top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

ఎవరు? ఎందుకు?

 

నిర్మలాదిత్య

nirmaladitya_edited.jpg

"ఎవరు?", అంది లక్ష్మి. 

"టైం షేర్ , పోర్ట రికో ట్రిప్ అట", అన్నాడు రామం. 
 

సాయంత్రం ఇంటి వెనుకనున్న లానై లో వేసిన అవుట్ డోర్ సోఫాసెట్లో కూర్చుని చెస్ ఆడుతున్నారు రామం, లక్ష్మి లు. వారాంతాల్లో సాయంత్రాలు ఏదో ఓ పార్టీ అని హడావిడిగా ఉన్నా, వీక్ డేస్  లో రామంకి లక్ష్మి, లక్ష్మికి రామం, ఓ విసుగు సలపని సాన్నిహిత్యమే. 
 

రామం అప్పుడప్పుడు "మన జీవితం కూడ ఓ పసందైన సినిమాలాగే జరిగి పోయింది కదా", అని లక్ష్మీ తో సరదాగా చెప్తుండేవాడు. వారిద్దరే చూసిన ఆ సినిమాలో కొన్ని, కొన్ని దృశ్యాలు వారికి మాత్రమే, నవ్వు తెప్పిస్తే ఆశ్యర్యమేముంది. 
 

రామం, లక్ష్మిల జ్ఞాపకాలు వారి కాలేజీ చేరిన రోజులకు వెళ్లి పోయాయి. ఇద్దరూ స్టూడెంట్ లే.  ఆ రోజుల్లో ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు తక్కువే.   ఇక నెబ్రాస్కా యూనివర్సిటీ లో  చేరిన రామం, లక్ష్మి లకు  పరిచయం అవ్వడం, ఒకరికి ఒకరు నచ్చడం వల్ల, అతి త్వరలోనే విడలేని స్నేహితులుగా మారిపోవడం జరిగిపోయాయి. అది  ప్రేమగా మారడానికి అట్టే సమయం తీసుకోలేదు.  అప్పుడు వారికి ట్యూటర్ గా, అదో ఇదో స్టూడెంట్ జాబ్ చేస్తుండడం వల్ల వచ్చిన డబ్బే, ఆదాయం.   సెలవలు వస్తే ఏదైన ఓ యెల్లో స్టోన్ పార్కుకో లేక గ్రాండ్ కెన్యాన్ కో పోవచ్చునని ఆలోచన. 

 

అలాంటి సమయంలో ఓ కాల్ వచ్చింది. 'డు నాట్ కాల్' లిస్ట్, కాలర్ ఐ డి లేని రోజులు. ఏవో మార్కెటింగ్ కాల్స్ వస్తూనే ఉంటాయి.  లక్ష్మికి వచ్చిందా ఫోన్ కాలు. గ్రాండ్ కెన్యాన్ కు ఫ్రీ ట్రిప్. చేయవలసిందల్లా, ఆ ఊళ్ళోనే ఉన్న ఊరి చివరి ఆఫీసులోకి వెళ్లి, అక్కడ వారిని కలవడమే. రామంకు ఆ విషయం చెప్పడం తో తనూ ఎగిరి గంతేసి తప్పకుండా ఆ ఆఫీస్ వాళ్ళని కలుద్దామన్నాడు. ఆ వీకెండ్, లక్ష్మి, రామం లు,  ఓ మైలు కాలి నడకన నడిచి, రెండు బస్సులు మారి ఆ ఆఫీసుకు చేరారు. అక్కడ వారితో పాటు మరో పది మంది కూడా కనిపించారు.  అందరూ తమలాగే ఫోన్ కాల్ కి స్పందించి వచ్చిన వారే.  అందరిని ఓ కాన్ఫరెన్స్  రూమ్ కు తీసుకెళ్లి వాళ్ళ కంపెనీ గురించి, అన్ని టూరిస్ట్ ప్రదేశాలలో ఉన్న వారి, రిసార్ట్లు, వెకేషన్ హోమ్ లు ను చూపెట్టి, టైమ్ షేర్లు కొనమని చెప్పారు. వాళ్ళ టైం షేర్లు కొంటె,  గ్రాండ్ కెన్యాన్ మాత్రమే కాదు, అమెరికా మొత్తంలో  ఎలా కానీ ఖర్చు లేకుండా వెకేషన్ హోమ్స్ దొరుకుతాయో విశదీకరించారు.  మీటింగ్ తరువాత, వచ్చిన వారిని వేరు, వేరు రూములకు తీసుకెళ్లి మళ్ళీ తమ సేల్స్ పిచ్ మొదలు పెట్టారు. లక్ష్మి రామంలు బిక్క మొహాలు వేసుకొని, తామింకా స్టూడెంట్ లే నని, వారు అమ్ముతున్న షేర్లు కొనే తాహతు లేదని చెప్పి, తప్పించుకొనే సరికి తల ప్ర్రాణం తోకకు వచ్చింది. తిరిగి రెండు బస్సులు పట్టుకొని హాస్టల్ చేరేసరికి పొద్దుపోయింది. బాగా అలసి పోయారు. తరువాత ఇక్కడే స్థిరపడడం తో, అలా ఫోన్ కాల్ నమ్ముకొని ఎలా మోసపోయాం, అని తలచుకున్నప్పుడెల్ల ఇద్దరికీ నవ్వు ఆగదు.
 

ఇద్దరూ అలా నవ్వుతుండగానే, లక్ష్మి రాణి పావును మరో అడుగు ముందుకు జరిపింది.  ఇంతలో, లక్ష్మికి కాల్.  మీ ఎత్తే, అంటూ, లక్ష్మి ఫోన్ తీసుకుంది. రామం ఏనుగును ముందు పంపించాలా, గుర్రాన్ని వెనక్కి తీసుకోవాలా అని ఆలోచిస్తూనే, లక్మి మాటలు కూడా ఓ చెవి తో వింటున్నాడు. ఎక్కువ 'ఆహా', :హా' లే వినిపిస్తున్నాయి. "ఈమెయిల్?', అని లక్ష్మి సందిగ్ధంలో పడినట్లు మాటలు వినపడ్డాయి. ప్రశ్నార్థకంగా తలెత్తాడు రామం. లక్ష్మి తన ఇమెయిల్  అక్షరం  తరువాత అక్షరం, విడమరచి  అవతలి మనిషికి అర్ధం అయ్యేలా చెప్పడం,  వినడంతో రామం ఆశ్యర్యంగా ముఖం  పెట్టాడు. రామం కు,  ఇలా మార్కెటింగ్ కాల్స్  ఇష్టం ఉండదు.  పొరబాటున రామం అలాంటి కాల్ ఎత్తుకుంటే, కాల్ చేసిన వాడికి  తిట్ల వర్షమే. 'డు నాట్ కాల్' లిస్టులో ఉన్నామని కాల్ చేయొద్దని. లక్ష్మి అలా కాదు. వాళ్ళు పొట్టకోసమే కదా అవస్థ పడుతున్నారు. ఇష్టం లేకపోతే ఎత్తకండి, లేక మర్యాదగా పెట్టేయండి. ఎందుకు వారిని అరవడం. లక్మి  మాట తీరు చూసి చాలా మంది ఆపరేటర్ లు తమంత తామే, లక్ష్మి ఫోన్ నంబర్ కి మళ్లీ కాల్ చేయమని, ఆ నంబర్ ను తమ సెంటర్ లో ఉన్న, 'డు నాట్ కాల్' లిస్టులో జత చేసేస్తుంటారు. రామం  కు అలాంటి అనుభవాలు లేవు. 
 

"మీకొచ్చిన ఫోన్ కాలే, ఇది కూడా. ఇదివరకే మీతో మాట్లాడారట. మీరు కట్ చేశారని నాకు ఫోన్ చేసారు", అంది లక్ష్మి.
 

"చేస్తే నీ పర్సనల్ వివరాలు ఇవ్వడమే? చెప్పాను కదా దాని వలన రిస్క్", రామం నొచ్చుకుంటూ అన్నాడు.
 

"పర్సనల్ ఎక్కడ, రామం? మన పేర్లు ఇదివరకే, తెలుసు వారికి.  అడ్రస్ అడిగారు. వీలు పడదన్నాను. కనీసం ఇమెయిల్ అడ్డ్రస్సు ఇవ్వమన్నారు. నేను అరుదుగా ఉపయోగించే హాట్ మెయిల్ అడ్రస్ ఇచ్చా. అదే పోర్ట రికో ట్రిప్ టికెట్లు  హోటల్ ఫ్రీ బుకింగ్ పంపి స్తానన్నాడు. మన వివరాలు తెలిసిన మనిషి లాగ, నమ్మకస్తుడిగ అనిపించింది", అంది లక్ష్మి

"ఇదో ఇలానే సోషల్ ఇంజనీరింగ్ చేసి, మన పేరు మీద డబ్బులన్నీ ఊడ్చేస్తారు. నువ్వు వట్టి అమాయకురాలు", రామం ఆప్యాయంగానే అన్నాడు.
 

" పోనీ అమాయకురాలే అనుకో. ఒక ఈమైయిల్ అడ్రస్ తప్పితే కొత్తగా ఏమి చెప్పలేదుగా. ఎందుకో, ఆ మనిషిని  నమ్మబుద్ది అయ్యింది. నా నమ్మకం సరి అయితే  పోర్ట రికో టికెట్లు వస్తాయి. లేకపోతే జరిగే నష్టం ఏమి లేదు. మన బాంక్ అకౌంట్లు అన్ని గూగుల్ జి మెయిల్ తో ముడి పడి ఉన్నాయి. ఆ అడ్రస్ ఎవరితోనూ పంచుకోవటం లేదు కదా. ఈ హాట్ మెయిల్  అడ్రెస్ లీక్ అయినా ఫరవాలేదు. ఎలాగూ అందులో వచ్చేది స్పామ్ మెయిల్స్ మాత్రమే", అంది లక్ష్మి.

లక్ష్మి ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి తప్పు చేసిందని, రామం మనస్సులోనే మధన పడుతూ లక్ష్మి తో చెస్ ఆడుతున్నాడు.
 

ఓ పావు గంట తరువాత లక్ష్మి ఫోన్ పైన మెసేజ్ అలెర్ట్ వినిపించింది. లక్ష్మి ఆట ఆపి, ఫోన్ చూసి, "టికెట్లు వచ్చేసాయి రామం",  అంటూ కేక వేసింది.
 

రామం అపనమ్మకంగా, "మరో సారి చెక్ చేయి లక్ష్మి", అన్నాడు.
 

" పోర్టరికో కు ఇక్కడ నుంచి బిజినెస్ క్లాస్ టికెట్లు. అక్కడ ఉండడానికి విందం రిసార్ట్ లో రిజర్వేషన్", అన్నది  ఆశ్చర్యం నుంచి తేరుకొనని లక్ష్మి.

 

రామంకు కూడా తెగ ఆశ్చర్యం గా ఉంది.  ఎయిర్ లైన్స్, రిసార్ట్ వెబ్ సైట్ లకు వెళ్లి చెక్ చేసాడు. లక్ష్మి చెప్పింది నిజమే. రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరో ఆగంతకుడు ఉన్నట్టుండి ఫోన్ చేసి, ఓ కాన్ఫరెన్స్ కి ఓ రెండు గంటల పాటు వస్తే చాలని ఎందుకు పిలుస్తాడు? ఆ కాన్ఫరెన్స్ కని ఎందుకు ఇంతగా ప్రయాణపు ఖర్చులు పెడతాడు. ఏదో తిరకాసు ఉందని రామం మనస్సులో, సందేహం మరింత లోతుగా వేళ్ళు పాతుకుంది.

లక్ష్మి మాత్రం ఆనందంతో తన ఫ్రెండ్స్ కు ఆ ట్రిప్ వార్త అందజేస్తూ ప్రయాణానికి ఏమి తీసుకెళ్లాలన్న ఆలోచన లు పంచుకుంటూ, అవతలి వారి శుభాకాంక్షలు, సలహాలను వింటున్నది.


అలా అనుకుంటుండగానే, ప్రయాణం చేసే దినం వచ్చేసింది. 
 

రామంకు ఇలా తెలియని వారిని ఎర వేసి, పిలిచి చంపే హారర్ సినిమాలు, నవలలు గుర్తుకొచ్చాయి. 

"లక్ష్మి , పోవాల్సినదేనా. కావాలంటే నేనే మరో ట్రిప్ ప్లాన్ చేస్తాను. లేకపోతే ఓ క్రూయిస్ కి పోదాము. ఎటూ మన ఊరు  నుంచే అన్ని క్రూయిస్  ఓడలు బయలు దేరుతాయి కదా", అని లక్ష్మి మనస్సు మార్చడానికి ప్రయత్నించాడు రామం.
 

"అబ్బే రామం, నీకన్నీ అనుమానాలే. ఎవరో తెలిసిన మనిషే, మనకు ఓ సర్ప్రైజ్ ఇస్తానంటున్నప్పుడు, హాయిగా వెళ్లి ఎంజాయ్ చేసి రావాలి కానీ ఇలా అనుమానాలతో నరక ప్రాయం చేసుకోవడందేనికి? అయినా మనం ఈ ట్రిప్ కు పోతున్నామని మన స్నేహితులకు తెలుసు. పిల్లల దగ్గిర మన లొకేషన్ ట్రాక్ చేయడానికి మన ఫోన్లు ఎలానో ఉన్నాయి. ఎలా రిటైర్మెంట్ జీవితమేగా.  పని నుంచి సెలవులు తీసుకునే సమస్య కూడా లేదు", రామం భుజం ప్రేమతో నొక్కి' పోదాం పదండి ' అన్న ముఖం పెట్టింది లక్ష్మి.

డైరెక్ట్ ఫ్లైటే, మూడు గంటలు.  పొద్దున 8కు బయలు దేరితే 11 కంతా సేన్ యువాన్ లో ఉన్నారు. అయ్యో ఫ్లైట్ హోటల్ ఇచ్చారు కానీ, రెంటల్ కార్ మరచిపోయారే అని రామం అనుకున్నాడు. లక్ష్మి ప్లేన్ లో పక్కన కూర్చున్న వారితో వీడ్కోలు తీసుకోబోతున్నది. అపరిచితులతో ఇట్టే కలసి పోగలదు లక్ష్మీ. దానికి తగట్టు తనకు పరిచయమైన వారందరు ఎందుకు మంచి వారు లాగే, ఎంతో ఆప్యాయంగా కనిపిస్తారో రామం కు అంతు బట్టని విషయం. కొద్ది పరిచయంతోనే స్నేహితులుగా మారిపోతారు. 

లక్ష్మి నూతన మిత్రులు, తమ కారులో డ్రాప్ చేస్తామనడం వినపడింది  రామంకు, అంత హడావిడిలోనూ. రామం దృష్టి, ఇంతలో,  తమ పేర్లు ఉన్న బోర్డు చేతిలో పట్టుకొని, బయట వేచి ఉన్న మనిషి పైన పడింది. లక్ష్మి చేయి పట్టుకొని లాగి, ఆ వ్యక్తి వైపు చూపించాడు. 

"హా! పోదామాగండి " అని "ఇదిగో ఇది మా వారు", అని రామం ను లక్ష్మి తన కొత్త స్నేహితులకు  పరిచయం చేయబోయింది.

రామం హడావిడిగా, 'హలో' , హాయ్' అంటూ పలకరించి,  అదే ఊపుతో చేతులు కలపడం, వీడ్కోలు కూడా ఆ కొత్త మిత్రులతో ముగించేశాడు. అలానే లక్ష్మి చేయి పట్టుకొని,  బోర్డు పట్టుకున్న మనిషి వైపు అడుగులు వేసాడు. రామం అంచనా సరినే. ఆ బోర్డు పట్టుకొన్నతను లక్ష్మి రామం లను తీసుకెళ్లడానికి వచ్చిన డ్రైవరే. కాదంటే అతను నడుపుతోంది లిమోసీన్ అన్న విషయమే ఆశ్చర్యం! అక్కడ ఉన్న మూడు రోజులు తానే వారు తిరగాల్సిన అన్ని చోట్లు తిప్పగలనని చెప్పాడు. 


క్యారీ ఆన్ సూట్ కేసులు మాత్రమే కాబట్టి ఎయిర్పోర్ట్ బయట రావడానికి, కార్లో కూర్చోవడానికి పెద్ద సమయం పట్టలేదు.

లిమో లో తాగటానికి కాఫ్, టీ, డ్రింక్స్ స్నాక్స్ ఉన్నాయి. రామం కాఫీ, లక్ష్మీ టీ కప్పులలో పోసుకొని తాగుతూ కిటికీ బయట కొత్త నగరం పోకడలు చూస్తున్నారు. సిటీ బయటకు రాగానే రోడ్డు రెండు వైపుల షెడ్లలో ఉన్న అంగళ్ళు , అసలు అమెరికాలోనే ఉన్నామా అనే సందేహాన్ని రప్పించేలా ఉన్నాయి.  రామంకు లిమో డ్రైవర్ ను అడిగితే తమను పిలిపించినతని విషయాలు తెలుసుకోవచ్చునేమో నన్న ఆలోచన ఒక్క సారి ఉత్సాహం, రిలీఫ్ కలుగ చేశాయి. డ్రైవర్ పేరు రాబర్ట్ అని అత నేసుకున్న కోటు మీదున్న నేమ్  ప్లేట్ ద్వారా తెలీసింది రామంకు.

"హే బాబ్ ..మమ్మల్ని పిలిపించిన వ్యక్తి, సంస్థ గురించి నీకేమైనా తెలుసా" అని ఆడిగాడు.
 

ఆ డ్రైవర్ నవ్వుతూ "మాది కాన్ట్రేక్టు కంపెనీ అండి. నాకు ఆ విషయం తెలీదు", అన్నాడు. లక్ష్మి కి సంభాషణలు ఏమీ పట్టినట్లు  లేదు. రోడ్డు పక్కనున్న జనాలను, గోడల పైనున్న గ్రాఫిటీ అన్నీ వింతగా చూస్తున్నది.

రిసార్ట్ పెద్దదే. రూమ్ చేరిన తరువాత బాల్కనీ బయటకొచ్చి చూస్తే కింద జనాలతో కిక్కిరిసిన విశాలమైన పూల్. అటు పక్కన అంతే విశాలమైన, పిల్లలకని అంత లోతు లేని పూల్.  కొందరు పూల్ వాలీ బాల్, కొందరు ఈదుతూ, కొందరు రంగు రంగులలో ఉన్న ప్లాస్టిక్ తెప్పల పై పడుకొని తేలుతూ కనిపించారు.  చుట్టూ ఉన్న కుర్చీలు, పడకల పైన కూడా జనాలు కూర్చొని, పడుకొని కనిపిస్తున్నారు. పూల్ కి అటు వైపు పచ్చటి పచ్చిక బయళ్లు. అది దాటితే రిసార్ట్ ప్రైవేట్ బీచ్ మొదలవుతుంది. తెల్లటి ఇసుక, నీలి సముద్రం అక్కడా తిరుగుతున్న జనాలతో కంటి కొన దృశ్యాలు కూడా అందంగానే కనిపిస్తున్నాయి.

రామం, లక్ష్మీ లకు రూము లోనే కాంప్లిమెంటరీ భోజనాలు, అందమైన పూలు, సువాసనలు పంచే కొవ్వొత్తి దీపాలు ఎప్పటికప్పుడు అమర్చడం, ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగ చేసింది. “పోయిన ప్రతీ చోటా ఇలా వుంటే ఎంత బాగుంటుంది” అప్రయత్నంగా అనుకుని రామం తో చెప్పింది. రామం కు ఇవేమీ పట్టలేదు. 
 

"లక్ష్మి, తొందరగా బయలుదేరు. కాన్సీ ఆర్జ్ వాళ్ళనడిగితే బహుశ మన ప్రయాణం స్పాన్సర్ గురించి తెలిసొస్తుందేమో" అని తన ఆలోచన స్రవంతి నుంచి విడిపోలేక చెప్పాడు. చుట్టూ ఉన్న దృశ్యాలని కొత్తగా చూస్తున లక్ష్మికి ఇవేమీ పట్టలేదు. అన్యమనస్కంగానే, "సరే రామం. అలాగే చేద్దాం. ముందు బీచి కి పోదాం రండి. అక్కడ గంటలు నినిషాలలాగా గడచిపోతుందనిపిస్తుంది. దారిలో ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర ఆగితే మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో", అంది లక్ష్మీ.  బీచ్ లో సమయం అట్టే నిమిషాల్లో గడిచిపోయింది కానీ, రామం అనుకున్నట్లు ఇన్ఫర్మేషన్ డెస్క్ వాళ్ళు కూడ తమ ట్రిప్ స్పాన్సర్ గురించిన వివరాలు ఇవ్వలేక పోయారు.

 

మరుసటి రోజు పొద్దునే లేచి బ్రేక్ఫాస్ట్ అక్కడున్న ఐదు రెస్టౌరెంట్లలో ఒక దాంట్లో చేశారు. తినేసి ఇంకా ఈ వేళ ప్రోగ్రాం ఏంటి అని ఆలోచిస్తున్నాడు, బాబ్ ఎదురొచ్చాడు.

 

 "బాబ్ ఇవాళ్టి ప్రోగ్రాం ఏంటి?" అంటుండగానే, "దానికే వచ్చాను రామ్. దగ్గరే యూన్కే రైన్ ఫారెస్టు ఉంది. బాగుంటుంది", అన్నాడు బాబ్. 

 

లక్ష్మి కూడా ఆ వర్షప్రాంతపు అడవులను చూడాలని ఈ ప్రోగ్రాం తెలిసినప్పటి నుండి అప్పుడప్పుడు చెప్తూ ఉండడం వల్ల రామం వెంటనే "గ్రేట్ ఐడియా" అంటూ లక్ష్మితో పాటు రిసార్ట్ లాబీ బయటకు అడుగులు వేసాడు. 

రిసార్ట్ కు దగ్గరే ఉంది. ఓ 10 నిమిషాలలోపే యూన్కే పార్క్  కు చేరుకున్నారు. అక్కడ నుంచి ఓ కొండ ఎక్కినట్లే. బాబ్ అక్కడక్కడ ఆపి ఆ పార్క్ విశేషాలను వివరిస్తూ డ్రైవింగ్ తో పాటు ఓ మంచి గైడ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. 1 మైలు కాలి దోవ లో ఆ ట్రయల్ లో వెడితే అందమైన జలపాతాలు ఉన్నాయి అంటూనే, లక్ష్మీ తెగ ఉత్సాహం తో కారు దిగింది. బాబ్ ఇదివరకే ఎన్ని సార్లు చూసి ఉంటాడో, తాను కారు దగ్గిరే ఉంటానన్నాడు.


 

ఇద్దరి కాలి నడక కోసం మాత్రం అనువుగా కట్టిన ట్రయిల్ లో వడి వడిగా అడుగులు వేయసాగాడు రామం. లక్ష్మీకి అంతా వింతే. మనం చూడని ఎన్ని రకాల చెట్లు, మొక్కలు, పూలు, ఆ పడిపోయిన చెట్టు మీద చేరిన పచ్చటి నాచు పట్టు తివాసి లాగా అనిపించడం లేదు, పడిపోయినా చెట్టు పైన, చుట్టూ చిగురిస్తున్న కొత్త మొక్కలు ఆ చెట్టుకు మళ్ళి జీవితం ఇస్తున్నట్టులేదు. లక్ష్మీ తన ఆలోచనలు మాటల ద్వారా రామంకు ఎడతెరపి లేకుండా చెప్తూనే ఉంది. కానీ రామం ఆలోచనలు కూడా అదే వేగంగా పరిగెడుతుండడంతో, లక్ష్మి మాటలకు అన్యమనస్కంగా ఊకొడుతూ, ఆ పార్కుకు సుదూరంగా తన పాత జ్ఞాపకాల అరలను ఒక దాని తరువాత మరోటి తెరుస్తున్నాడు. 

"ఒక వేళ ఆంబర్ ఈ సర్ప్రైజ్ ఇస్తున్నదా?", అనుకున్నాడు రామం. 

రామం డైరెక్టర్ ప్రమోషన్ కోసం తెగ ప్రయత్నిస్తున్న రోజులవి. అప్పటికే ఓ సారి ప్రమోషన్ మిస్ అయ్యింది. అప్పుడే తమ కంపెనీ కూడా మెంటర్ ప్రోగ్రాం మొదలెట్టింది. హెచ్ ఆర్ వారు పంపించిన వివరాలు ప్రకారం, ఎవరైనా జూనియర్ కి మెంటర్ లాగా ఉండి, వారు పనిచేయడానికి,   పని  చేయడంలో  నైపుణ్యం  పెంచడానికి దోహద పడితే, దానికి మంచి బోనస్, ఇంకా ప్రమోషన్ కూ వీలవుతుంది అని తెలిసింది. దానితో ప్రమోషన్ పొందడానికి ఇదే అనువైన మార్గం అనుకున్నాడు, రామం.

 

రామం ఆ పథకం ప్రకారం తన మెంటర్ గా ఎవరిని పట్టాలి, తాను ఎవరికి  మెంటర్ కావాలి అన్న ఆలోచనలో పడ్డాడు. తన ప్రమోషన్ కు, భవిషత్తులో పైకి పోయే అవకాశాలున్న అధికారిని పట్టాలి. అప్పుడు ఆ అధికారి ఎదుగుదల, రామంకు నిచ్చెన లాగా ఉపయోగపడుతుంది.   అలానే పట్టాడు రామం. మరోవైపు,  ఓ మెరుపు లాంటి అబ్బాయి, అమ్మాయి తనను మెంటర్ గా ఎన్నుకుంటే తన ప్రమోషన్ ఖాయం. ఆ పని చాన్సు కు వదిలేయదలచుకోలేదు రామం. కొత్తగా కాలేజి నుంచి ఎన్నుకోబడి, గత రెండు ఏళ్లుగా పని చేస్తున్న  ఉద్యోగుల ప్రొఫైల్స్ చూడడంతో బాటు,  తన సహా ఉద్యోగులనుండి కూడా చూచాయగా వాకబు చేయడం మొదలెట్టాడు. అలా వెదుకుతున్నప్పుడు ఆంబర్ రామం దృష్టికి రావడంలో అట్టే సమయం పట్టలేదు. టౌన్ హాల్ మీటింగు జరుగుతున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల లో పని చేస్తున్నవారు కలిసినప్పుడు ఆంబర్ ను గుర్తించి తనే మాటలు కలిపాడు. అటు తరువాత తాను పని చేస్తున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చేరమని, అది ఆంబర్ కెరీర్ కు బాగా పనికి వస్తుందని చెప్పడం, దానికి ఆంబర్ ఒప్పుకోవడానికి పెద్ద శ్రమ పడనవసరం లేక పోయింది. ఆంబర్ తన నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయలేదు. అతి కొద్ది రోజుల్లోనే పని నేర్చుకొని, కంపనీకి మరింత ఆదా చేసే ప్రాజెక్టులు విజయవంతంగా ముగించి, డిపార్ట్మెంట్ కు మంచి పేరు, ఆదాయం తెచ్చి పెట్టింది. ఆంబర్ ఇచ్చిన ఐడియాలు, చేసిన పనిలో తన వంతు కూడా ఉందని చెప్పుకొని రామం ప్రమోషన్  కొట్టివేశాడు. ఆంబర్ కు కూడా, తాను ప్రమోషన్ ఇవ్వగలగడం వల్ల ఆంబర్ పెద్దగా ఈ విషయం పట్టించుకోదని రామం నమ్మకం.  ఆంబర్ అమెజాన్ అడవులలో ఓ నెల సెలవు వెళ్లడం, మరుసటి సంవత్సరం కోస్ట రికా అడవులకు వెళ్లడం గుర్తుకు వచ్చింది. ఆంబర్, లక్ష్మికి బాగా పరిచయం ఉన్నవ్యక్తినే. వాళ్లిద్దరూ సముద్ర తీరం వెంట, రోడ్ల పక్కనున్న, చెత్త ఎత్తివేయడం ఉద్దేశం గా, ఏర్పడ్డ ఓ కాలుష్య నివారణ స్వచ్చంద ఉద్యమంలో మెంబెర్లుగా పని చేస్తుండడంతో రామం కంటే ముందే పరిచయముంది. ఆ పరిచయం వల్లే ఆంబర్ రామం టీమ్ లో వెంటనే చేరడానికి ఒప్పుకుందని రామం కు చాలా రోజుల తరువాత తెలిసింది. రామం టీములో ప్రమోషన్ తరువాత అంచెలు అంచెలుగా ఆంబర్ అతి త్వరలోనే టాప్ ఎగ్జిక్యూటివ్ అయ్యింది. ఒకవేళ ఆంబర్ ఈ ట్రిప్ కు కారణమేమో అనిపించింది రామంకు. వెంటనే ఫోన్ తీసి ఆంబర్ కు డయల్ చేసాడు. వాయిస్ మెయిల్ కు వెళ్ళింది. లక్ష్మి వైపు చూసాడు. లక్ష్మి చూపులు అక్కడి ప్రకృతి అందాలపై, పువ్వు నుంచి పువ్వుకు తిరుగుతున్న తేనెటీగల లాగా, నాట్యం చేస్తున్నాయి.  ముఖంలో ఏదో ఆనందం. 

నేనేమిటి మిస్ అవ్వుతున్నానన్న అనుమానంతో నే 

"లక్ష్మీ , ఆంబర్ తెలుసు కదా. తనకు రైన్ ఫారెస్టులు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. తనేమైనా ఈ ట్రిప్ మనకు స్పాన్సర్ చేసిందేమో.అయినా ఎందుకు తెగ ఆనంద పడిపోతున్నావు", అన్నాడు.
 

"రామం! దూరం లో జలపాతం చప్పుడు వినపడటం లేదు? మనం నడిచే కొద్దీ శబ్దం ఎక్కువవుతోంది. ఇప్పుడు జలపాతం చప్పడు తో పాటు, రాళ్ళ మీద శర వేగంతో ప్రవహిస్తున్న ఏటి శబ్దం కూడా వినిపిస్తుంది. ఎంత బాగుందో కదా" లక్ష్మి తన సంతోషం, రామం కూడ పంచుకొంటాడేమో అని చెప్పింది. 

రామం ముఖంలో ప్రశ్న ఇంకా కనిపిస్తుండడంతో, "పోనీ ఆంబర్ కు ఫోన్ చేయక పోయారా?", అంది లక్ష్మి. 
 

ఆంబర్ కు రామం తో టీములో చేరిన తరువాత రామం మీద అంత పెద్ద అభిప్రాయం లేదని లక్ష్మీ కి తెలుసు. కానీ రామం,  తన వల్లే,  ఆంబర్ ఇప్పుడు ఈ ఉన్నత స్థాయి లో  ఉందని అప్పుడప్పుడూ గొప్పలు చెప్పటం వల్ల, ఆ మాట  తనతో పంచుకోలేదు , ఇప్పడూ చెప్పలేదు.
 

"ఇప్పుడే చేసాను. ఫోన్ ఎత్తలేదు. నా అవసరం తీరిపోయింది కదా", వాపోయాడు రామం.

"అబ్బే ఆంబర్ అలాంటి మనిషి కాదు. ఏదో మీటింగ్ లో ఉండి ఉంటుంది",అని లక్ష్మి అంటుండుండగానే, రామం ఫోన్ మ్రోగింది. 

ఆంబర్ నుంచే కాల్ అన్నట్లు సంజ్ఞ చేసి, ఆంబర్ తో హలో అన్న స్మాల్ టాక్ తరువాత, ఇప్పుడు యూన్ కే పార్కులో ఉన్నట్లు చెప్పాడు. అలానే తాము ఎలా ఈ ఫ్రీ ట్రిప్ మీద వచ్చింది, దాని వెనకాల ఆంబర్ హస్తముందేమో నని, నవ్వుతూనే తన మది తొలుస్తున్న ప్రశ్నను, ఆంబర్ ముందు పెట్టాడు. ఆంబర్ రామం ట్రిప్ కు, తనకు సంబంధం లేదని, అదో లాంటి నవ్వుతో స్పష్టం చేసేసి ఫోన్ పెట్టేసింది. రామం ముఖం లోని మార్పులు చూసిన లక్ష్మికి విషయం అర్ధం అయిపోయింది. ఇంకో మైలే అంటూ రామం చేయి పట్టుకొని జలపాతం వైపు అడుగు వేసింది.


 

జలపాతం, మరిన్ని ఆకర్షణలు చూసి కారులో అడుగు పెట్టగానే బాబ్ “రాత్రి 7 గంటల కే మీ ఫంక్షన్. ఇంకా వ్యవధి ఉంది. అలా సేన్ యువాన్ కోటలు అక్కడినుంచి, బకార్డి రమ్ ఫ్యాక్టరీ చూద్దాం రండి” అంటూ కారు స్టార్ట్ చేసాడు.


 

సముద్రం పక్కనున్న కోటలో  నుంచి సుదూరంలో ఉన్న ఓడలు కాగితం పడవల్లాగా, సముద్రపు అలలు నీలం కాఫీ పైన తెల్లటి నురగల లాగా కనపడడంతో ఆనందంతో ఇంకా పెద్దవి అయ్యాయి. రామం ఆ సముద్రం కంటే ఎక్కు లోతు ఆలోచనలలో నిమగ్నమై పోయాడని, చెప్పాలనుకొన్నది ఆపుకొని, ఇంకా చూడని అందాలు వింతలు వెదుక సాగింది. అక్కడి నుండి బకార్డి రమ్ ఫేక్టరీ కి తీసుకెళ్లాడు రాబ్. చెరుకు పండించే ఆ ప్రాంతంలో రమ్ కోసం ఓ ఫేక్టరీ ఏర్పడడం అంత ఆశ్చర్యం లేదు. ఎదో సోషల్ డ్రింకింగ్ కే అలవాటు పడ్డారు కాబట్టి,  అక్కడ పొగుడుతూ  రుచి కని అందించిన రమ్ శాంపిల్ ఇద్దరూ తీసుకోలేదు. 


 

రాబ్ వారిద్దరూ రమ్ ముట్టలేదని తెలిసి, మీరు రుచి చూడాల్సిందే అని హిల్టన్ హోటల్ కు తీసుకెళ్లి,  "ఇక్కడి బార్ టెండర్ పిన కోలాడా కనుక్కున్నాడు, మీరు తీసుకోండి. సాన్ యువాన్ వచ్చి పిన కోలాడా త్రాగలేదంటే అది నాకు అవమానమే",అంటూ నవ్వుతూ చెప్పాడు.


 

పైన్ ఆపిల్, కొబ్బరి క్రీము, రమ్ , ఐస్ కలిపి ఇచ్చిన డ్రింక్ ఇది వరకే రుచి చూసినా, "ఇక్కడి రుచి కొంచెం బాగుందనిపిస్తున్నది కదూ" అంది లక్ష్మి సిప్ చేస్తూ.

రామం మనస్సు అబ్బాయి వాసు మీదకి వెళ్ళింది. ఎంతో తెలివైన వాడు వాసు. తప్పకుండా ఏ డాక్టరో, ఇంజనీరో అవ్వుతాడనుకున్నాడు రామం. క్లాసు ఫస్ట్ కాబట్టి రామం కు వాసు ను తన కొడుకుగా చెప్పుకోవడంలో తెగ సంతోష పడేవాడు. హై స్కూల్ వచ్చే సరికి వాసు బాగా మారిపోయాడు. టీన్ ఏజ్ అని మొదట్లో అనుకున్నా, ఆ సమస్య రామంకు వాసుకు  ఇంకా ఎక్కువైందే గాని తగ్గ లేదు. వాసు మొదటి నుంచి లక్ష్మి దగ్గరే చనువు. లక్ష్మి వంట చేస్తున్నప్పుడల్లా వాసు లక్ష్మికి పక్కనే ఉండి కబుర్లు చెప్తూ, తానూ వంటలో సాయ పడే వాడు. ఏవేవో కొత్త వంటకాలు ఇద్దరు తెగ నవ్వుతూ వండే వారు. హైస్కూల్ వచ్చే సరికి వాసు నేను పై చదువులకి లిబరల్ ఆర్ట్స్ కాలేజీకి పోతానంటే తెగ చీరాకు వేసింది రామంకు. "నీకొచ్చిన స్కోర్ లకు  ఐవి లీగ్ కాలేజీలకే అడ్మిషన్ దొరుకుతుంది, అక్కడి నుంచి నువ్వో మెడికల్ లేక లా, అదీకాదంటే మనేజ్మెంట్ కాలేజీకి వెళ్ళవచ్చు", అంటూ రామం పదే పదే చెప్పి చూసాడు. వాసు రామం మాటలు వినకపోవడంతో రామంకు బాగా కోపం వచ్చేసి వాసు తో మాట్లాడం బాగా తగ్గించేశాడు. వాసు అలా లిబరల్ కాలేజీలో డిగ్రీ తెచ్చుకొని, ప్రపంచం చూడాలంటూ ఓ దేశ దిమ్మరి లాగా రెండు ఏళ్ళు తిరిగాడు. వచ్చిన తరువాత రెస్టౌరెంట్ పెడతానంటూ మరో రెండు ఏళ్ళు గడిపేసాడు. తరువాత నాపా వ్యాలీ కి వెళ్లి కొన్ని రోజులు ఓ ద్రాక్ష తోటలో వైన్ టేస్టర్ గా అప్రెన్టిషిప్ చేసాడు. ఈ మధ్యనే వాసు ఓ కొత్త ద్రాక్ష తోటలో భాగస్తుడిగా చేరి కొత్త బ్రాండ్ వైన్ లు తయారు చేస్తున్నాడని, బాగానే, అంటే డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని రామం విన్నాడు.

 

ఎప్పుడు రామం ను కానీ లక్ష్మిని కానీ తనకంటూ డబ్బు అడగలేదు. వాడి తెలివికి, స్కాలర్షిప్, స్పాన్సర్షిప్ అంటూ వాడి చదువుకు, తిరుగుడులకు డబ్బులు వస్తూనే ఉండేవి. వాడి ప్రపంచ ట్రిప్ ఏదో టీ వీ వాళ్లే స్పాన్సర్ చేశారు.   లక్ష్మినే బలవంతంగా గుడ్డలు కొని పంపిస్తుండేది. వీలైనప్పుడెల్లా డోర్ డాష్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసేది, వాసు కు.  వాసు తనకంటూ ఒక గమ్యం కల్పించుకొని చేరడం,  అదీ రామం సహాయం లేకుండా, రామం కు ఒక   పక్క సంతోషం కలిగించినా,   మరో పక్క ఎదో ఒక వెలితి.


 

ఒక వేళ వాసు ఈ సర్ప్రైజ్ ఇస్తున్నాడా. వాడికి ఈ టికెట్లు  కొనడానికి అన్ని వివరాలు తెలుసు, కారణం కూడా ఉంది. లక్ష్మి తన లాగా ఎవరు టికెట్లు కొన్నారన్న ఆలోచన లేక, ఇలా బిందాస్ గా తిరగడానికి కూడా కారణమేమో. ఒక్క సారి కొరక రాని సమస్యకు జవాబు దొరికినట్లైయ్యింది. 


 

వెంటనే ఆనందంగా "లక్ష్మి, వాసు పంపించాడు కదా ఈ టికెట్లు ఈ ట్రిప్ కి. ఇద్దరూ కలిసి భలే సర్ప్రైజ్ ఇచ్చారు", అన్నాడు రామం


 

"అబ్బే లేదు రామం. నిన్ననే వాసు తో మాట్లాడి ఇక్కడికి పోతున్నామని అన్నాను. వాడు ఆశ్చర్య పడ్డాడు, ఎవరు ఈ ట్రిప్ ని స్పాన్సర్ చేశారని", లక్ష్మి, రామం ఆనందపు పొంగు పై నీళ్లు చల్లేసింది.

లక్ష్మికి రామం అంతర్మధనం అర్ధమౌతూనే ఉంది.
 

"అన్నీ ట్రాన్సాక్షన్ లాగా చూడద్దు రామం. జీవితం వ్యాపారం కాదు.  ఎవరో మనల్ని మోసం చేయాలనో, ఏదో మనం చేసిన పని వల్ల కృతజ్ఞతతో ఈ ట్రిప్ మనకు దొరికిందనో, ఎందుకు కారణాలు వెదుకుతావు. పోనీ ఇదో 'రాండమ్ ఆక్ట్ ఆఫ్ కైండ్ నెస్' అనుకో, ఎవరో మహానుభావుడు మనల్ని ఇలా ట్రిప్ కి పిలిచి ఉంటాడు అని పాసిటీవ్ గా ఆలోచిస్తే సరిపోలా", అన్నది లక్షి, అలానైనా రామం పరధ్యానం మానేసి ఇహలోకంలో పడతాడని.

లక్ష్మి చెప్పింది పెద్ద ఆశ్చర్యం కలుగలేదు రామంకు. రెస్టౌరెంట్ కు పోయి నచ్చితే ఇద్దరి బిల్ 50 డాలర్లు అయితే 50 డాలర్లు టిప్ ఇవ్వడము, డ్రైవ్ ఇన్ లో ఆర్డర్ చేసి పిక్ అప్ చేస్తున్నప్పుడు, తరువాతి కస్టమర్ బిల్ కట్టి సర్ప్రైజ్ చేయాలనుకోవడం లక్ష్మి కి అలవాటే. అది రామం కు తెలిసిన విషయమే.
 

"రాండమ్ ఆక్ట్ ఎందుకౌతుంది లక్ష్మి. పూర్వ జన్మలో ఎదో ఋణ పడి ఉంటారు. ఆ కర్మ ఇలా చెల్లించుకుంటూ ఉంటారు. నువ్వు నమ్మే కర్మ సిద్ధాంతమే, ఈ జీవితాన్ని పూర్వ జన్మలకు, రాబోయే పునర్జన్మలకు ముడి పెట్టి ఓ బిట్ కాయిన్ చైన్ సృషించటం లేదు. ఫలితం ఆశించకుండా నీ కర్మ చేయి అనడం బాగానే ఉంటుంది కాని,  అది ఈ డార్విన్ ప్రపంచంలో సాధ్యమేనా? మనమేమి లాటరీ టికెట్ కొనలేదు. తప్పకుండా ఎదో ఓ ఉద్దేశంతోనే మనల్ని, ఈ ఆగంతకుడు ఈ ట్రిప్ మిషతో ఇక్కడికి పిలిపించాడు",ప్రాక్టికల్ గా మాట్లాడాడు రామం.
 

"ఇంకెంత? ఈ రాత్రికే కదా కాన్ఫరెన్సు. మీ ప్రశ్నకు జవాబు దొరికిపోతుంది", పినా కోలాడ త్రాగడం ముగించి నాప్కిన్ వైపు చేయి చాస్తూ అంది లక్ష్మి.

 

జవాబు త్వరలోనే దొరుకుతుందన్న ఊరటతో, రామం కూడా మిగిలిన డ్రింక్ ఒక గుక్కలో త్రాగేసి, లక్ష్మీ తో సహా రాబ్ వైపు అడుగులు వేసాడు. 
 

రిసార్ట్ తిరిగి చేరడానికి అర గంట పట్టింది. రెడీ అవ్వడానికి మరో రెండు గంటలుంది. కొంచెం రెస్ట్ తీసుకుని బయలుదేరుదామనుకున్నప్పుడు, ఫోన్ రింగ్ అయ్యింది. లక్ష్మీ ఫోన్ తీసుకుంది. తాను ఫోన్ పెట్టేసిన తరువాత "ఎవరు లక్ష్మీ ", అని ఆడిగాడు రామం. "ముందు మనకు ఫోన్ చేసి పిలచినతడే రామం. మనం పోవాల్సిన కాన్ఫరెన్స్ రూమ్ రిసెప్షన్ ఉన్న ఫ్లోర్ లోనే ఉందట. అదే డైరెక్షన్స్ ఇచ్చారు", అంది లక్ష్మి.

రామం, లక్ష్మి  ఫ్రెష్ అయ్యి,  ఫార్మల్ డ్రెస్ వేసుకొని కాన్ఫరెన్స్ రూమ్ కి చేరుకున్నారు. సమయానికి ఓ 10 నిమిషాలు ముందే చేరటం వల్ల ఎక్కువ జనాలు కనపడలేదు. అందమైన అమ్మాయిలు ఇద్దరు, వీరిని చూసిన వెంటనే దగ్గరికి వచ్చి పలకరించి వీళ్ళ పేర్లు వాళ్ళ దగ్గరున్న  ఐ ప్యాడ్ గెస్ట్ లిస్ట్ లో చూసి, టేబిల్ 6 లో కూర్చోమని ప్రోగ్రాం ఫ్లయర్ కూడా అందజేశారు. 

రామం వెంటనే ప్రోగ్రాం వివరాలు వెదుక సాగాడు. లక్షి టేబిల్ దగ్గర వెళ్లిన తరువాత చూసుకోవచ్చు అన్న మాటలు కూడా వినిపించుకోలేదు. లాభం లేదని లక్ష్మీ కూడా ఫ్లయర్ చూడడం మొదలెట్టింది.

రామం "అంతు పట్టటం లేదు. టైం షేర్ అయితే కాదని తెలిసిపోయింది. ఎవరో స్టార్ట్ అప్ వెంచర్ మొదలెడుతున్నారట. వెంచర్ కాపిటలిస్ట్ ఆ సందర్బంగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కొంపదీసి మనల్ని ఈ స్టార్ట్ అప్ కు డబ్బులు కట్టమనరు కదా", నిరాశ, అనుమానం మిశ్రితమైన గొంతుతో అన్నాడు.

"గుర్తు పట్టలేదా రామం. మన వారాలబ్బాయి", ఉన్నటుండి లక్ష్మి పెద్ద కళ్ళు మరింత పెద్దవి చేస్తూ ఆనందంగా రామం భుజం తట్టింది.
 

రామం ఆలోచనలు ఓ 15 ఏండ్లకు వెనక్కు పోయింది. అమ్మాయి అబ్బాయిలను కాలేజీలకి పంపించేసిన తరువాత ఇల్లు బాగా బోసి పోయింది. ఉన్నటుండి కావలసినంత తీరిక, చేతికి అందినట్లయ్యింది. పిల్లలు ఇల్లు వదిలి పోయినది లక్ష్మిని అంతగా ఇబ్బంది పెట్టక పోవడానికి కారణం, ఏదో ఒక సంఘ సేవలో లక్ష్మి ఇమిడి పోవడం. 

రామం లోని మార్పుల చూసి తానే రామంతో " మనిద్దరం కలిసి ఓ వాలంటరీ పని చేద్దాం రాం. ఏమంటావు? నువొప్పుకుంటే నేనే రీసెర్చ్ చేసి అవకాశాలు వెదుకు తాను. నీకు నచ్చితే ఇద్దరం పాల్గొనవచ్చు", అన్నది.
 

ఎందుకో ఇద్దరికి, పిల్లలకి సహాయం చేసే పని అయితే బాగుంటుందనిపించింది. దానికి ఆ ఊళ్ళో నే ఓ వాలంటరీ సంస్థ ఉండడంతో, లక్ష్మి రామం లు వివరాలు తెలుసుకున్నారు. ఫాస్టర్ హోంలోనో, అతి బీదాతనం, సింగల్ పేరెంట్ ఫ్యామిలీ లో పెరుగు తున్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లలలో ఇకరిని ఎంచుకొని ఆ అబ్బాయికి  లేక అమ్మాయికి మెంటర్ లాగా ఉండాలి. వారానికి కనీసం 4 గంటలు వీకెండ్స్ లో గడిపితే చాలు. ఆ సంస్థ పంచుకున్న వివరాలు నచ్చి లక్ష్మి రామంలు వాలంటీర్లు కావడానికి ఒప్పుకున్నారు. తరువాత సంస్థ కొన్ని పరీక్షలు పెట్టి, బ్యాక్ గ్రౌండ్ చెక్కులు చేసి వీరిరువురు పిల్లలను చూసుకోవడానికి అర్హులు, అని తెలిసిన తరువాత, ఎలాంటి పిల్లలకు మెంటర్ అవ్వదాలుచుకున్నారు అని మరో పరీక్ష పెట్టారు. సంస్థ దగ్గర మెంటర్స్ కోసం చాలా మంది పిల్లలు వేచి ఉన్నారని వారు విన్నారు. అటు తరువాత రామం లక్ష్మి ల కున్న చదువు, అనుభవం, అభిరుచులకు తగిన అబ్బాయి అమ్మాయి కోసం వెదుకగా దొరికిన అబ్బాయే స్టీవెన్. 

సంస్థ వాలంటీర్ కోఆర్డినేటర్  బెత్, స్టీవెన్ ను పరిచయం చేస్తానంటే, రామం లక్ష్మి సాయంత్రం ఆరు కంతా, స్టీవెన్ ఇంటికి వెళ్లారు. ఆ రోజు స్టీవెన్ వాళ్ళ తాత దగ్గిర ఉన్నాడు. స్టీవ్ నాన్న జైల్లో ఉన్నాడని, స్టీవ్ అమ్మ మరో బాయ్ ఫ్రెండ్ వెదుక్కుని మూవ్ అయ్యిపోయిందని బెత్ ముందే రామం, లక్ష్మిలకు తెలిపింది. స్టీవ్  వాళ్ళున్నది చిన్న అపార్ట్మెంట్. ఉన్నదాంట్లోనే శుభ్రం గా అన్ని వస్తువులు అమర్చారు. స్టీవెన్ తాత తలుపు తీసి ఇంట్లోకి ఆహ్వానించి, 'స్టీవ్' అంటూ స్టీవెన్ ను, నా గర్ల్ ఫ్రెండ్ నాడ్లీ అంటూ తన సహచరిని పరిచయం చేశాడు.  బెత్ రామం, లక్ష్మిలను పరిచయం చేసింది. స్టీవ్ ఇబ్బందిగా తలెత్తి కొత్తవారిని చూచే చూపుతో చూసాడు. బాగా షై టైపు అని ఒక చూపులోనే తెలిసిపోయింది.

"హలో స్టీవ్", అంటూ రామం, బెత్ దూరం నుంచే పలకరించారు.  లక్ష్మి మాత్రం ఎంతో సహజంగా స్టీవ్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని "హౌ ఆర్ యు స్టీవ్", ఆప్యాయంగా అంది. పిల్లలంటే లక్ష్మికి ఎంత ఇష్టమో అట్టే తెలిసిపోయింది మిగిలిన వారికి.  దానితో అంతవరకు కొత్తగా బెరుకుగా ఉన్న వాతావరణం మారి స్నేహపూరితమైంది. ఓ అర గంట తరువాత మళ్ళీ వచ్చే వీకెండ్ కలుద్దామని చెప్పి సెలవు తీసుకున్నారు బెత్, రామం లక్ష్మిలు. 

బయటకు వచ్చి పార్కింగ్ లాట్ లో ఉన్నప్పుడు బెత్ ఇక అప్పటినుంచి తను ప్రతీ నెలా ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని,  ఏవైనా ప్రశ్నలుంటే తనను కాంటాక్ట్ చేయమని, వారం వారం పిల్లలకు ఏవైనా స్పాన్సర్డ్ ప్రోగ్రాం లు ఉంటే వివరాలు పంపిస్తానని, స్టీవ్ ను తప్పకుండా ప్రతీ వారం కలిసి పిక్ అప్ చేసుకొని స్టీవ్ అభివృధ్ధి కి తోడ్పడేలా సమయం గడపమని చెప్పి సెలవు తీసుకుంది. 

మాటల్లో స్టీవ్ కు ఇల్లంటూ లేదని, వారంలో వీకెండ్స్ వాళ్ళు తాత దగ్గిర, అందులో కొన్ని గంటలు రామం లక్ష్మిల దగ్గిర గడిపితే, వీక్ డేస్ లో కొన్ని రోజులు వాళ్ళ అమ్మ, ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో, మరి కొన్ని రోజులు స్టీవ్, ఆంటీ, అంకుల్ ఇండ్లలో గడిపే వాడని తెలిసింది. ఫాస్టర్ హోమ్ లో ఉండే వారి కంటే మేలైనా,  స్టీవ్ కు ఓ స్థిర జీవితం లేనిది సమస్యే. అది విన్నప్పుడే రామం మా ఊళ్లోనూ ఇలాంటి వారాలబ్బాయిలుండే వారు. మా ఇంటికి ప్రతీ బుధవారం ఒకబ్బాయి భోజనానికి వచ్చేవాడు అని లక్ష్మి కి చెప్పడంతో స్టీవ్ ను ముద్దుగా వారాలబ్బాయి అని వారిరువురి మాటలలో అనుకోవడం అలవాటైపోయింది.

ప్రతీ వారం కలుస్తుండంతో స్టీవ్ కూడా రామ లక్ష్మిలకు బాగా దగ్గర అయ్యాడు. సంస్థ ప్రతీ వారం మ్యూజియం టికెట్లో, టెన్నిస్ క్లినిక్, ఫుట్బాల్, బేస్ బాల్ పాస్ లంటూ ఏవో కార్యక్రమాలు పంపిస్తూ ఉండేది. దానికి తోడు రామం, లక్ష్మిలు కూడా తమకు ఇష్టమైన బీచ్ లకి, పార్క్ లకి తీసుకెళ్తూ ఉండేవారు. దానితో స్టీవ్, రామం, లక్ష్మిలు కూడా వీకెండ్స్ కు ఎదురు చూసేవారు. 

ఎక్కువ విడిపోయిన సంసారాలే చూసిన స్టీవ్ కు రామం లక్ష్మి లు ఇన్ని ఏండ్లు కలిసి ఆనందంగానే ఉండడం ఆశ్చర్యంగానే ఉండేది. వారిద్దరూ తన చదువు మీద, తన బడి కార్యక్రమాలమీద, తన స్నేహితుల గురించి అడగడము, తోచిన సలహాలు ఇవ్వడము స్టీవ్ కు సంతోషాన్ని ఇచ్చేది. రామం,  చదువు జీవితంలో పైకి పోవడాన్ని ఏంతో ముఖ్యం, అది అన్ని మహదవకాశాలకు పాస్పోర్ట్ అని, స్టీవ్ మదిలో నిలిచే ఉండాలని పదే పదే చెప్పేవాడు. అది తన అనుభవం నుంచి వచ్చిన పాఠమే. అలానే లక్ష్మి అందరితో బాగా ఉండాలని, సహాయ పడాలని చెప్తూ ఉండేది. స్టీవ్ ఉన్నప్పుడు, తన కళ్ళతోనే లక్ష్మి ఏ మాత్రం సహాయం ఆశించని వారికి సహాయపడి, వారిని ఆశ్చర్యచకితులను చేయడం చూసాడు. 'రాండమ్ ఆక్ట్స్ ఆఫ్ కైండ్ నెస్'  అన్న మాటలు, అప్పుడే రామం లక్ష్మి చర్యలను ఉద్దేశిస్తూ అంటునప్పుడు విన్నాడు.

వారం వారం కలుస్తుండడం, నెల నెలా  బెత్ కు జరిగిన విషయాలు చెప్పడం, ఓ రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. స్టీవ్ లో కూడా మార్పులు వచ్చాయి. బడిలో గ్రేడ్ లు బాగా రావడం మొదలెట్టాయి. ఎక్కువగా ఏ లేక బి గ్రేడ్ లే. ఉన్నటుండి ఓ 4 ఇంచీలు పెరిగి లక్ష్మి ఎత్తుకు అందుకున్నాడు. జైల్ లో ఉన్న తండ్రి పోలిక అని స్టీవ్ తాత అనేవాడు. అతను మంచి పొడగరి ఆట.

ఉన్నట్టుండి, ఓ సారి స్టీవ్ ను పిక్ అప్ చేద్దామని వెళ్తే స్టీవ్ లేడని ఆ వారం, జైలునుంచి ఇటీవలే విడుదలైన,  వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లాడని, తరువాతి వారం కలుద్దామని స్టీవ్ తాత చెప్పాడు. లక్ష్మి కి రామం కు ఆ వీకెండ్ ఏమి చేయాలో తెలీలేదు. తరువాతి వారం, తరువాతి వారం అదే కథ. చివరికి స్టీవ్ తండ్రితో కలసి ఊరు వదిలి పోయాడని తెలిసింది. అలా ఉన్నట్టుండి విడి పోవడం రామంను, లక్ష్మికి మరీనూ బాగా కలవర పరచింది. తండ్రి దగ్గరికే వెళ్ళాడు కదా అని  కొన్ని రోజులకు సర్దుకున్నారు. సంస్థ నుంచి బెత్ కూడా ఇలాంటి విడిపోవడాలు సహజమేనని సముదాయించి మరో అమ్మాయినో, అబ్బాయినో మ్యాచ్ చేయ మంటారా అని అడిగింది. ఇంకా స్టీవ్ వెళ్లిపోయిన బాధనుండి తేరుకొనని లక్ష్మి, రామంలు బ్రేక్ కావాలంటూ ఒప్పుకోలేదు. ఆ రోజు తరువాత బెత్ తోను, స్టీవ్ తోనూ కలవాలని ప్రయత్నించలేదు.

ఇన్ని రోజుల తరువాత స్టీవ్ ను కలువబోతుండడం లక్ష్మికి రామం కు పట్ట లేని ఆనందం కలిగించింది. రామంకు తన మెదడు తొలుస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికిందని మరింత సంతోషం కలిగింది. "చూసావా లక్ష్మి స్టీవ్ డిగ్రీలు, బాగా చదివాడు. నువ్వు చేసేటట్టే, మనల్ని పిలిచి సర్ప్రైజ్ చేసాడు", రామం లక్ష్మి నుద్దేశించి గర్వం గా చెప్పాడు.

లక్ష్మి రామం మాటలకు నవ్వుతూ,"అవును రామం", అంటూ వారికి రిజర్వ్ చేసిన టేబిల్ వైపు దారి తీసింది.

లోపలి గది విశాలంగానే ఉంది. ఓ స్టేజి, దానికి ఎదురుగా ఓ 10 బల్లలు అమర్చారు. మొత్తం ఓ ముప్పై, నలభై మంది కూర్చోగల ఏర్పాటు. అప్పుడప్పుడే మెల్లిగా జనాలు తమ స్థానాలు వెదుక్కుని కూర్చుంటున్నారు. లక్ష్మి రామం వాళ్ల టేబుల్ స్టేజి దగ్గరే ఉంది. అప్పటికే ఓ జంట అక్కడ కూర్చొని ఉన్నారు. అతను  ఒడ్డు పొడుగు తో మంచి పర్సనాలిటీ ఉన్న మనిషి, చూస్తూనే ఆకట్టుకునే లాగా ఉన్నాడు. వాళ్ళవిడ కూడా అలానే అందంగా ఉంది.అతనికి  రామం కంటే ఓ పది ఏండ్లు తక్కువుంటుందేమో వయస్సు. పక్కన్నావిడ వయస్సు మరింత తక్కువుండాలి. 

రామం లక్ష్మి లను చూస్తూనే చిరపరిచుతుడిలా లేచి అతను రామం అటుతరువాత లక్ష్మి లతో  చేతులు కలిపి తను చాడ్ అని తన గర్ల్ ఫ్రెండ్ మార్ల అని, స్టీవ్ స్టార్ట్ అప్ కు వెంచర్ కాపిటలిస్ట్ కంపెనీ తనదే నని చెప్పాడు. రామం అప్పుడప్పుడే స్టీవ్, ఈ కాన్ఫరెన్స్ రావడానికి కారణమని తెలుసుకోవడం వల్ల, స్టీవ్ గురించి మాట్లాడడం మొదలెట్టాడు. లక్ష్మికి, చాడ్ మాటలు పూర్తిగా వినకుండానే, రామం మాట్లాడాడేమోననిపించింది. కానీ రామం స్వతహాగా ముందు తన మాటలు వినిపించి, తరువాత అవతలి మాటలు వినే మనిషి అని తెలుసుండడం వల్ల, లక్ష్మి  మనస్సులోనే నవ్వుకొని,  మార్లను గురించి అడగడం మొదలు పెట్టింది. 
 

రామం స్టీవ్ గురించి అలా ఉత్సాహంగా మాట్లాడం చాడ్ కు ఆనందంగానే ఉంది. స్టీవ్ గురించి వివరంగా అన్ని విషయాలు అడిగి మళ్లీ తెలుసుకున్నాడు. వెంచర్ కాపిటలిస్ట్ అంటే అలానే ఉంటారేమో అనుకున్నాడు రామం. అంతంత డబ్బు, ఏమాత్రం తెలియని ఓ స్టార్ట్ అప్ మీద పెట్టుబడి గా పెడుతున్నప్పుడు, ఆ స్టార్ట్ అప్ వెనుక ఉన్న మనిషి గురించి, తాను చాడ్ స్థానంలో ఉన్నా, అలానే విని తెలుసుకొనే వాడినేమో అనుకున్నాడు రామం. ఇంతలో స్టీవ్ రావడం తో ప్రోగ్రాం మొదలయ్యింది. స్టీవ్ స్టార్ట్ అప్ కాలేజి లో చదుతున్న విద్యార్థులకు ఉపయోగ పడేది. స్టీవ్ తన పరిచయం తరువాత, స్టార్ట్ అప్ గురించి, ఫైనాన్స్, టెక్నాలజీ గురించి మాట్లాడి తమ వెంచర్ కాపిటలిస్ట్ చాడ్ గురించి కూడా మాట్లాడాడు. చాడ్ చిన్నతనంలో, పెద్దగా చదవ లేదు.  ముప్పై పై బడిన తరువాతే పనితో బాటు, ఆలస్యమైనా, కమ్యూనిటీ కాలేజి లో  చేరి అసోసియేట్ డిగ్రీ సంపాదించాడట. తరువాత  ఓ లిబరల్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, మళ్లీ లా కాలేజ్ లో లా డిగ్రీ 40 ఏళ్లకు సంపాదించ గలిగాడట. బార్ పాసు అయ్యి, అట్టార్నీ గా క్లాస్ ఏక్షన్ కేసులలో జయించి అతి త్వరలోనే కొన్ని మిల్లియన్స్ తన క్లైంట్స్ కు, తనకు దక్కించుకోగలిగాడు. ఆ విషయాలు విన్న రామంకు ఆశ్చర్యంతో పాటు చాడ్ పట్ల ఓ గౌరవం కూడా కలిగింది. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్స్ చాడ్ విద్యార్జితంతో సంబంధం ఉన్న స్టీవ్ స్టార్ట్ అప్ లో పెట్టుబడి పెట్టడం సమంజసమే అనిపించింది. స్టీవ్ రాబోయే 5 ఏండ్లకు తమ స్టార్ట్ అప్ ప్రణాళికలను వివరించి, సహాయ పడిన వారికి కృతజ్ఞత లు చెప్పి ముగించాడు. 
 

లక్ష్మి మార్ల లు పోర్ట రికో లో ఉన్న అందమైన ప్రదేశాలు, అక్కడి ప్రజల సంస్కృతి, ఆ ద్వీపం చరిత్ర అంటూ మాట్లాడుతూ ఉంటే చాడ్ రామంలు కూడా ఆ సంభాషణలో పడిపోయారు. అటూ ఇటూ తిరుగుతున్న వెయిటర్ లు అప్పే టైజర్లు, వైన్ వడ్డించడం మొదలుపెట్టారు. 

స్టీవ్  ప్రతీ టేబిల్ దగ్గర పోయి అతిధులను పలుకరించడం కొన కంటి తో రామం గమనించాడు.

అలా ఓ రెండు టేబిళ్ళ తరువాత, రామం లక్ష్మిలు ఉన్న టేబిల్ వైపు రావడంతో రావడంతో, రామం బాగా ఎక్సైట్ అయ్యి స్టీవ్ ను పలకరించి, హగ్ చేద్దామనుకొని లేచాడు. స్టీవ్ రామం ను దాటుకుని చాడ్, మార్ల వైపు వెళ్లి హగ్ చేసుకున్నాడు. రామం ముఖంలో కనిపోయించిన మార్పులు చూసిన చాడ్, వెంటనే స్టీవ్ ను ఉద్దేశించి

" స్టీవ్ నువ్వు  గుర్తు పట్టినట్లు లేవు. నీవు,  వీరి గురించి తరచు చెప్తుండే వాడివి. రామం. లక్ష్మి", అని పరిచయం చేసాడు. ఉన్నట్టుండి స్టీవ్ ముఖంలో వెలుగు. 
 

రామం లక్ష్మి లను ఆనందంగా హగ్ చేసి ఓ కుర్చీ తెప్పించి వారి మధ్యనే కూర్చున్నాడు. కేచ్ అప్ చేయడానికి చాలా మాటలు ఉన్నాయి. రామం కు స్టీవ్ తమను గుర్తుపెట్టుకొని పిల్చినందుకు, ఇంత బాగా ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాలనిపించి, లక్ష్మి తో మాట్లాడుతున్న స్టీవ్ ఉద్దేశించి మాటల మధ్యలో "స్టీవ్ థాంక్స్ ఫర్ కాలింగ్ అజ్ . ట్రిప్ కూడా అద్భుతంగా ప్లాన్ చేశారు, మా కోసం", అన్నాడు.
 

స్టీవ్ ముఖంలో ఆశ్చర్యం. చాడ్ ముఖంలో చిరు నవ్వు.
 

చాడ్ రామం తో "రామం, స్టీవ్ కాదు, నేనే ఈ ట్రిప్ అరేంజి చేసాను. ఈ ట్రిప్ గురించి నీతో, లక్ష్మి తో మొదట మాట్లాడింది నేనే. నీ గురించి, లక్ష్మి గురించి స్టీవ్ మాటల ద్వారా చాలా విన్నాను. నేను వ్యక్తిగతంగా మీకు చాల  ఋణ పడి ఉన్నాను. స్టీవ్ కు, మీకు సర్ప్రైజ్ చేద్దామనిపించింది", అన్నాడు.
 

రామం, లక్ష్మిల ముఖాలలో ఆశ్చర్యం. 
 

ఆనందంతో కలిగిన ఉద్వేగం వల్ల స్టీవ్ నిశ్చేష్టుడయ్యాడు.

స్టీవ్ చివరకు నోరు పెగుల్చుకొని, చాడ్ ను చూస్తూ "థాంక్స్ డాడ్", అన్నాడు.

*****

bottom of page