top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg
samputi.jpg
maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

అనుకున్నదొక్కటీ

 

ఎం.ప్రసాద్

M-Prasad.JPG

అనుకున్నదొక్కటీ….

మా అన్నయ్య శేషారావు అన్నమయ్య కీర్తనలని పాడి వినిపిస్తున్నారు.

“ఇదిగో ప్రసాదూ...’హనుమత్తోడి’ రాగం అంటే ఇది. దీంట్లోంచే భైరవి రాగం కూడా వస్తుంది.                                               ఈ రాగంలో కృతులు చాలా తక్కువ. అయినా ఈ రాగంలో కూడా అన్నమయ్య పాడడం అన్నది,                                                           ఆయన సంగీత నైపుణ్యాన్ని గురించి మనకి కొంత అవగాహన ఇస్తుంది అన్నమాట.”                                                         ఆ పాట తన్మయత్వంలో అలా చెప్పుకెళ్ళిపోతున్నారు.

నాక్కూడా సంగీతం గురించి అవగాహన ఉందీ అని ప్రూవ్ చెయ్యాలనుకున్నాను.                                                                                         అదే నా రాంగ్ స్టెప్ అని తరువాత తెలిసొచ్చింది.

“మా కోడలు సుగుణ కూడా సంగీతం లో కొంత నిష్ణాతురాలే. నాకంటే ఇవేమీ తెలియవు కానీ, తను ఈ విషయంలో అఖండురాలు” అన్నాను నేను. మా అన్నయ్య గారి బారినుంచీ బయట పడాలంటే, ఇదొక్కటే మార్గం అనిపించింది.            ఇష్టం లేకపోయినా మా కోడలు గురించి గొప్పగా చెప్పుకోవలసి వచ్చింది.

“అవును. తనకి కూడా సంగీతం వచ్చు. తను విజయవాడలో సంగీతం క్లాసులు అటెండ్ అవడం నాకు తెలుసుగా!” అన్నారు మా అన్నయ్య.

“హమ్మయ్య. ఇంక మా సుగుణ గారిని ఈయనకి అంటగట్టెయ్యచ్చు” అనుకున్నాను నేను.

“డీజీ..డీజీ..” ( డీజీ అన్నది తన నిక్ నేమ్ అన్నమాట. “దుర్గుణ” అని నాకూ, తనకీ మాత్రమే అర్ధం అవుతుంది. తక్కినవాళ్లు ’డియర్ గ్రాండ్ డాటర్’ అని అనుకోవాలన్నమాట. కానీ,చిన్నప్పటి నుంచీ ఉన్న అలవాటు వల్ల నన్ను “తాతా అనే పిలుస్తుంది.) అని పిలిచాను.

ఏ కళనుందోకానీ, వెంటనే అటెండ్ అయ్యింది నన్ను.

“డీజీ..నీ సంగీత ప్రావీణ్యాన్ని బయట పెట్టే అవకాశం వచ్చింది. ఏదీ.. ఒక మంచి కీర్తన..మోహనరాగంలో,                              త్రిపుట తాళంలో పాడు” అన్నాను. నాక్కూడా సంగీతంలో కొంచెం పరిచయం ఉందని అందరూ అనుకోవాలని.

“అలాగే. ఒఖ్ఖ నిముషం” అంటూ లోపలికి వెళ్ళిపోయింది మా డీజీ.

కాస్సేప్పటికి నెత్తిమీద ఒక ప్లాస్టిక్ బేసిన్ పెట్టుకుని, చీరకొంగు లోపలికి దోపుకుని, మా ముందుకొచ్చింది.

“అదేమిటి? నిన్ను పాట పాడమంటే, ఈ ఫాన్సీడ్రెస్ ఏమిటి?” కోపంగానే అడిగాను నేను.

“ఓ చక్కని కీర్తన పాడమన్నావు కదా? అందుకోసం అన్నమాట” ఠకాలున అంది మా డీజీ.

“ఏమో? ఆ ప్లాస్టిక్ బేసిన్ మీద కూర్చుని పాడుతుందేమో” అనుకున్నాను నేను.                                                                     కానీ తను “మధురానగరిలో..” అంటూ డాన్స్ మొదలెట్టింది.       

“నిన్ను పాడమంటే, అలా డాన్సులు చేస్తావేం? ’మధురానగరి లో’ అన్నది మోహన రాగమా?” అడిగాను నేను.

“దేనికైనా సరే, ముందు ఇష్ట దేవతా ప్రార్ధనా, తరువాత సరస్వతీదేవి ప్రార్ధనా, డాన్సు చేసేవాళ్ళకి శివ స్త్రొత్ర మూ కంపల్సరీ. అయినా నువ్వు అడిగావని, వాటన్నిటినీ మానేసి, డైరెక్ట్ గా పాటలోకి వచ్చేస్తున్నాను.                                     అయినా కోప్పడితే ఎలా?” ఘాటుగా జవాబిచ్చింది మా డీజీ.

“ఇదంతా పాడడం లో భాగమే అయితే అయామ్ సారీ. ఏదో డాన్సులు చేస్తున్నావనుకున్నాను” అన్నాను నేను.

“అదే నీతో వచ్చిన చిక్కు. నేను సంగీతం తో పాటు డాన్సు కూడా నేర్చుకున్నాను.                                                                                      వెంపటి సత్యం గారి ప్రశిష్యుడి వద్ద అన్నమాట.  సంగీతం అంటే కేవలం వాచికం. నృత్యం అంటే ఆంగికం.                          డాన్సు చేస్తూ పాడుతున్నానూ అంటే, ఆంగిక వాచికాలని నీకు చూపిస్తున్నాను అన్నమాట.                                                                         నీకు సరిగ్గా వినబడదని నాకు తెలుసు కాబట్టి, నువ్వడిగిన దానికన్నా హయ్యర్ లెవెల్ కి నిన్ను తీసుకెళుతున్నానన్నమాట.  అండర్ స్టాండ్?” అంది మా డీజీ.

“కరెక్ట్ సుగుణా. ’మధురా నగరిలో చల్లలమ్మబొదు’ అనే పాట తరంగాల్లొ కూడా వస్తుంది.                                                                అంటే నృత్యాభినయానికీ పనికొస్తుంది.  పళ్ళెం మీద నిలబడి ’తిల్లానా’ కూడా చేసేస్తావా?”                                                          తనని అభినందిస్తూ అడిగారు  మా అన్నయ్య గారు.

“అసలు పళ్ళెం మీదే ఈ డాన్స్ నేర్చుకున్నాను తాతా. ఇప్పుడు సరిగ్గా ప్రాక్టీస్ లేదు కదా?                                    పళ్ళెం మీద డాన్సు చెయ్యలేనేమో అని భయం” అంది మా డీజీ.

“అసలు నిన్ను డాన్స్ ఎవడు చెయ్యమన్నాడు? ఒక పాట పాడవే అంటే..ఇవన్నీ ఎందుకు?”                                   కోపంగానే అడిగాను నేను.

“ఇదంతా నీ కోసమే! పాటొకసారీ, డాన్స్ ఇంకొకసారీ...అంటే నాకు కుదరదు బాబూ.. డాన్స్ చేస్తూనే పాడతాను.               నాకు మా గురువుగారు ఇలాగే నేర్పారు” అంది మా డీజీ ఖరాఖండీగా.

“అయితే ఈ పాట మోహనరాగం..త్రిపుట తాళం..అవునా?” అడిగాను నేను.

“కాదు” వెంటనే జవాబిచ్చారు మా అన్నయ్యగారు.

“ఎందుకు అడిగానురా దేముడా!” అనుకుని, తల పట్టుక్కూర్చున్నాను నేను.

“అయితే డీజీ..నువ్వు డాన్స్ చేస్తూంటే..మైక్ దగ్గర ఇంకొకళ్ళు కూర్చుని పాడుతుంటారు కదా?                                           ఆ పక్కనే ఓ కర్ర పట్టుకుని దేనిమీదో కొడుతూంటారు కదా? ఆ పాటపాడే వ్యక్తిని అనుకరించచ్చు కదా?                                      నీకూ నాకూ కూడా ఈ డాన్స్ బాధ తప్పుతుందీ...” సలహా ఇచ్చాను నేను.  

“అది నిజమే. మన కళ్యాణి వస్తే తను పాడేది. నేను డాన్స్ చేసేదాన్ని. లేకుంటే నా పాటా తన డాన్సూగా ఉండేవి. మరిప్పుడు తను  నిన్ననే యూ ఎస్ నుంచి వచ్చిందాయె. ఇక్కడికి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా? అందుకని,                                                                                                                నిన్ను నొప్పించడం ఇష్టం లేక, నేనే పాడుతూ డాన్స్ చేస్తున్నాను అన్నమాట” సంజాయిషీగా అంది డీజీ. 

తన కూతురు విషయం వచ్చేసరికి, మా ఆవిడ కలగజేసుకుంది.

“అది నిన్ననే వచ్చినా, రేపు తన అత్తా మామలతో తీర్ధయాత్రలకి వెడుతోంది.                                                 అందుకని, ఇప్పుడే ఇంకో గంటలో అది రావచ్చు. నాకు ఫొన్ చేసిందిలే!” అంది నా భార్యామణి.

“ఫరవాలేదు.  డీజీ కొంచెం దారిలోకి వస్తోంది” అనుకున్నాను నేను.

“అది కాదు డీజీ.  డైరెక్ట్ గా ఆ మోహన రాగం.. త్రిపుట తాళం లో ఆ పాట పాడెయ్యచ్చు కదా?                                        అంతా ఇంట్లో వాళ్ళమే కదా? ఇదేమీ స్టేజ్ పెర్ఫార్మెన్సు కూడా కాదు కదా?                                                                  కొన్ని రూల్స్ బైపాస్ చెయ్యచ్చు కదా?” అన్నాను నేను.                   

“సారీ. అదేం కుదరదు. ఇది మినిమమ్ రిక్వైర్ మెంట్ అన్నమాట”  అంది మా డీజీ.  

“మరి .... నీ  ’ చల్లలమ్మబోడానికి’ ఎవరూ అడ్డుకోవడం లేదే? అదెలా?” అనుమానంగా అడిగాను నేను.

“అవును. అగస్థ్యా గాడు స్కూల్ కి వెల్లిపోయాడు కదా? వాడుంటే నన్ను అడ్డుకుంటునట్టుగా ఏక్ట్ చేసేవాడు.                   ఇప్పుడు నన్ను ఆ శ్రీకృష్ణుడు అడ్డుకున్నట్టుగా...అతడు ఇక్కడ లేకపోయినా సరే...నేనెలా అభినయిస్తానో చూడు”          అంది మా డీజీ.  మళ్ళీ తన చీర కొంగు సరిచేసు కుంటోంది.  

“అయితే ఈ ’మధురా నగరిలో’ పాట అయిపోయిన వెంటనే, ఆ మోహన రాగం లో పాట పాడుతూ డాన్స్ చేసేస్తావా?” కుతూహలంగా అడిగాను నేను. 

“కుదరదు. ’మధురానగరి లో’ తర్వాత, ’ముద్దుగారే యశోదా..’, ఆ తరువాత ’ఇట్టి ముద్దులాడు బాలుడూ..’ పూర్తయ్యాకే,  నీ పాట వస్తుంది”  అంటూ అడ్డం పడిపోయారు మా  అన్నయ్య గారు.

అప్పటికే ఇంట్లోని వాళ్ళందరూ హాల్లోకి చేరుకున్నారు. ఆడియన్స్ రెడీ అన్నమాట.                                                       కానీ, వాళ్ళకి ఈ సందర్భం తెలియదు కదా?

“సుగుణా! దాంతోబాటే ’అదివో అల్లదివో..’ అలాగే ’శ్రీమన్నారాయణ...’ పాటలకి కూడా డాన్స్ చేసెయ్.                                      ఈవాళ శనివారం. వేంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు కూడా” అంది మా వదిన.                                                          వాళ్ళంతా మా డీజీ గారి నాట్య కౌశలాన్ని చూడ్డానికి ఆరాట పడిపోతున్నారు.

“నా ఖర్మ” అనుకుంటూ తలపట్టుక్కూర్చున్నాను నేను.

“తాతా...నా అడుగులు చూడు. అసలు అందులోనే సగం అభినయం వచ్చేస్తుందన్నమాట.                                       ఆపైన నా చేతులూ, కళ్ళూ..బాల కృష్ణుడు నన్నుఅడ్డుకుంటున్నట్టుగా నా అభినయం...అబ్జర్వ్ చెయ్యి”                                 అంది మా డీజీ.

“నీకెందుకు సుగుణా...నువ్వు తప్పుగా స్టెప్స్ వేస్తే నేను కరెక్ట్ చేస్తాలే” అంది మా చెల్లెలు.                                                               తను ఎప్పుడొచ్చిందో ఈ హడావుడి లో నేను గమనించ లేదు.

“అంటే.. మూడు..మహా అయితే ఐదు... పాటలు... అయితే కానీ, నేను అడిగిన పాట రాదన్న మాట.                                  మా డీజీ గారు మూడు పాటలకే అలిసిపోతే...మళ్ళీ మా డీజీ కి ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే అన్నమాట.                     భలే ఇరకాటం లో పెట్టావురో దేవుడోయ్!” అనుకున్నాను నేను.

ఇంతలో మా అమ్మాయి కళ్యాణి రానే వచ్చింది.                                                                                                     వస్తూనే,  తన అమ్మనీ, వదిననీ, ఓసారి కౌగలించేసుకుని, నా దగ్గరికి వచ్చింది.

“ఏంటి బంగారు తల్లీ? నిన్న హైద్రాబాదు వస్తే, ఇప్పుడా నా దగ్గరికి రావడం?                                                                నీకు ఓ డాడీ ఉన్నాడని గుర్తుందా?” ఆడిగాను నేను.

“ఇంకా గంట మాత్రమే టైమ్. మా వాళ్ళందరితోనూ కలిసి తీర్ధ యాత్రలకి వెళుతున్నాను. కాశీ..ప్రయాగా..                          అలాగే చార్ ధామ్ యాత్రలు కూడా చేసేసి వస్తాం. ఓ పదిహేను రోజుల ట్రిప్. ఆ స్లీపర్ బస్సంతా మనవాళ్ళేలే!                         ఆ తరువాత నేను మళ్ళీ యూ ఎస్ వెళ్ళే వరకూ నీ దగ్గరే ఉంటాలే” అంది కళ్యాణి.                                                             మళ్ళీ తనే, “అవును. ఇవన్నీ మా మావగారు నీతో కూడా చెప్పానన్నారే?” అంది.                                                                                                                                                          తను కూడా అత్తవారింట్లో అన్నీ చూసుకోవాలికదా? నాకోపం కాస్తా ఎగిరి పోయింది.

మా ఫ్రెండ్ సుధాకర్ నా కూతురు మావగారు.

“వాడు నాతో ఎప్పుడు చెప్పినా, నువ్వెందుకు నా దగ్గరికి రావడం లేదో ...వాడి దగ్గరే ఉన్నా, వాడికి ఎందుకు సంతృప్తి లేదో ..ఇలాంటి విషయాలే చెబుతాడు గానీ, నిన్ను నా దగ్గరికి పంపిస్తున్నట్టు మాత్రం చెప్పడమ్మా” అన్నాను నేను.              నా ఫ్రెండ్ సుధాకర్  ని అంతకన్నా చులకన చెయ్యదలుచుకోలేదు.

ఈ లోపులో మా చెల్లెలూ, మా ఆవిడా, మా వదినా... ఓ నాలుగు ఖాలీ థంప్స్ అప్ బాటిల్స్ ని తీసుకొచ్చి,                       కళ్యాణి ముందు పడేశారు.

“ఇదిగో కళ్యాణీ..ఈ బాటిల్స్ లో కాశీ గంగా, అలహాబాద్ లోని సంగమం లో గంగా, తీసుకుని రా.                                                                    అక్కడ అమ్మే నీళ్ళు కొనకు. అవి ఎప్పటివో? ఎక్కడివో?  ఈ గంగ తో రామేశ్వరం లోఅభిషేకం చేశాక,                                                        ఆ రామేశ్వరం లోని జలాలతో మళ్ళీ కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. కాస్త కుదురుగా చెప్పిన పని చెయ్యి”                      అంది మా వదిన అధారిటీ గా.

“అలాగే పెద్దమ్మా. మా అత్తగారు కూడా ఇంకో డజన్ బాటిల్సూ, నాలుగు కేన్లూ తీసుకొస్తున్నారు.                                           మా వాళ్ళకి పంచి పెట్టడానికి” అంది కళ్యాణి. మళ్ళీ తనే,

“వదినా, ఇందాకా ఫోన్ చేశావా? నేనెలాగైనా ఇంకో గంటలో వచ్చేదాన్నే కదా?” అంది.

“మీ డాడీ మోహనరాగం..త్రిపుట తాళం లో ఓ పాట పాడమని అడిగారులే.                                                                     నువ్వు కూడా తోడుంటే బాగుంటుందని  ఫోన్ చేశాను. థాంక్స్ ఫర్ కమింగ్” అంది సుగుణ.

నాకు తెలియకుండానే ఎన్ని విషయాలు జరిగి పోతున్నాయి? అనుకున్నాను.

ఇంతలో ఆడవాళ్ళందరూ ఓ పక్కకి చేరి మంతనాలు మొదలెట్టారు.

“అత్తా. నువ్వు పాట పాడుతూ తాళం వెయ్యి. నేనూ సుగుణా డాన్స్ చేసేస్తాం” అంటోంది కళ్యాణి.                                       అప్పటికే తన మెడమీది చున్నీ ...నడుం మీదికి మారిపోయింది.

“అత్తా. ’థకిట..థకిట..థకిట..’కాదు.  ’తధిగిణ..తకిట.. తధిగిణ’  అని వాయించు. తిల్లానా క్కూడా పనికొస్తుంది.               నెక్స్ట్ మంత్ ’ఆటా’ వాడి ఫంక్షన్ లో నా డాన్స్ ప్రొగ్రాం కూడా ఉంది మరి”                                                         అంటూనే తన అన్న ’బాబీ’ వైపు తిరిగి మళ్ళీ అంది.

“బాబీ ఈ వేళటి నా డాన్స్ ని వీడియో తియ్యి. మీ బావగారు చూస్తే  స్టన్ అయిపోవాలి”    

చెల్లెలి కోరిక మీద  మా బాబీ వెంటనే తన వీడియో కెమేరా తీసుకొచ్చి, ఏంగిల్స్ సరి చూసుకుంటున్నాడు.

ఈ లోపులో ఆడవాళ్ళంతా తమకిష్టమైన పాటల లిస్టు కళ్యాణికి అందజేస్తే, సుగుణా, కళ్యాణీ వాటిని                              ప్రయారటైజ్ చెయ్యడంలొ పడ్డారు.

“సుగుణా. డాడీ అడిగిన మోహనరాగం కీర్తన వీటిల్లో లేదు కదా? మరి ఇంకో పాట ఏదైనా సెలెక్ట్ చెయ్యనా?”                        అడిగింది కళ్యాణి.

“ఏం అక్కరలేదు కళ్యాణీ. తనకి అస్సలు సంగీతం గురించి తెలవదు. మనం ఏదో ఒక పాట పాడేసి...అభినయం చేసేసి... అదే మోహనరాగం..త్రిపుటతాళం..అని నువ్వు చెప్తే నమ్మేస్తారు. అందుకే కదా నిన్ను రమ్మన్నాను?                                          ఎటొచ్చీ పెదమామ గారి తోనే తంటా” అంది మా సుగుణమ్మ గారు.

వెంటనే మా కళ్యాణి గారు తన పెదనాన్న గారితో ఏదో మాట్లాడడం నేను అబ్జర్వ్ చేశాను.

మా అన్నయ్య గారు నా దగ్గరికి వచ్చి,

“ప్రసాదూ..మనం డైరెక్ట్ గా పాడినా సరే... ఈ సరస్వతీ ప్రార్ధనా, వెంకటేశ్వర స్వామి వారి స్తుతీ,..కంపల్సరీ..                      ఆ తరువాతే మనకి నచ్చిన పాటలు అన్నమాట” మా అన్నయ్యగారు నాతో చెబుతున్నారు.

“నయం. ఇంకా షిరిడీ సాయి స్తుతీ, హారతీ కూడా వీటిల్లో చేర్చలేదు. ఈ విధంగా బతికిపోయాను” అనుకున్నాను నేను. అయితే, ఈ లోపులోనే మా అన్నయ్య గారు తన ఉపదేశామృతాన్ని కంటిన్యూ చేశారు.

“నువ్వడిగిన మోహనరాగం..త్రిపుట తాళం వుంది చూడూ? అది అంత తొందరగా నీకు అర్ధం కాదు.                                   ముందు ఆది తాళం గురించి తెలుసుకోవాలి. అందులోని గమకాలూ..స్వరాలూ..తెలుసుకోవాలి.                                  ’రి గ మ..రి గ మ ..రి గ మ’ అంటే అది త్రిపుట తాళం.  ’గ మ పా..గ మ పా..”  అన్నది జంట తాళం.                              వీటిని ఈ తోడి రాగంలోనూ, మోహన రాగం లోనూ, కళ్యాణి రాగం లోనూ,  మోహన కళ్యాణి లోనూ, ఎలా వాడచ్చో నువ్వు తెలుసుకుంటే తప్ప... ఆ మోహనరాగం , త్రిపుట తాళం..సంగతి నీకు తెలియదు. అంతేనా సుగుణా?” అన్నారు  మా  అన్నయ్య గారు. కళ్యాణి కోరిక ఆయనకి అర్ధం అయ్యింది మరి!                                                                               “ఓరి నాయనోయ్...నేరక పోయి అడిగానురా దేవుడా..ఇప్పుడు నాకు సంగీతం లోని స్వర గతులూ.. రాగాలూ, తాళాలూ..ఇవన్నీ నాకు ఈ నృత్యరూపం లో బోధిస్తారా?  ఏదో నోటికొచ్చిన రాగం...తాళం అడిగాను.                           అవి నిజంగా ఉన్నాయనీ, అలాంటి పాటలు పాడొచ్చనీ..అదీ నృత్య రూపం లో చూపించొచ్చనీ...మా కోడలు గారే నన్నిలా బాధ పెడతారనీ...నేనెప్పుడూ అనుకొలేదే? దూరదేశాల్లో ఉండే నా కొడుకూ బతికి పోయాడు.                      స్కూలుకెళ్ళిన నా మనవడూ బతికి పోయాడు. నేనే ఇలా బలై పోయాను” అనుకుని,                                         “దాందేముంది అన్నయ్య గారూ. సంగీతం అంటే ఆషామాషీ కాదని నాకూ తెలుసు.                                                                      ఆ పాట తను పాడుతూంటే, మీరే విశ్లేషిస్తారని, అలా అడిగాను” అన్నాను నేను.      

“నువ్వు సుగుణని అడిగావు కాబట్టి, నేను అబ్జెక్ట్ చెయ్యలేదు. లేకుంటే నేనే ఆ పాట పాడి వినిపించే వాడిని.                  సాయంత్రానికల్లా,  మన పెద్ద చెల్లెలు జయ కూడా వచ్చేస్తోంది కదా? ఇంక ఈ రోజంతా  మనకి ’గానాబజానా’యే! నీక్కావలిసిన పాట తను పాడి వినిపిస్తుందిలే”  అన్నారు మా అన్నయ్య గారు.

“బాబోయ్! జయత్త వస్తే,తన ఖబుర్లలో పడితే, ఇక నా రేపటి ప్రొగ్రామ్ కూడా కాన్సిల్ చేసుకోవాలి.                                        నన్ను త్వరగా పంపెయ్ అమ్మా. ప్లీజ్”                                                                                                                      అంటూ హడావుడిగా, తన వదినని తీసుకుని డాన్స్ రిహార్సల్ కి వెళ్ళిపోయింది కళ్యాణి.                                            మరి అక్కడ ఆడియన్స్ వైట్ చేస్తున్నారు కదా! మా అన్నయ్యగారు కూడా ఆ ప్రొగ్రామ్స్ పర్యవేక్షణకి వెళ్ళిపోయారు.

హమ్మయ్య! వీళ్ళెవరూ ఇక నన్ను పట్టించుకోరు అన్నమాట.                                                                                        జయ రూపంలో ఆ భగవంతుడే నన్ను రక్షిస్తున్నాడని తెలునుకున్నాను.                                                             తృటిలో ఎంతో పెద్ద ఆపద నుంచి తప్పించుకున్నందుకు నన్ను నేనే అభినందించుకుంటూ,                                                                ఎందుకైనా మంచిదని ఆ స్వామి వారికి కూడా నమస్కారం పెట్టాను.                                                                                              లేకపోతే, నేననుకున్న దేమిటి? ఇప్పుడు జరుగుతున్న దేమిటి?                                                                       మొత్తానికి కధ ఈ విధంగా, సుఖాంతం.                                                                                                                     ****    ******   ******   

  ఫ్రసాద్

Idea on 14.06.2014. Typed on 14.06.2014                                                                                                                          

bottom of page