top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

ఏ దేశమేగినా …

madhuravani

వాత్సల్య గుడిమళ్ళ

" త్వరలో ల్యాండ్ అవ్వబోతున్నాము, కాబట్టి అందరూ మీ సీటు బెల్టులని బిగించి కట్టుకోండి" అన్న గగన సఖి మాట వినపడి నిద్ర లేచాను.

 

టైము ఉదయం ఆరు కావొస్తోంది.నిన్న రాత్రి హైదరాబాదులో బయలుదేరి ఓ ఐదుగంటలు దూరంలో పొరుగు దేశంలో ఉన్న కూతురు దగ్గరకి బయలుదేరాము  నేనూ, నా అర్ధాంగి లక్ష్మి.

 

విమానం దిగి బయటకొచ్చేసరికి అమ్మాయి భావన, అల్లుడు వంశీ   పిల్లలతో సహా వచ్చారు.ఆప్యాయమైన ఆలింగనాలు,గాలి పీల్చుకోవడమంత అనివార్యమయిపోయిన ఫోటోలవీ  అయ్యాకా ఇంటికొచ్చి కూతురు చేసిన వేడి వేడీ ఇడ్లీ తినేసరికి అర్జెంటు టెలిగ్రాం కొడితే బయలుదేరొచ్చినట్లు నిద్రా దేవత పరిగెత్తుకొచ్చింది.

 

అమ్మాయీ వాళ్ళు ఉన్న ప్రదేశం(చిన్న గ్రామం అనుకోవచ్చేమో)  పేరు "వుడ్స్ విల్లే". అందంగా, పొందిగ్గా, ఎటుచూసినా పచ్చదనం నిండిన గ్రామమది.

 

మాకు సాయంత్రానికి కాస్త అలసట తీరగానే అలా చల్లగాలికి తిరిగొద్దామని నేనూ, నా అర చొక్కా(అర్ధ+అంగీ=అర్ధాంగి,సవర్ణ దీర్ఘ సంధి) బయటకొచ్చాము. చుట్టూ పచ్చటి చెట్లు, రహదారుల మీద ఒక క్రమంలో సాగిపోతున్న వాహనాలూ,పక్కన పాదచారులు నడవడానికి వీలుగా ఫుట్‌పాత్, ఆ పక్కగా పచ్చటి గడ్డిని చూస్తుంటే ప్రాణానికి హాయిగా అనిపించింది.

 

రోజూ అలా వాకింగ్ చెయ్యడం మాకు తెలియకుండానే మా దినచర్యలో ఒక భాగమయిపోయింది.

 

ఒక ఆదివారం భావన మమ్మల్ని దగ్గర్లో ఉన్న రాముల వారి గుడికి తీసుకెళ్ళింది.గుడి, గుడిలో పెట్టిన ప్రసాదముతో పాటు అక్కడ శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుంటున్న పిల్లలు నన్నూ, లక్ష్మినీ బాగా ఆకర్షించారు. ఇంటి దగ్గరనుండి ఏ బస్సెక్కితే ఈ గుడికొస్తామో తెలుసుకుని  మాకు వీలైనప్పుడల్లా వచ్చి ఆ పిల్లలని చూస్తూ కూర్చునేవాళ్ళము.

 

ఒకసారి పిల్లలకి డ్యాన్స్ నేర్పే టీచరుతో మాటలు కలిపాము.తన పేరు సోనల్ అనీ, తాను గుజరాతీ కుటుంబానికి చెందినా తెలుగు రాష్ట్రాల్లో  పెరగడం వల్ల కూచిపూడి మీద ఆసక్తి కలిగి నేర్చుకున్నాననీ,ఆసక్తి గల పిల్లలకోసం వారంలో మూడ్రోజులు ఇలా గుడిలో ఉచితంగా నేర్పిస్తానని చెప్పింది.

 

 

ఓ రోజు సాయంత్రం వాకింగు నుండి తిరిగొచ్చేసరికి కాస్త ఆలశ్యమయ్యింది. కూతురూ అల్లుడూ వచ్చే టైమవుతోందని వంటింట్లో నా అర చొక్కా హడావిడి పడుతోంది.ఇంతలో మా అమ్మాయి భావన నుండి  ఫోను.

 

"అమ్మా.. ఈరోజు కమ్యూనిటీ క్లబ్బులో మీటింగుంది, నేనూ వంశీ లేటుగా వస్తాము, మీరూ పిల్లలూ తినేసి పడుకోండి" అని చెప్పి పెట్టేసింది.

 

 

మరునాడు పొద్దున్నే టిఫిన్ల వేళ చిరాగ్గా ఉన్న కూతురిని చూసి కారణమడిగాను."నిన్న రాత్రి మా కమ్యూనిటీ ఛైర్మెన్ పెద్ద తలనెప్పి పని అప్పచెప్పాడు నాన్నా..మా కమ్యూనిటీ క్లబ్బులో మన భారతీయులకోసం ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలిట.ఎలాగూ దీపావళి వస్తోంది కాబట్టి ఓ వంద మందిని పిలిచి దీపావళి కార్యక్రమం చెయ్యాలంటున్నాడు.మా ఇద్దరికీ ఆఫీసులో ఊపిరి సలపనంత బిజీ. రేపటికల్లా ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రపోజల్ ఇమ్మన్నాడు" అని చెప్పింది.

 

ఏమీ కంగారు పడకు తల్లీ, నేను చూసుకుంటాను కదా అని చెప్పి,వాళ్ళిద్దరూ సాయంత్రం వచ్చేసరికల్లా నృత్య ప్రదర్శనలు,భోజనం ఉంటే బాగుంటుంది అని ఆలోచించి  ఒక ముసాయిదా రూపొందించి ఇచ్చాను.దానిని వాళ్ళ ఛైర్‌మెన్‌కి పంపించగానే ఆయన ముందర కొంచెం బడ్జెట్ సాంక్షన్ చేసి టిక్కెట్టు ధర నాలుగు డాలర్లుగా నిర్ణయించి ఇంక మిగతా వివరాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, భోజనం ఆర్డర్లు, పోటీలు,బహుమతులు వంటివి వీళ్ళే నిర్ణయించి తనకి,మిగతా క్లబ్బు సభ్యులకీ  మాత్రం ఒక మాట చెప్పమన్నాడుట.

 

 

మా అమ్మాయి ఆ పని కూడా  నాకు, లక్ష్మికీ అప్పగించేసి చక్కా ఆఫీసుకి వెళ్ళిపోయింది.ఇద్దరమూ సాయంత్రాలు వాకింగుకి వెళ్ళినప్పుడు మన వాళ్ళని పరిశీలించేవాళ్ళము.ఒక్క తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాలవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అని అర్ధమయ్యింది.అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్క భాష వారికో మాత్రమే పరిమితం చెయ్యకూడదని ఆలోచించి  ఒక నాలుగైదు సాంస్కృతిక కార్యక్రమాలు,ముగ్గుల పోటీలు,ఎనిమిదేళ్ళలోపు పిల్లలకి కలరింగు, ఎనిమిది-పన్నెండు మధ్య వయసున్న వారికి డ్రాయింగు,ఆడ, మగవారికి, పిల్లలకీ బెస్ట్ డ్రెస్స్ పోటీలు పెట్టి,5-6 రకాలతో కూడిన భారతీయ భోజనం అయితే బాగుంటుందనిపించింది.

 

 

అమ్మాయీ, అల్లుడికి కూడా నచ్చడంతో ఆ ప్రపోజల్‌ని వాళ్ళ దానిని క్లబ్బు మెంబర్స్ యొక్క ఆమోదం కోసం పంపడం, వాళ్ళు ముందర కేటాయించిన బడ్జెట్టుని కాస్త పెంచి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

 

ఇంక ఆలశ్యం చెయ్యకుండా దీపావళి సంబరాల పేరుతో ఈవెంట్ పోస్టర్ వెలిసింది.ఆసక్తి ఉన్నవారు కమ్యూనిటీ క్లబ్బులో టిక్కెట్లు పొందవచ్చనీ,సాంస్కృతిక కార్యక్రమాలలోలేదా పోటీలలో  పాల్గొన దలిస్తే సంప్రదించాల్సిందిగా మా అమ్మాయి పేరు ఇచ్చారు. సంప్రదించాల్సిన నంబరు మాత్రం క్లబ్బు వారి నంబరుతో పాటు నాది ఇచ్చారు .అదేమిటమ్మా అంటే “కాస్త ఫోను చేసిన వారి వివరాలు మాత్రం రాసి పెట్టుకుని నాకిస్తే చాలు నాన్న, నేను ఆఫీసులో బిజీ  “అనడంతో ఇదేమి పెద్ద పని కనుక అనుకుని సరే అన్నాను.

 

" నాన్నా, జాగ్రత్త, ఇంక మీకు మంచినీళ్ళు త్రాగే టైము కూడా ఉండదు చూసుకోండి" అని నవ్వుతూ చిన్నపాటి వార్నింగు  ఇచ్చినా కానీ దాని అర్ధం మాత్రం నాకు తరువాతి రోజునుండే తెలిసొచ్చింది.

అది మొదలు  నా ఫోను నిర్విరామంగా మోగడం మొదలయింది, మా గ్రూపు డ్యాన్స్ చేస్తారనో,మా పిల్లలకి ఆసక్తి అనో ఇలాగ.వాళ్ళందరి నంబర్లూ తీసుకుని రాసి పెట్టునేవాడిని.ఎలా తెలిసిందో మరి  మేము సాయంత్రాలు వాకింగుకి వెళ్ళినప్పుడు "మీ అమ్మాయి వాళ్ళేట కదా నిర్వాహక సభ్యులు?" అని మొదలెట్టి ఏవేవో ప్రశ్నలడిగేవారు "నాకు తెలీదు బాబోయ్,క్లబ్బులో వెళ్ళి అడగండి" అని నేనూ లక్ష్మీ అరిచి గీ పెట్టినా వినకుండా.అక్కడ కూడా కొంత మంది తమకి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే ఆసక్తి ఉంది అంటూ తమ పేర్లిచ్చేవారు.ఇతర పోటీలలో పాల్గొనేవారు కూడా  మాకు ఫోను చేసో లేదా వాకింగుకి వెళ్ళినప్పుడో తమ పేర్లిచ్చేవారు.

 

మన సంస్కృతి మీద బయట ఉంటున్న వాళ్ళకి ఇంత ఆపేక్షా అని ఆశ్చర్యపోతోంటే అసలు కారణం మా అమ్మాయి చల్లగా చెప్పింది "ఆపేక్షా కాదు, ఆవకాయా కాదు, స్థానికంగా ఉన్న కమ్యూనిటీ క్లబ్బు ఈవెంట్లలో పాల్గొన్ని వాళ్ళిచ్చే సర్టిఫీకెట్లు తీసుకుంటే కనుక ఈ దేశ పౌరసత్వం సులభం అని ఎవరో ఈ మధ్య పుకారు పుట్టించారు నాన్న, లేకపోతే మన వాళ్ళు చదువులు, వీకెండు క్లాసులూ మానిపించి రెండు గంటలు సమయం వృధా చెయ్యడమే,పిల్లల   కెరీర్ ఏమయిపోతుంది" అని నవ్వి "అందరూ ఇలా ఉంటారని కాదు నాన్నా!. తమ సంప్రదాయాలనీ, మూలాలనీ మర్చిపోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.కానీ అలాంటి వాళ్ళు తామేదో ఉద్ధరించెస్తున్నాము అన్న భావన లేకుండా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతుంటారు" అంది.ఈ మాట వినగానే నా మదిలో సోనల్ మెదిలింది .

 

మొత్తానికి అంతమంది ఆసక్తి కనపరిచినా కానీ ఐదు గ్రూపులకి మాత్రమే  కమ్యూనిటీ క్లబ్బు మెంబర్లు అవకాశం ఇచ్చారు.నాకూ, లక్ష్మికీ సోనల్ శిష్యులు కూడా ఒక ప్రదర్సన ఇస్తే బాగుంటుందనిపించి సోనల్‌కి ఫోను చేసాము.

 “తాము గుడికి మాత్రమే ఉచితంగా ప్రదర్శన ఇస్తామనీ, మిగతా చోట్ల ప్రదర్శనకి ఇంత అని వసూలు చేస్తామని” సోనల్ చెప్తోంటే నేనూ లక్ష్మీ ఆశ్చర్యపోయాము "ఈవిడ సంప్రదాయ పరిరక్షణకి పాటు పడుతోంది అనుకున్నామే కానీ ఇలా ధనార్జన కోసం పిల్లలకి సంప్రదాయ నృత్యం నేర్పిస్తోంది అనుకోలేదు"  అని.

 

 మా ప్రతిస్పందనని సోనల్ గమనించినట్లుంది అందుకే మళ్ళీ తనే కలుగచేసుకుని  "నేను వసూలు చేసే పైకం నా కోసం కాదు అంకుల్.ఈ డ్యాన్సు స్కూలు నిర్వాహణ తదితరాలకి నా స్వంత డబ్బు వెచ్చిస్తాను.సినిమా పాటల నృత్యాలు ఎక్కువైపోతున్న ఈరోజుల్లో తమ తల్లి తండ్రుల అభిరుచి మేరకే మొదట పిల్లలు నా దగ్గరకి బలవంతంగా వస్తుంటారు. వాళ్ళల్లో ఆసక్తి పెంపొందిచడానికి ఇలా వసూలు చేసిన సొమ్ములోంచే వారికి బహుమతులు ఇస్తుంటాను" అని చెప్పడంతో మాకు ఆ అమ్మాయి మన సంప్రదాయం కోసం పడుతున్న తపన అర్ధమయ్యి మనసులోనే ప్రణామాలర్పించాము.

 

 క్లబ్బు నిబంధనల ప్రకారం సాంస్కృతిక కార్యక్రమాలకి డబ్బులు చెల్లించరు కాబట్టి సోనల్ శిష్యుల ప్రదర్శన కుదరదని అని మా అమ్మాయి చెప్పింది.

 

దీపావళి ఈవెంట్ గురించి తెలుసుకున్న  ముగ్గురు భారతీయ స్త్రీలు వచ్చి తమకి అవకాశమిస్తే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తామని క్లబ్బు వాళ్ళని అడగడం, వాళ్ళు సరే అనడం కూడా జరిగింది.

 

ముగ్గుల పోటీకి కావాల్సిన ముగ్గు పొడి, రంగులు, ఛాక్‌పీసులూ నేనూ లక్ష్మీ వెళ్ళి కొనుక్కొచ్చాము.మిగతా పోటీలకి కావాల్సినవన్నీ కూతురూ అల్లుడు సిద్ధం చేసేసారు.

 

సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చే  పిల్లలకి క్లబ్బు వాళ్ళే భోజనం ఇస్తామని ప్రకటించారు.కానీ వాళ్ళతో పాటు వచ్చే తల్లితండ్రులెవరైనా భోజనం చేయదలిస్తే టిక్కెట్టు కొనుక్కోవాలనీ,సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చే పిల్లలైనా సరే ఇతర పోటీల్లో పాల్గొనదలిస్తే  విధిగా టిక్కెట్లు కొనుక్కోవాలన్న నిబంధన విధించారు క్లబ్బు వాళ్ళు.

 

 

ఈ నిబంధన కాదుగానీ నా ఫోను తీసి నేలకేసికొట్టాలన్నంత కోపం వచ్చేది ఒక్కోసారి తల్లితండ్రులు వేసే ప్రశ్నలు,వాళ్ళ కక్కుర్తీ చూస్తే.అందులో నా నంబరున్న పాపానికి అదేమిటో అందరూ క్లబ్బుకి ఫోను చెయ్యకుండా వివిధ రకాల ప్రశ్నలతో నాకే ఫోను చేసేవారు లేదా వాకింగుకెళ్తే చుట్టుముట్టేవారు.

 

“మా అమ్మాయి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటోంది కాబట్టి ఆమెకి భోజనం ఇస్తే చాలు,మేము ఊరికే చూడటానికి వస్తాము రావచ్చు కదా అలాగ?” అని ఒకావిడ అడిగింది.

 

” వచ్చి భోజనం చెయ్యకుండా ఎలా వెళ్తారూ?” అంటే నాకు భోజనం వద్దండీ అందావిడ. ఇంకో నలుగురైదుగురు కూడా ఇదే మాట చెప్పారు.

  

సాయంత్రం అమ్మాయి రాగానే ఇదే మాట చెప్పి "అదేమిటమ్మా, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తాము" అంటే "ఊరుకోండి నాన్నా. ఇలా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే తల్లి లేదా తండ్రికి ఒక్కరికి భోజనం పెట్టాలన్నా ఖర్చు బడ్జెట్టు దాటిపోతుంది.మొతం ఇరవై మంది పిల్లలున్నారు, వాళ్లతో వచ్చే ఇరవై మందికి ఉచిత భోజనం అంటే క్లబ్బు రూల్సు ఒప్పుకోవు. ఇదంతా ప్రజా ధనం కాబట్టి ప్రతీ పైసాకీ లెక్క చెప్పాలి,చూడటానికి మాత్రం వస్తామంటే రమ్మని చెప్పండి, ఎవ్వరూ ఆపరు" అంది.

 

ఇంకొకావిడేమో దాదాపు రోజూ మమ్మల్ని వాకింగులో ఆపి ముగ్గుల పోటీలో మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారంటూ అడిగేది.రోజూ ఎందుకు ఇదే ప్రశ్న వేస్తోందో అర్ధమయ్యేది కాదు మా ఇద్దరికీ .ఒకరోజు ఉండబట్టలేక లక్ష్మి ఆ అమ్మాయి కనపడగానే "రోజూ ఎందుకు వాకాబు చేస్తున్నావు" అని అడిగింది.

 

 “నాకు ప్రైజు వచ్చే ఛాన్సు ఉందో లేదో చూసి టిక్కెట్టు కొనుక్కుందామనుకుంటున్నాను” అనేసరికి నోట మాట లేదు మా ఇద్దరికీ . ఆమెలో గెలవాలన్న తీవ్రమైన కాంక్ష చూసి మా లక్ష్మి ఆ అమ్మాయికి "పోటీ సుందరి" అని పేరు పెట్టి ఆమె నంబరుని అలాగే సేవ్ చేసింది కూడా.

 

ఈ రోజు "సుందరి" ఫోను చేసిందా లేదా అని మా మనవలు కూడా అడిగేంతగా మా ఇంట్లో ఫేమస్  అయ్యింది ఆవిడ.పోనీలెండర్రా..ఏదో గెలవాలని ఆశపడుతోంది అంటే "ఏంటి నాన్న !, నువ్వే న్యాయ నిర్ణేతవయితే ఆ అమ్మాయికి ఫస్టు ప్రైజు ఇచ్చేట్లున్నవు" అని వేళాకోళమాడేది మా అమ్మాయి.

 

ఓ రెండ్రోజులకి అర్ధమయ్యిందేమిటంటే పోటీ సుందరి ఏకాకి  కాదు, ఎలగైనా గెలవాలన్న కాంక్షతో పోటీకి సిద్ధమయి వచ్చేఇలాంటివాళ్ళు ఇంకో అరడజను మంది ఉన్నారని.    

 

ఊహించినదానికంటే స్పందన బాగనే రావడంతో క్లబ్బు వాళ్ళు ముందు అనుకున్నట్లుగా వంద టిక్కెట్లు కాకుండా నూటయాభై టిక్కెట్లు అమ్మాలని నిర్ణయించారు.దీపావళి సంబరాలు రేపు అనగా ముందు రోజు రాత్రి రాత్రి పోటీ సుందరి ఫోను.తన సతాయింపు  గురించి విని ఉందేమో మా అమ్మాయి ఆ ఫోను తియ్యనివ్వలేదు “ఏంటి మీకు ఈ సతాయింపు రోజూ”అంటూ. “ఒక్క అర నిమిషం అయినా మాట్లాడండి అంకుల్ ” అంటూ మెసేజీ కూడా పెట్టింది పాపం కానీ మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక మనసులో పోనీలే పాపం అనిపిస్తున్నా కానీ పోటీ సుందరికి రిప్లై ఇవ్వలేదు.

 

మొత్తానికి మేము దాదాపు నెల రోజులు దేనికోసం కష్టపడ్డామో ఆరోజు రానే వచ్చింది.బంతిపూలు తెచ్చి మాలలు కట్టి,చుట్టూ ప్రమిదలు పెట్టి నేనూ లక్ష్మీ ఆరోజు స్టేజీని అందంగా ముస్తాబు చేసాము.

 

పోటీలు ఇంకో మూడు గంటల్లో ప్రారంభం అనగా పోటీ సుందరి  మళ్ళీ ఫోను చేసింది. మా వాళ్ళందరూ బిజీగా ఉండటంతో ఫోను ఎత్తాను, లేకపోతే నన్నుఆటపట్టించెయ్యరూ.మాట్లాడుతోంటే ఎప్పుడొచ్చిందో మా మనవరాలొచ్చి ఫోను లాక్కుని స్పీకర్ ఆన్ చేసేసింది.పోటీ సుందరి చెప్పుకుపోతోంది"అంకుల్ అసలు ముగ్గులు, డ్రాయింగు అన్నీ ఒకటేసారి ఎలా పెడతారండీ? అసలు ఈ టైమింగ్స్ నిర్ణయించింది ఎవరు?నేను ముగ్గులకీ, మా అమ్మాయి డ్రాయింగుకీ, మా చిన్న పిల్ల కలరింగు పోటీకీ వద్దామనుకుంటున్నాము" అంది.

 

"రండమ్మా దానిదేముంది అందరికీ టిక్కెట్లున్నాయిగా" అన్నాను.  

 

అదికాదండీ,వీటికి తోడు మీరు బెస్ట్ డ్రెస్ పోటీ ఒకటి. మేమందరమూ బెస్ట్ డ్రెస్సులో కూడా పాల్గొనాలనుకుంటున్నాము.ముగ్గులేసి, డ్రాయింగులు, కలరింగు చెసేసరికి మా బట్టలు పాడవుతాయి కదా, ఆ మాత్రం ఆలోచన లేకుండా అన్నీ ఒకటేసారి ఎలా పెట్టారు?" అంది అసహనంతో .

 

 

ఎప్పుడొచ్చారో ఇంట్లో వాళ్ళందరూ నా వెనకాలే నిలబడి ఉన్నారు.ఒక సారి  ఫోను చుట్టూ మూగిన మా వాళ్ళ మొహాలు చూసాను,అందరూ నేను ఏమి సమాధానం చెప్తానా అన్నట్లు చూస్తున్నారు.

 “ఆ సంగతి నాకు తెలీదమ్మా, అయినా  అ క్లబ్బు మెంబర్ నేను కాదు,మా అమ్మాయి, ఆవిడనే అడగండి మా అమ్మాయికిస్తున్నాను”  అని చెప్పి ఫోను మా అమ్మాయికిచ్చేసాను.

 

మా అమ్మాయి ఫోను తీసుకుని “మేము మొదటి సారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీరు లేవనెత్తిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని,మిగతా వాళ్ళిచ్చే ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుని వచ్చే ఏడాది మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈరోజు అవసరమయితే  బట్టలు మార్చుకోవడానికి క్లబ్బులో ఒక గది ఉంది,మీకిష్టమయితే అక్కడ మార్చుకోవచ్చు" అంది వీలైనంత శాంతంగా.పోటీసుందరి అయినా సంతృప్తి చెందినట్లు లేదు, ఫోను మాత్రం పెట్టేసింది.

 

సాయంత్రం అందరమూ కార్యక్రమం జరిగే ప్రాంగణానికి వెళ్ళాము.పోటీల్లో పాల్గొనేవాళ్ళు,కార్యక్రమాలు చూడటానికొచ్చేవాళ్ళు,అసలిక్కడ ఏమి జరుగుతోందో చూద్దామని వచ్చే స్థానికులతో క్లబ్బు ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది.

ముగ్గుల పోటీలకి వచ్చిన కొంతమందిని చూసి మా అల్లుడు "మామయ్యా. వంటల పోటీలు కూడా పెట్టారా ఏమిటి" అని ఆశ్చర్యపోయాడు. గరిటెలు, పెనాలు,గిన్నెలు,జల్లెడ,కంచం, గ్లాసు తదితర వస్తువులు తీసుకొస్తే మరి ఆ సందేహం రావడంలో ఆశ్చర్యం ఏముంది?  

 

మా అమ్మాయి అల్లుడి దగ్గరకొచ్చి “ఈ మధ్య ఇంటర్నెట్లో ఈజీగా ముగ్గులెయ్యండీ అంటూ ఇతర సామాగ్రి ఉపయోగించి ఎలా అందంగా ముగ్గులెయ్యచ్చో చూపిస్తున్నారు” అని చెప్తోంటే విన్న లక్ష్మి  “అసలు ముగ్గులెయ్యడం వస్తే ఇవన్నీ ఎందుకు” అంటూ నా చెవిలో గొణిగింది.ఈ పరికరాలతో వాళ్ళు ముగ్గులని ఎలా తీర్చిదిద్దుతారో అన్న ఆసక్తి పెరిగింది మా ఇద్దరికీ.

 

ఒక్కొకరికీ ఒక్కొక్క ప్యాకెట్టు చొప్పున ఒక పెద్ద ముగ్గు పొడి ప్యాకెట్టు, పెద్ద రంగుల ప్యాకెట్టుతో పాటు అందరికీ దాదాపు ఒకో డబ్బా నిండా  ఛాక్‌పీసులు కూడా ఇచ్చారు.

కమ్యూనిటీ క్లబ్బు మెంబర్లు వచ్చి పిల్లలకి డ్రాయింగు, కలరింగు పేపర్లు, కలర్ క్రేయాన్స్, పెన్సిళ్ళు,రబ్బర్లు,రంగు పెన్సిళ్ళు మొదలైనవి ఇచ్చి కూర్చోబెట్టారు.కాసేపటికి ఎలీసా అనే ఒక క్లబ్బు మెంబరు మా అమ్మాయి దగ్గరకొచ్చి "తల్లితండ్రులని పిల్లలకి సాయం చెయ్యద్దని చెప్పినా కానీ ఎవ్వరూ వినట్లేదు,అసలు పోటీ వాళ్ళకో  పిల్లలకో అర్ధం కావట్లేదు,నువ్వైనా వెళ్ళి చెప్పు" అంది విసుగ్గా.

 

మా అమ్మాయి అటు వెళ్తోంటే నేను కూడ అక్కడ ఏమి జరుగుతోందో చూడాలని వెళ్ళాను. పేపర్ మీద ఉన్న బొమ్మకి చిన్న పిల్లలు రంగు పెన్సిళ్ళతో రంగులద్దాల్సిన బొమ్మలని చిన్న పిల్లల బదులు తల్లితండ్రులు తీసుకుని దీక్షగా చేస్తున్నారు. అక్కడ డ్రాయింగు దగ్గరేమో పిల్లలకి బొమ్మలు గీసేసిచ్చి రంగులెయ్యడంలో కూడా యధాశక్తి సాయపడుతున్నారు.

 

తల్లి తండ్రులని సాయం చెయ్యద్దూ అని చెప్పినా ఒక్కరైనా వినిపించుకుంటేనా? ఆఖరికి ఛైర్మెన్ వచ్చి ఎవరికి  తల్లి తండ్రులు సాయం చేస్తే వాళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తాము అని ప్రకటించినా కాసేపు వెనక్కి తగ్గరే తప్ప మళ్ళీ మామూలే. “మా పిల్లలు గెలవాలి” అన్న కోరిక వారందరిలో తీవ్రంగా కనిపిస్తోంది.పిల్లలని రేసుగుర్రాల్లా చూసే వాళ్ళ తీరు బాధకలిగించినా ఏమీ చెయ్యలేక మిన్నకుండిపోయాను.

 

ఆ పక్కగా  ముగ్గుల పోటీదారులు భర్తలు ఆన్లైన్లో డిజైన్లు చూపిస్తోంటే తదేక దీక్షతో ముగ్గులేస్తూ మధ్య మధ్యలో మిగతా పోటీదారుల డిజైన్ల మీద ఒక కన్నేస్తున్నారు. 

 

ఒక పోటీదారు  నిర్వాహకుల దగ్గరకొచ్చి ఆన్లైన్లో కాపీ కొడుతూ ముగ్గులేస్తే మీరెలా అనుమతిస్తున్నారంటూ గొడవ.మొత్తానికి ఎలాగో ఆ అమ్మాయికి సర్ది చెప్పి పంపించారు.

 

మొదటి పోటీ సుందరి తను తెచ్చుకున్న వంట సామాన్లు ఉపయోగించి ముగ్గులేస్తోంది.ఆ పక్కనమ్మాయి చేతికున్న గాజులు తీసి అందులో ముగ్గు పోస్తూ  డిజైన్ వేస్తోంటే, ఆ వెనకనున్న ఇంకో "సుందరి" పంటకి ఎరువు చల్లినట్లు ముగ్గు పిండిని చల్లుతూ తన ప్యాకెట్టు ముగ్గు అయిపోగానే వెళ్ళి ఇంకో ప్యాకెట్టు తెచ్చుకోవడానికి ఉద్యుక్తురాలయ్యింది.

 

“అలా కుదరదు ఒక్కొక్కళ్ళకి ఒక్కటే ప్యాకెట్టు ,పైగా పెద్దదే ఇచ్చాము” అని చెప్పినా వినిపించుకోదే.మీరు మోసం చేస్తున్నారు అంటూ విసవిసా నడిచి తన ముగ్గు దగ్గరకి వెళ్ళిపోయింది.ఇంకో అమ్మాయేమో రంగులు సరిపోలేదని గొడవ.ఇన్ని పదనిసల మధ్య ముగ్గుల పోటీ రసవత్తరంగా సాగుతోంది.

 

 ఈ ఆర్భాటాలేమీ లేకుండా ఇంకొంతమంది చుక్కలు పెడుతూ వాటిని కలుపుతూ చక చకా ముగ్గులెయ్యడం చూసి తన  చిన్నప్పటి సంక్రాంతి ఙాపకాల్లోకి జారుకుంది నా అర్ధాంగి.

 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే  “అయ్యో అన్ని పోటీలూ ఒక సమయానికే మొదలయితే  ఎలాగ?” అని తెగ బాధ పడిపోయిన మొదటి పోటీ సుందరి  బెస్ట్ డ్రెస్ కోసం ఏమి వేసుకొచ్చిందో చూడాలని మా కుటుంబమంతా ఆసక్తిగా గమనిస్తోంది. కమ్యూనిటీ  అంతా ఊడ్చేందుకా అన్నట్లు నేలంతా పరచుకున్న పెద్ద గౌనుతో జుట్టు విరబోసుకుని, మూతికి ఇంత మందాన ఎర్ర రంగు పూసుకుని వచ్చింది. తన ఇద్దరు కూతుర్లని కూడా జుట్లు విరబోసి పొడుగాటి గౌన్లు,కళ్ళకీ,మూతులకీ రంగులు రాసి తీసుకొచ్చింది.

 

ఇంకో సుందరి క్రింద ఒక స్కర్టు లాంటిదానిపైన  నడుము వరకూ ఉన్నదేదో వేసుకొచ్చింది. దానిని ఘాగ్రా అంటారుట. ఇంకొంతమంది  ఉల్లి పొర చీరలు కట్టుకొచ్చారు. ఇద్దరో ముగ్గురో మాత్రం చక్కటి చీర కట్టు లేదా పంజాబీ డ్రస్సులలో హుందాగా ఉన్నారు.యాంకరింగ్ చేస్తామన్న ఆడవాళ్ళు కూడా ఎంతో హుందాగా వారి సంప్రదయానుగుణమైన చీర కట్టుతో వచ్చారు.

 

ముగ్గుల పోటీలు, డ్రాయింగు పోటీలు ముగిసినట్లు మైకులో ప్రకటించారు.బెల్లు కొట్తగానే పేపరుకి దారం కడుతున్నట్లు నటించి చివరి ప్రశ్నకి సమాధానం రాసే స్కూలు విద్యార్ధిలా డ్రాయింగు,కలరింగ్ పోటీల దగ్గర పిల్లలతో పాటు తల్లితండ్రులు గబగబా రంగులద్దెస్తున్నారు. అక్కడ ముగ్గుల దగ్గర భర్తలు,పిల్లలు తమ ఇంటావిడకి రంగులద్దడంలో హడావిడి పడుతున్నారు

 

మొత్తానికి అందరూ స్టేజీ దగ్గరకొచ్చాకా సాంసృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

 

పిల్లల డ్యాన్సులన్నీ సినిమా పాటల నేపధ్యంలోనే ఉన్నాయి.కానీ వీటి మధ్య  ఒక ఐదేళ్ళ పిల్ల ప్రదర్శించిన కథక్ నృత్యాన్ని చూస్తూ ఆహుతులు మైమరచిపోయారంటే అతిశయోక్తి కాదు. మధ్య మధ్యలో యాంకర్లు దీపావళికి సంబంధించినవి కొన్ని, ఇంకొన్ని తమాషా ప్రశ్నలు సంధిస్తూ పిల్లలనీ పెద్దలనీ ఆకట్టుకున్నారు.అలాగే దీపావళి ప్రాశస్త్యం గురించిఅందరికీ అర్ధమయ్యేటట్లు చక్కగా వివరించారు.

 

ఆ తరువాత భోజనాల సందడి మొదలు.ఇంక ఇక్కడ మొదలయ్యింది క్లబ్బు సభ్యులకి అసలు తంటా.

 

టిక్కెట్లు కొనుక్కునవారు లైన్లో నిలబడి పదార్ధాలని వడ్డించుకెళ్తున్నారు.వాళ్ళల్లో చాలామంది  ప్లేటు పొంగి పొర్లిపోయేవరకూ ఎందుకు వడ్డించుకుంటున్నారో అర్ధం కాలేదు.ఉత్సూకత ఆపుకోలేక క్లబ్బు సభ్యుడొకడు వెళ్ళి చూసొచ్చి అసలు సంగతి చెప్తోంటే  విని ఆశ్చర్య పోవడం మిగతా సభ్యుల వంతు.

 

చాలా మంది ఒకో కుటుంబం నుండీ ఒకరే టిక్కెట్టు కొనుక్కుని, టిక్కెట్టు కొనుక్కోని తమ భార్యా లేదా భర్త కోసమని అలా ప్లేటు నిండా పదార్ధాలు వడ్డించుకెళ్ళి ఇద్దరూ చెరి సగం తింటున్నారుట.టిక్కెట్టు ఉన్నా కానీ కొంచెం లేటుగా వచ్చిన కొంతమందికి భోజనం లేదు పాపం.

 

”మనం  బఫే భోజనం ఉంది అని చెప్పి టిక్కెట్లు అమ్మి, తీరా వచ్చాకా వాళ్ళకి భోజనం లేని కారణాన డబ్బులు వెనక్కి తిరిగిచ్చెయ్యలని” క్లబ్బు సభ్యులు తీర్మానం చేసారు.అలాంటి వారందరికీ ఛైర్‌మెన్ పేరు పేరునా క్షమాపణలు చెప్తూ వారి వివరాలు రాసుకుని మరునాడు క్లబ్బుకొస్తే వారి డబ్బులు వారికి వెనక్కి ఇచ్చెస్తామని చెప్పాడు.

 

ఇలాంటి వారు ఒక పాతికమంది మించి లేరు కాబట్టి వారందరికీ కార్యక్రమం అయ్యేలోపు తనే ఏదో ఒకటీ వండి తెస్తానని లక్ష్మి మా అమ్మాయికి చెప్పింది.

 

"అలా కుదరదమ్మా, ఇక్కడి ప్రభుత్వ రూల్స్ ప్రకారం కమ్యూనిటీ ఈవెంట్స్ అన్నింటికీ లైసెన్స్ ఉన్న క్యాటరింగ్ వాళ్ళ దగ్గరనుండి తీసుకున్న ఆహారాన్నే వడ్డించాలి,లేకపోతే ఏమన్నా తేడాలొస్తాయని వీళ్ళ భయం.ఎందుకు లేని పోని తలనెప్పి" అంది భావన .

 

భోజనం చేస్తూ ఎవ్వరూ గమనించట్లేదని క్రేయాన్స్, పెన్సిళ్ళు గబగబా తమ సంచిల్లో సర్దేస్తున్న కొంతమంది తల్లితండ్రులని ఆపుదామా అని ఒక్క నిమిషం అనిపించినా, నాకెందుకు మధ్యలో పెత్తనం అని చూస్తూ ఉన్నాను. ఒక్క పదినిమిషాల్లో చిన్న రబ్బర్ కూడా మిగల్చకుండా అన్నింటినీ తమ సంచీల్లోకెక్కించేసారు.ముగ్గుల దగ్గర ఛాక్‌పీసుల పరిస్థితి కూడా అంతే.

 

 

ఇంతలో ముగ్గులు,డ్రాయింగు,కలరింగు పోటీల ఫలితాలు ప్రకటించారు.పోటీ సుందరులెవరికీ పాపం కనీసం మూడో ప్రైజు కూడా రాలేదు.ప్రైజులొచ్చిన ముగ్గులని పరిశీలిస్తే నాకు అర్ధమయ్యిందేమిటంటే చుక్కలు పెట్టి చక్కగా వేసిన ముగ్గులకే ప్రైజులు దక్కాయి.డ్రాయింగుల్లాగ రకరకాల పరికరాలతో తీర్చిదిద్ది రంగులద్దిన వాటిని జడ్జీలు అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు.

ఫలితాలు చూడగానే పోటీసుందరుల విరుపులు నా దృష్టి దాటిపోలేదు.ఇంకొక సుందరయితే ఇంకో అడుగు ముందుకేసి బహుమతి రాలేదని తాను వేసిన డ్రాయింగు(ముగ్గు)ని చెరిపేసింది.   

అలాగే పిల్లల  డ్రాయింగు, కలరింగు పోటీలలో కూడా తల్లి తండ్రులు సాయం చేసిన చిత్రాల మీద ఎలీస ఒక ప్రత్యేక గుర్తు పెట్టిందిట, వాటిని మినహాయించి మిగతా వాటిల్లో ఉత్తమమయిన వాటిని ఎంపిక చేసారుట.ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి,పిల్లలు గీసినవాటిల్లో కొన్ని చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.

 

ఇంక ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న బెస్ట్ డ్రెస్ ఫలితాలు. చీర కట్టుకుని హుందాగా ఉన్న వారిలో ఒకావిడకి ఆడవారిలో ప్రైజు వచ్చింది.గుజరాతీ చీరకట్టుతో ముద్దొస్తున్న ఓ నాలుగేళ్ళ పిల్లకి,అడ్డ పంచ,పైన సిల్కు చొక్కా వేసుకున్న చిన్న తమిళ తంబికీ పిల్లల క్యాటగిరీలో బహుమతులొచ్చాయి.మగవారిలో చాలా మంది షార్ట్స్ లేదా జీన్స్ వేసుకొచ్చారు.వెతగ్గా వెతగ్గా నెహ్రూ కాలర్ సూటేసుకొచ్చిన పోటీసుందరి భర్త కనిపిస్తే ఆయననే బహుమతి వరించింది.

 

వెంటనే మొదటి పోటీసుందరి గబగబా మా అమ్మాయి దగ్గరకొచ్చి "మీరేనా ముగ్గుల పోటీలకి జడ్జి?" అని అడిగింది."మేము కాదు కానీ ఏమయ్యింది" అని అడిగింది భావన."మీరిచ్చిన రంగులు కాకుండా తమ సొంతం రంగులు కూడా ఉపయోగించిన వారికే ప్రైజులొచ్చాయి, ఇదెక్కడి న్యాయం?" అని నిలదీసింది.పరిస్థితి చేయిదాటుతోంది అని గమనించిన వంశీ వచ్చి "సరేనండీ, మీరిచ్చిన ఫీడ్‌బ్యాక్ మేము దృష్టిలో పెట్టుకుంటాము" అని సర్దిచెప్పబోయినా వినదే."మీ ఛైర్‌మెన్‌ని పిలవండి అసలు ఏ అంశాలని బట్టి ముగ్గుల పోటీ, బెస్ట్ డ్రెస్ విజేతలని ఎంపిక చేసారో తెలియాలి" అంటూ చిందులు మొదలెట్టింది.

ఈవిడ అరుపులు, కేకలు విన్న కమ్యూనిటీ ఛైర్‌మెన్ జాన్సన్ అక్కడికొచ్చి "చూడండి,మేము ఇక్కడ నిర్వహించింది ముగ్గుల పోటీ. స్కేళ్ళు, కర్రలు తీసుకొచ్చి గియ్యడానికి ఇది డ్రాయింగు కాదు. చక్కగా చుక్కలు పెట్టి వేసి, రంగులద్దిన ముగ్గులనే ఎంపిక చేసాము.ఇంక బెస్ట్ డ్రెస్ అంటారా?సంస్కృతిని ప్రతిబింబించేటట్లు తయారయి వచ్చిన వాళ్ళనే బహుమతులు వరించాయి. వాళ్ళు భారతీయతకి నిలువెత్తు నిదర్శనంలా ఉన్నారు.మిగతా పిల్లలు కూడా ముద్దుగా ఉన్నారు కానీ వీరే అందరిలోకీ భిన్నంగా ఉన్నారనిపించి వీరిని ఎంపిక చేసాము,ఇంక పిల్లల పోటీల్లో తల్లి తండ్రుల ప్రమేయం లేకుండా బొమ్మలేసిన వారినే పరిగణన లోకి తీసుకున్నాము, ఇంకా ఏమైనా సందేహాలున్నాయా?" అనేసరికి  సుందరి మొహం పాలిపోయింది.

 

అయినా తన ఉక్రోషం ఆపుకోలేక "అలా అంటే సంప్రదాయ దుస్తుల పోటీ అని మీరు మొదటే చెప్పాల్సింది, అలాగే తయారయ్యి వచ్చేవాళ్ళము" అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి తన పిల్లలిద్దరినీ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయింది.పాపం ప్రైజు గెలిచిన ఆనందం కూడా లేకుండా ఆమె భర్త ఆమెని అనుసరించక తప్పింది కాదు.

 

ఇంతలో ఒకాయన తన ఆరేళ్ళ పిల్లవాడిని తీసుకొచ్చాడు.”ఈయన  ఇప్పుడు పిల్లల పోటీల ఫలితాల గురించి యుద్ధానికి వచ్చాడు కాబోలు” అనుకున్నారు అంతా. అందరి అంచనాలనీ తలక్రిందులు చేస్తూ ఆయన వాళ్ళబ్బాయిని ముందు తోసాడు.

 

ఆ అబ్బాయి క్లబ్బు సభ్యుల దగ్గరకొచ్చి తన సంచీలోంచి క్రేయాన్స్, పెన్సిళ్ళు తీసి వారికిస్తూ అందరూ తీసుకుంటున్నారని తాను కూడా ఇవన్నీ సంచీలో పెట్టుకున్నాననీ, తాను చేసిన పని తప్పు అని తండ్రి తెలియచెప్పడంతో  తిరిగి ఇచ్చేస్తున్నాననీ, తప్పయ్యింది క్షమించమని కన్నీళ్ళతో అభ్యర్ధించడం చూసి నా కళ్ళు తెలీకుండానే వర్షించాయి ఆ తండ్రి తన పిల్లాడికి నేర్పుతున్న సంస్కారానికి.

 

 

మొత్తానికి ఉడ్స్‌విల్లే కమ్యూనిటీ దీపావళి సంబరం అలా ముగిసింది.మిగతా పనులు పూర్తి చేసుకుని అర్ధరాత్రవుతుండగా భావన, వంశీ ఇల్లు చేరారు.

 

భారతీయుల కోసం ఏదో చేద్దామని  కమ్యూనిటీ క్లబ్బు వాళ్ళు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మన భారతీయులు డబ్బులు ఆదా చెయ్యడానికి ఒక్క టిక్కెట్టు మీద ఇద్దరు భోజనం చెయ్యడం,పిల్లల పోటీల్లో తల్లితండ్రులు వారిని గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించడం చూస్తోంటే దేశం దాటి వచ్చి డాలర్లలో సంపాదించడం వచ్చింది, జీవితానికి  కాస్త హంగులు చేరాయి తప్ప మనసుల్లో స్వార్ధం, అనవసర పోటీ తత్వం అలాగే ఉన్నాయనిపించింది.

 

కానీ ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా అధ్భుతంగా యాంకరింగ్ చేసిన ఆ ముగ్గురూ,అలవోకగా ముఖంలో హావ భావాలు  పలికిస్తూ కథక్ నృత్యం చేసిన ఆ చిన్న పిల్ల,ఆరేళ్ళ పిల్లాడికి తాను చేసినది తప్పు అని తెలియచేసిన ఆ తండ్రి,సంప్రదాయ నృత్యం మరుగున పడకుండా పిల్లలని ప్రోత్సహిస్తూ వారికి నృత్యం నేర్పుతున్న సోనల్  మాత్రం మా మనసుల్లో ఎప్పటీకీ నిలిచే ఉంటారు.

 

 

 

*****

bottom of page