top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

కథా ​మధురాలు

కలహ భోజనం

సంక్రాంతి సంచిక 2016​

విజయశ్రీ మహాకాళి

వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళేమీ కాదు, అలాగని పెద్ద వాళ్ళూ కాదు. రోజూ పోట్లాడుకుంటారు. మళ్ళీ గంటలో కలుసుకుంటారు. మరో గంటలో మామూలు దంపతులైపోతారు. మళ్ళీ కొద్దిసేపటికే ఒకరి మీద ఒకరు విసుర్లు, పాటలు, వెక్కిరింతలు!! ఇలా తెల్లారా పొద్దూకా!! అయినా వాళ్ళకి విసుగనేది లేదు. విడిపోయి కలుసుకుంటారు. కలుసుకున్న కొద్ది సేపటికే విడిపోయి గిల్లికజ్జాలాడుకుంటారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఎవరి గదుల్లో వాళ్ళు గడిపినా, కంచానికీ - మంచానికీ మనిషి అలికిడి లేనిదే గడవదు వాళ్ళకి. ఎన్ని గొడవలు పడ్డా “కాస్త తోడొచ్చి కూర్చోవా” అంటూ ఒకరినొకరు బ్రతిమిలాడుకోవడం వాళ్ళ సంసారంలో ఒక చక్కని దృశ్యం.

****

ఆ రోజు చాలా ఆకలిగా వచ్చాడతను.

“ఇదిగో! నాకు రెండు నిమిషాల్లో వడ్డించు”.

“అలాగే, వస్తున్నా” అంటూ హడావిడిగా వచ్చి కంచంలో అన్నం కూడా వడ్డించింది.

“నెయ్యి కరిగిలేదే”? విసుగ్గా అన్నాడతను.

“అయ్యో! మరిచిపోయా” నెయ్యి కరిగి అతని కంచంలో కమ్మదనమైంది ఆమె మనసులాగా. మంచి నీళ్ళు పెట్టి అతడి పక్కనే కూర్చుందామె. ఆకలిగా నోట్లో కూరన్నం పెట్టుకుని “అబ్బ! ఈ కూరలో ఉప్పు తగలడలా… ఇక్కడ బి.పి నా కొడుకులెవారు?” ఆమె మంటగా చూసి “మీరే” అంది వత్తి పలుకుతూ.

“నేనెందుకవుతాను! నీ వంశంలో అందరికి బి.పి. వచ్చిందేమో ! నా వైపు అందరూ శుభ్రమైన వాళ్ళు” ఇంత గొంతుకతో అరిచాడతను.

“బి.పి ఉన్నది ఖాయంగా మీకే. మీ వంశంలో అందరూ రోజూ స్నానం చేస్తారని తెలిసాకనే మా వాళ్ళు సంబంధం ఖరారు చేసుకున్నారు”.

“నోర్మూసుకో! ఎప్పుడు జోక్స్ వెయ్యాలో తెల్సుకో”

“మన కాపురానికి అంత సీన్ లేదని నేనే చొరవ తీసుకుంటున్నాను. అయినా… ఆ ‘కళ’ అందరికి రాదు”

“అదో కళ కూడానా! అసలు ఉండాల్సిన కళ ఎవరి మొహంలోనూ లేదు మీ వైపు వాళ్ళకి”

“అబ్బో! మీ వైపు వాళ్ళకేం కళ ఉందో - తెల్లగా తెప్పోడుతూ విరిగిపోయిన పెరుగు మొహాలేసుకుని తిరుగుతుంటారు”

“ఇక ఆపు! నీ వైపు అందరూ నల్ల చింతపండు మొహాలతో దానికి మ్యాచ్ అయ్యే బుద్ధులతో కాకులల్లే ఉంటారు - ఛీ ఛీ...” విసుగ్గా లేచాడతను.

“నా పిల్లలకైతే నా బుద్ధులే వచ్చాయి ఆ దేవుడి దయవల్ల”!

“నీ పిల్లలని పిచ్చగా వాగకు. మన పిల్లలు” కచ్చగా అన్నాడతను.

“ఓకే! మన పిల్లలకి నా పోలికా బుద్ధులు వచ్చాయని ఒప్పుకోండి ప్లీజ్”

“ఏడ్సావులే”

“కాదు ‘నవ్వావులే!’ అనండి! ఎందుకంటే నేనెపుడూ ఏడుపు గొట్టు మొహంతో ఉండను కనుక!” ఆమెలో చురుక్కుమనిపించే వాస్తవాలు ఎక్కువ.

“మళ్ళీ మొదలెట్టుతున్నావా’? నీరసంగా అన్నాడతను. “ఇంతసేపు వాదిస్తావుగానీ నా కంచంలో తినడానికేమైనా ఉందో లేదో చూసావా?" అతడి గొంతులో అసహాయత ఆమెలో విసురుని తగ్గించింది.

"ఎందుకు చూడనూ... అయ్యగారు మెచ్చాలే గానీ కమ్మటి మీగడపెరుగుంది." పెరుగేస్తుంటే ఆమె స్త్రీ హృదయం మెత్తబడింది.

పాపం! కూరలో నిజంగా ఉప్పు సరిపోలేదేమో! అనవసరంగా గొడవ పడ్డాను అనుకుంటూ కాస్త కందిపచ్చడి అతడి కంచంలో వేస్తూ చిన్నగా నవ్వింది. అతడి మొహం చేటంతయ్యింది.

“మా ఆవిడ తలుచుకోవాలే గానీ నలభీములకి కూడా క్లాస్ పీకగల సమర్ధురాలు. ఎంతైనా టీచింగ్ లైన్ కదా!” కందిపచ్చడి నాలిక్కి రాసుకుంటూ తృప్తిగా త్రేన్చాడతను.

పెదవి విరుపులో విరులు రాల్చిందామె! కంచం తీసి కడుగుతూ అందామె “రాత్రికి గోంగూర పచ్చడి చేస్తాను - కందిపచ్చడితో కాంబినేషన్ బావుంటుంది. కాస్త వెన్న తీసి ఉంచాలెండి”… మెత్తని భావాలు ఆమెను మెల్లిగా మాట్లాడేలా చేశాయి.  

“ఉప్పు వేయడం మరచిపోకు ఏదో ఈ పూటకి పెరుగు తల్లి నన్ను ఆదుకుంది. కాస్త రాత్రన్నా కడుపునిండా తినాలిగా?” కవ్వించే వ్యవహారం మళ్ళీ మొదలైంది. ఆమె మౌనంగా చూసి వెళ్ళిపోయింది.

సాయంత్రం 6 గంటల వేళ అతను బైటికి వెడుతూ అడిగాడు “ఏమోయ్! నాలుగు గోంగూర కాడలూ, ఇంగువ పట్టుకొస్తా!”

ఆమె అతని వంక చాలా మామూలుగా చూసి వెళ్ళిపోయింది.

“ఇదిగో నీకే చెప్పేది ఏమిటా నిర్లక్ష్యం…”

“అలాంటిదేమీ లేదు, మీరు చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నా! కాకపోతే కాస్త పెరుగు తల్లిని కూడా తెచ్చుకోండి. ఎటుపోయి ఎటొచ్చినా కాస్త ఆధారమవుతుంది.”

“అదేమిటి? పచ్చడి చెయ్యవా?”

“ఏమో చెప్పలేను.”

“అదేమిటి? ఇందాకేగా చేస్తానన్నావు?”

“అప్పుడంటే చెయ్యాలని రూల్ ఏమీ లేదు. అయినా చెయ్యాలంటే కొంచెం ఖర్చవుద్ది...” మంటగా చూస్తూ అందామె.

“ఖర్చా? అదేంటి తల్లీ?”

“ఇవాల్టి గోంగూర పచ్చడికి పడబోయే శ్రమకి రేపు హోటల్ ప్రోగ్రాం ఉందంటేనే...”

ఆమె వాక్యం పూర్తవకుండానే అతనన్నాడు, “ఇందాకట్నించి చూస్తున్నా నీ వరస! అసలు నీ ఉద్దేశ్యమేమిటి?

నాకింత పిండాకూడూ పెడ్తావా లేదా? అనవసరంగా నాకు బి. పి పెంచకు.”

“ఆహా… మీ బి.పి. పెరుగుతుందా…” వెటకారంగా నవ్వుతూ చిన్నగా పాడింది “ఇంతటి శ్రీమతి ఎదురుగా ఉన్నా కిమ్మనరూ… కం… అనరూ..”

ఆమెనే మాత్రం అతడు రిసీవ్ చేసుకోకుండా “అసలీ పూట నీకు వంట చేసే ఉద్దేశ్యం ఉందా లేదా” అంటూ సీరియస్ గా అడిగాడు.

“అయ్యో... నా జీవిత లక్ష్యమే అదీ! పెళ్లయింది మొదలూ ... ఎప్పుడు చూసినా గోంగూరపచ్చడి, ముద్దపప్పు అనుకుంటూ ఓ చలిమిడి మొహం వేసుకుని వంటల మీద సెమినార్లు పెడతారు! అయినా మీక్కావలసింది ఇంటి మనిషి కాదు! వంట మనిషి!”

అతడు నిరాశగా చూసాడు. గోంగూర పచ్చడి నోరూరిస్తోంది.

అంతలో ఒక ఐడియా వచ్చింది. కొంచెం తమాయించుకుని "సరే! నిన్ను చూస్తే నాకు బి.పి. ఏం ఖర్మ? సమస్త వ్యాధులూ సోకుతున్నాయి. ఇప్పుడు ఫుల్ బి.పి. లో ఉన్నాను పద …" అంటూ ఆమె చెయ్యి పట్టుకు లాగాడు.

“ఛీ ఛీ … వెధవ గోంగూర పచ్చడి కోసం ఇంత సాహసం చేస్తారా?”

“అయ్యో! దీనికి సాహసమెందుకే? సహనం చాలు ... ఏం మెత్తని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ...” ఆమె చేతి మృదుత్వాన్ని పరిశీలిస్తూ పాడాడతను.

అంత కోపంలోనూ ఫక్కున నవ్విందామె ... వెన్నెలలో పారిజాతాలు రాలి పడినట్లు!! పాలలోంచి లక్ష్మీదేవి నవ్వినట్లు!!

"అయ్యా! ముసలి గబ్బర్ సింగ్ గారూ ... ఆకు కూరమ్మి ‘గోంగూర తోటకాడ కాపు కాశా’ అంటూ మిమ్మల్ని పిలుస్తోంది, వెళ్లిరండి. అన్నట్లు ఇంట్లో ఉప్పు నిండుకుంది …” అంటూనే లోపలికెళ్ళిందామె.

"అమ్మయ్య! నాకు గోంగూర పచ్చడి ప్రాప్తిరస్తు!" తన్ని తానే దీవించుకుంటూ బయలుదేరాడతను.

ఆ రోజు రాత్రి వంట కార్యక్రమం, భోజనాలు సాఫీగా సాగిపోడంతో ఆమెకి కొంత నిదానం వెసులుబాటు దొరికినాయి. ఎ.సి. ఆన్ చేసుకుని పల్చని చల్లదనం పరుచుకున్న గదిలో టి.వి. చూస్తూ పడుకుంది. ఆమె కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చే పాటని చూస్తూ నవ్వుకుంటూ టి.వి. వాల్యూమ్ పెంచింది.

"కొంత సౌండ్ తగ్గించు" అతను అంటూనే రిమోట్ తీసుకుని వాల్యూమ్ తగ్గించాడు.

"అయినా చిన్నపిల్లల్లే అలాంటి పాటలు బావుండడమేమిటో?"

ఆమె ఏమీ రియాక్ట్ అవకపోవడంతో మళ్ళీ అతనే అన్నాడు, "ఏమిటీ? అమ్మాయిగారు తీరిగ్గా టి.వి. చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు... బండి మంచి మూడ్ లో వుంది. పేపర్లవీ దిద్దక్కర్లేదేమిటి"? కనుబొమలెగరేస్తూ అడిగాడు...

ఆమె పాటని మిస్ అవడం ఇష్టం లేక జవాబివ్వలేదు. అతను లేచి ఏ.సి. ఆపేసాడు. పాట అయిపోగానే గదిలో చల్లదనం లేకపోవటం గమనించిన ఆమెలో చికాకు చోటుచేసుకుంది.

“ఇంతటి చల్లటి గాలి వస్తుంటే ఏ.సి. ఎందుకోయ్... ఫ్యానుగాలి సరిపోతుంది కదా!” ఫ్యాన్ స్పీడ్ పెంచుతూ అడిగాడతను.

"నాకు సరిపోదు" ముభావంగా జవాబిచ్చిందామె. కాలేజ్ మూడ్స్‌లోకెళ్ళి పాట వింటుంటే భర్త చేసిన చర్యలకి ఆమెకి మంటగా వుంది. అతడు మాత్రం కూల్ గా "ఇంత సేపు ఏ.సి. లో వున్నా ఇంత వేడిగా వుంటే ఎలా?"అన్నాడు. "ఎంతసేపూ అన్నం వేడిగా వుండాలి, సాంబారు చల్లగా వుండకూడదు అనుకుంటే ఎలా? అప్పుడప్పుడు మనుషులు కూడా వేడిగా వుండాలి!!”

“అయితే వేడిగా వున్నవన్నీ తినవచ్చన్నమాట!” అన్నాడతను చురుగ్గా చూస్తూ.

కోపంగా అందామె, "మరీ వేడెక్కువయితే నాలిక చుర్రుమంటుంది!"

"అబ్బబ్బ! ఇలా ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ ఏ.సి. లో కూర్చుని మాత్రం ఏం లాభం ... మనిషీ చల్లబడదూ... మనసూ.... అంతే" సాగదీసాడతను.

“అబ్బా! చల్లటి గాలిలో వున్న వాళ్ళు ఏం కూల్ గా వున్నారో ఇంతసేపు... గురువింద గింజ నలుపెరుగదనీ... సామెత.”

“అబ్బ... పోనీలే, ఏ.సి. వేసుకో. నాకు మాత్రం చలివేస్తుంది, ఏ.సి.లో దుప్పటి సహాయంతో పడుకుంటాలే", మళ్ళీ కవ్వింపు.

ఆమె పంతంగా ఏ.సి. ఆన్ చేసింది. అతడు కోపంలో కూడా మెరుస్తున్న ఆమెను చూస్తూ పడుకున్నాడు. ఆమె గెలిచిన గర్వంతో పడుకుంది. టి.వి. లో మళ్ళీ పాత పాట వస్తోంది "చలి చలిగా ఉందటే ఓ చక్కని దానా... చీరలు కావాలంటే నా చిక్కని దానా ..." ఫక్కున నవ్వాడతను. పెదవి వంపులో నవ్వుని దాచిందామె...

అది వారి జీవన పరిమళం... జీవిత రహస్యం.

*****

విజయశ్రీ మహాకాళి

విజయశ్రీ మహాకాళి 

డాక్టర్. విజయశ్రీ మహాకాళి గారు ఉస్మానియా యూనివర్సిటీ, సంస్కృతం డిపార్టుమెంటు ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. వీరివి వివిధ కధా సంపుటాలు, కవితా సంకలనాలు ప్రచురించబడ్డాయి.  వీటిలో సంస్కృత కరదీపిక, జగన్నాథపండితుని సంస్కృత సేవ, వైదికసాహిత్యానికి తెలుగువారి సేవ పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి.

Please keep your facebook logged in another browser tab or new browser window to post a comment in madhuravani.com website. 

bottom of page