
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
'అలనాటి' మధురాలు
చాసో గారి 101 జయంతి సంవత్సరం సందర్భంగా...

స్వర్గీయ చాగంటి సోమయాజులు (చాసో)
(1915-1994)
చాగంటి సోమయాజులు ( 1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు. శ్రీకాకుళంలో జన్మించిన ‘చాసో’ అనబడే చాగంటి సోమయాజులు తల్లితండ్రులు కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ. తర్వాత పెదతల్లికి దత్తుడిగా విజయనగరం వెళ్ళారు. పెత్తల్లిగారి పేరు తులసమ్మ. ఆయన బాల్యం నాగావళీ తీరంలో పైరుపచ్చల మధ్య గడిచింది. చాసో అయిదోఫారం వరకు శ్రీకాకుళం లో చదివారు. విజయనగరం ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేసి మహారాజా కళాశాల విజయనగరంలో పైచదువులు చదివారు.
1941 లో జూన్ సంచిక లో ఆయన మొట్ట మొదటి కవిత “ధర్మక్షేత్రము” ప్రచురించబడింది అని తెలియజేస్తూ ఆయన కుమార్తె, సుప్రసిద్ద రచయిత్రి చాగంటి తులసి గారు చాసో గారు స్వహస్తాలతో వ్రాసిన ఆ కవిత వ్రాత ప్రతి ని “మధురవాణి” కి అందజేశారు. ఆ కవితని యథాతథంగా ఈ “ఉగాది -2016” సంచికలో ప్రచురిస్తున్నాం.
ఆ తరువాత నాలుగు దశాబ్దాలలో చాసో గారు ఎన్నో కథలు, కవితలు రాశారు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధనస్వామ్య వ్యవస్థ వీరి రచనలో ప్రధానంగా ఉన్నాయి. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలు గా పుస్తక రూపం లో చాసో కథా సంకలనం వెలువడింది. వామ పక్ష భావాలను కథలలో పలికించిన తొలి తెలుగు కథకుడి గా చాసో లబ్ధప్రతిష్టులు.
చాసో కథలలో వస్తువూ, శిల్పమూ పోటాపోటీగా సాగుతాయి. అది మధ్యతరగతి మనిషి ‘అస్ధిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాల’ కథ అయినా అట్టడుగు శ్రామికవర్గం ‘అగాధగాథా బాధాపాథ: పతంగాల’ కూడులేని లోకం కథ అయినా అందులో పాత్రలన్నీ రక్తమాంసాలతో, అభినయ విన్యాసంతో మనలని పలుకరిస్తాయి. ఉత్తేజితులను చేస్తాయి, మనలని తమతో పాటు తీసుకెళ్తాయి. తెలుగు కథాశిల్ప పికాసో చాసో. ఆయన రాసిన కథ 'కుంకుడాకు' లో కథానాయిక ‘గవిరి’ ఎనిమిదేళ్ళ బాలిక. 1943 ఫిబ్రవరిలో ఈమె పుట్టుక. ఒక కూలివాడి కూతురు. తల్లిదండ్రులు కూలికెడితే కర్రా, కంపా ఏరి ఇంటికి ఒకపూట వంట చెరకు తేవాల్సిన బాధ్యత ఆమె నెత్తిమీదుంది. అందుకే ఊళ్లోంచి పొలానికి బయల్దేరింది. వెంట మోతుబరి రైతు కూతురు పారమ్మ కూడా ఉంది. ‘‘ఊళ్ళో బడిపిల్లలు ప్రార్థన మొదలుపెట్టేరు. ‘తల్లీ నిన్ను దలంచి...’ అని మేష్టారందిస్తున్నారు. ‘తల్లీ నిన్ను దలంచి’ అని పిల్లలంతా ఒక్కమాటు వూరెగర గొడుతున్నారు.’’ ఆకులూ, కంపలూ ఏరుకుంటున్న ‘గవిరి’ని చెయ్యని నేరానికి భుక్తగారు పాంకోడు తీసి విసురుతాడు. అది గవిరి పిక్కమీద ఎముకకి తగిలి- ‘పీక తెగ్గోసిన కోడిలాగ గిలగిల కొట్టుకొని చుట్టుకుపోయింది’. ఏడ్చి ఏడ్చి కళ్ళు తెరిస్తే- పొద్దు లేచిపోవటం- బడిలో పిల్లలు ఎక్కాలు వల్లె వేయటం వినబడుతోంది. లేచి కళ్ళంలోని కుంకుడాకుని పోగుచేసి తట్టలోకి ఎత్తింది. ఎమికమీద పాంకోడు దెబ్బ బాధ ‘ఓలమ్మో’ అంటూ మర్లా ఉక్కిరి బిక్కిరిగా ఏడ్చుకుంటూ గోర్జిలోకి వెళ్ళింది. బడి పిల్లలింకా ఎక్కాలు చదువుతున్నారు. ‘పదహారార్లు తొంభైయారు’ అని ఒకరు అరుస్తున్నారు. ‘పదాహారార్లు తొంభైయారు’ అని అంతా కలిసి పాడుతున్నారు - కథ ముగిసింది. మనలని ఆ దృశ్యాలు వెంటాడతాయి. గోచీపాత పెట్టుకున్న ఎనిమిదేళ్ళ గవిరి రోషంతో, ఆత్మాభిమానంతో భుక్తకి చెప్పిన సమాధానం మనకు వినిపిస్తోంది. వ్యవస్థ వికృత స్వరూపం మనకు దృశ్యమానమౌతోంది. ఇంతకూ చాసో ఈ కథ ద్వారా ఏం చెబుతున్నారు? ఆయన ఏదీ వాచ్యంగా చెప్పరు! అదే చాసో కథా నిర్మాణంలో వైశిష్ట్యం!
కళాశాల విద్యార్థిగానే ఆయన కవితారచనకి శుభారంభం పలికారు. తొరుదత్, సరోజినీ నాయుడు ల కవిత్వం, లియో టాల్‌స్టాయ్, మాక్సిం గోర్కీ ల కళాత్మక వ్యక్తీకరణ, ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేశాయి. సృజనాత్మక ప్రక్రియలైన కథ, కవిత్వం, రెండింటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చినా తర్వాతి కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్యమిచ్చారు. అచ్చులో చాసో తొలికవిత : ‘ధర్మక్షేత్రము’ (భారతి : 1941 జూన్), తొలి కథ : చిన్నాజీ (భారతి: 1942). వర్తమాన సమాజంలో వైరుద్ధ్యాలు, ఆర్థిక సూత్రాలే మానవ సంబంధాలలో, మనిషి మనుగడలో కీలకపాత్ర నిర్వహిస్తాయనే సత్యాన్ని అలవోకగా ‘కాందిశీకుడు’ కవిత- రచనాకాలం: (1937-40) ఆవిష్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బర్మాపై జపాన్ బాంబు దాడులు జరిపాక, బర్మా నుండి అనేక తెలుగు కుటుంబాలు కట్టుబట్టలతో కాలినడకతో స్వగ్రామాలు చేరినప్పుడు ఇక్కడి దుర్భరస్థితిని ఒక తల్లి హృదయావేదనగా చాసో అక్షరీకరించారు. ‘నమ్ముకున్న పుడమితల్లి, కట్టుకున్న భార్య రెండూ అతడికి కాకుండా పోయాయని’, చివరికి ‘పొయి లో నిప్పులేదు, నీకేం పెట్టేది నా నాయనా’ అనే తల్లి విలాపం పఠితను కన్నీళ్ళు పెట్టిస్తుంది. ‘పదండి భడవల్లారా... నేనే దొంగ మార్కెట్‌లో అమ్ముకొని మేడలు కడుతున్నాను. నాకు ఉరిశిక్ష తక్కువ వెయ్యకండి... నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్యండి’ అంటూ బియ్యపుమూటని భుజాన కెత్తుకొని రైల్వే ఉద్యోగుల వెంట వెళ్తున్న ముసలమ్మ (కుక్కుటేశ్వరం), ‘తల్లి వెళ్ళిపోయింది... వెళ్ళిపోతూ తల్లి గుణాన్ని చూపించుకుంది’ అంటూ ఇంటి ఖర్చులకుగాను తన ఫిడేలు అమ్మి తనకి చీరకూడా తెచ్చిన భర్త వంక అనారోగ్యంతో బాధపడుతూ గుడ్లనిండా నీళ్ళు నింపుకుని చూస్తున్న రాజ్యమూ(వాయులీనం), ‘వెన్నెట్లో రేరాణి వాసనలా నీ మువ్వలమాటలు వింటాడే’ అంటూ పాడుతూ వచ్చే చిన్నాజీ (చిన్నాజీ)కొన్ని సజీవ పాత్రలు. చాసో కథల రెండో కూర్పు విశాలాంధ్ర ప్రచురణాలయం 1983లో ముద్రించింది. ఇందులో మొత్తం 40 కథలున్నాయి.
అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలి లో 1943లో జరిగాయి. ఆనాటి నుంచి చివరి వరకూ 2-1-1994న కన్నుమూసే వరకూ ఆయన ‘అరసం’లోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు. మరణానంతరం తన భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇమ్మని కోరటం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం.
చాసోగారి అర్ధాంగి అన్నపూర్ణమ్మ. చాసో ‘చిన్నాజీ’ కథలో చిన్నాజీ, చాసో పెద్ద కుమార్తె చాగంటి తులసి. 1995 నుంచి చాసో కుటుంబ సభ్యులు ‘చాసో స్ఫూర్తి’ పేరు ఒక ట్రస్ట్ నెలకొల్పి, ప్రతి ఏటా చాసో జన్మదినం జనవరి 17న సృజనాత్మక సాహిత్య వికాసానికి, నిబద్ధతతో కృషి చేస్తున్న అభ్యుదయ రచయితలలో ఒకరికి ‘చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం’ అందిస్తున్నారు. ఆధునిక తెలుగు కథను ప్రగతిశీల భావాలతో తీర్చిదిద్దటంలో ఆయనదొక ప్రత్యేకమైన బాణీ, ఒక ప్రత్యేకమైన వాణి!
(చాసో జీవిత విశేషాలు వికీ పీడియా సౌజన్యం తో)
*****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...