఏంటీ"


"ఏం లేదు. కథేవన్నా తన్నేసిందా?"

" నేను కథ రాస్తే నాకూ నీకూ తప్ప ఎవరికన్నా అర్ధమైందా? తన్నడానికి?"

"మరెందుకు ఈ విచారం? చెప్పవే. నీ బాధను నా దగ్గర విప్పవే."

"అది సరే. నువ్వెందుకు ఇంత సంతోషంగా కనబడుతున్నావ్? అది చెప్పు ముందు."

" అదా! ఓ గొప్ప రచయిత నా కథకు నాలుగు చప్పట్లు కొట్టి రెండు పువ్వు గుర్తులు పెట్టారు. తెలుసా"అంది వాణీ మొహం చాటంత చేసుకుని.

"ఎవరాయన?

"మన సమూహంలోనే వుంటారు. విపంచి గారనీ ఆయనే. ఇన్నాళ్లకు నా కథను గుర్తించారు."

"వా. ఏవే వా. నా ఏడుపుకి ఆయనే కారణం. నీకు చప్పట్లు కొట్టి పువ్వు గుర్తులు పెట్టారే??
నేనేం పాపం చేశానే. నాకు ఒక్క పూల గుత్తే పెట్టారే."

"ఊరుకోవే. ఆయన దగ్గర పూలగుత్తులు అయిపోయి వుంటాయిలే. మళ్లీ ఈ సారి పెడతారులేవే."

"అంతేనంటావా.  సర్లే. ఇప్పుడేం రాద్దాం."

"వచన కవిత రాద్దాం. మంగళవారం కామేశ్వరరావుగారు చక్కగా సమీక్షిస్తారు.."

"వా...వా..."
"మళ్లీ ఏవైంది"

"చూడు శంకర్ గారు అందరికీ చాలా బావుంది అని థంబ్ పెట్టారు. నాకు బావుంది అని మాత్రమే పెట్టారే.."

"పోన్లేవే. అందరికీ పెట్టి పెట్టీ ఆయన థంబ్ నొప్పేమో. ఈ సారి పెడతారులే.."

"అంతేనంటావా... హాయ్...ఇదిగో చూడు..ఉమా గాంధీ గారు నా బాల గేయానికి 'భారతి గారూ! మీ పద గాంభీర్యం లయ విన్యాసం అద్భుతం అన్నారే. ఇదిగో చూడు." కళ్ళు రంగు గోళీలల్లే మెరిపిస్తూ చెప్పింది భారతి.

"వా...వావా..."

"ఏవయ్యిందే వాణీ! ఇప్పటిదాకా నా వెన్ను తట్టావుగా...గాలి తీసిన బుడగల్లే ఆ చప్పుడు ఏవిటే?"

"నేను రాస్తానే గానీ పెద్దగా పాడలేనే. నా పాట ఎవరో పీక నొక్కినట్టు వస్తుందే. ఇప్పుడు కూడా ఏడుపు పైకి గట్టిగా రావట్లేదే.

ఆవిడ నన్ను వచ్చేవారం పాడమని, పాడకపోతే పూలగుత్తులు ,చప్పట్లు ఎమోజీలు తిరగేసి పెడతానని సందేశం పంపారు. ఇప్పుడేం చెయ్యనే? దేవుడా… ఇంత కష్టాన్ని తెచ్చిపెట్టావేవిటయ్యా."

"ఒక పనిచేద్దామే వాణీ. నేను పాడతాను. నువ్వే పాడినట్టుగా పెట్టెయ్యి.
ఆవిడకు తెలీదుగా. మనిద్దరిలో ఎవరిగొంతు ఏదో. ఆవిడ నీకు పెట్టిన పూలగుత్తులు కొన్ని నాకివ్వు చాలు..."అంది భారతి

"మంచి ఐడియా. కొమ్ముల వారు పెట్టిన చప్పట్లు కొన్ని నాకివ్వు. రాంబాబు గారు ఇచ్చే పూల గుత్తి, దణ్ణం ఒకటి నీకిస్తా! సరేనా"

"హమ్మయ్య...ఇప్పటికి మనసు కుదుట పడింది. ఇన్ని కష్టాలు మనం కాబట్టి ఇంత తెలివిగా తట్టుకుంటున్నాం. నెట్టుకొస్తున్నాం. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటో కదా పాపం. తల్చుకుంటేనే జాలేసి ఏడుపు తన్నుకొస్తోందే.."

"ఆ...అలాగే ఏడుస్తూ బుధవారం చిత్రకవిత రాయి. దుఃఖంతో రాసిన ఏ కవితైనా ఆ రోజుకి సరిగ్గా సరిపోతుంది..నిర్వాహకులవారు పొరపాటున ఏదన్నా గుర్తు పెడితే మనిద్దరం పంచుకుందాం"

"అయ్యో .మాటల్లో పడి వంట చెయ్యడం మార్చిపోయావే. ఇప్పుడెలా? మా మరిది నిన్ను తిడతాడేమోనే వాణీ..."అంది భారతి

"ఆ...ఏం ఫర్లేదులే. బహుశా ఈ పూటకి వంట చేసే పని ఉండక పోవచ్చు. నిన్న రాత్రి మీ మరిదికి రెండు కవితలు వినిపించా. ముందు ఆయన్ని స్నానాల గదిలోంచి బయటకు రానీ. అప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ ఇచ్చానంటే విందు భోజనం పెట్టినంత తృప్తిగా ఫీలవుతారు. పాపం అల్పసంతోషి.

"అవును.అచ్చం మనలాగే.."​.

*****

bottom of page