MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
ఆహ్వాని త మధురాలు
శివాని
సత్యం మందపాటి
డెలివరీ గదిలోకి వెడుతున్నప్పుడు, భర్త చేయి పట్టుకుని “అంతా సవ్యంగానే అవుతుందంటారా?” అని అడిగింది కొంచెం గాబరాగా భవాని.
అదే ఇద్దరికీ మొదటి సంతానమేమో శివకి కూడా మనసు మనసులో లేదు.
అయినా ధైర్యంగా అన్నాడు, “మనకి మొదటి సంతానమేగానీ, ఈ హాస్పిటల్లో ప్రతిరోజూ ఎంతోమంది పిల్లల్ని కంటున్నారు. ఈ డాక్టర్లకి అది రోజూ చేసేదే. భయపడాల్సినదేమీ లేదు” అని.
భర్తవేపు గోముగా చూసింది భవాని, నర్సు ప్రసూతి గది తలుపు వేస్తుండగా.
శివ ఆ గది బయటే పచార్లు చేస్తూ, మధ్య మధ్య అక్కడ టీవీలో వస్తున్న వార్తలు చూస్తున్నాడు.
కాసేపటికి నర్సు బయటికి రాగానే, శివ ఆత్రుతగా ఆమె దగ్గరికి వెళ్లాడు.
అతన్ని చూడగానే నర్సు చిన్నగా నవ్వి, “నొప్పులు బాగా వస్తున్నాయి. ఆపరేషన్ అవసరం లేకుండానే కాన్పు అవుతుంది. ఇంకొక అరగంట. మీరు కొంచెం ఓపికపట్టండి. కాన్పు అవగానే పిలుస్తాను” అంది.
ఆ కాసేపూ శివకి ముళ్ళ మీద కూర్చున్నట్టుంది.
అందుకే మాటిమాటికీ లేచి, అటూ ఇటూ తెగ తిరిగేస్తున్నాడు.
దాదాపు ఒక గంట అయిందేమో, నర్సు బయటికి వచ్చి “కాన్పయింది. మగపిల్లవాడు. డాక్టర్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు” అంది.
భవాని నీరసంగా కళ్ళుమూసుకుని పడుకుని వుంది.
ఆమె వక్షస్థలం మీద పిల్లవాడు బోర్లా పడుకుని వున్నాడు.
శివని చూడగానే డాక్టర్ సుమ, “కాన్పు సులభంగా అయింది. తల్లి ఆరోగ్యం గురించి మీరు ఆదుర్దా పడనఖ్కరలేదు. కాని పిల్లవాడిని ఒక్కసారి చూడండి” అన్నది పసివాడిని తన చేతుల్లోకి తీసుకుని చూపిస్తూ.
అతని ఒళ్ళు ఎర్రగా వుంది. కానీ.. అతని ముక్కు... ఆ పసికందు ముక్కు చాల పొడుగ్గా వుంది. గడ్డం దాటి, దాదాపు మెడ మధ్య దాకా ఎంతో పొడుగ్గా వుంది. కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నాడు.
“అదేమిటి వాడి ముక్కు అంత పొడుగ్గా వుంది..” అన్నాడు శివ నెమ్మదిగా.
“అదే అర్ధం కావటం లేదు. ఇలాటి చిన్న చిన్న లోపాలు పుట్టుకతో రావటం సహజమే. కొన్ని, పిల్లలు పెరుగుతున్నప్పుడు అవే సర్దుకుంటాయి. కొన్ని, ఇతర డాక్టర్ల సహాయంతో సరిచేయవచ్చు. పీడియాట్రీషియన్ని, ఇయన్టీ స్పెషలిస్టునీ కూడా అందుకే రమ్మని కబురు చేశాం. కాసేపట్లో వస్తారు.వాళ్ళు రాగానే పరీక్ష చేశాక చూద్దాం, తర్వాత ఏం చేయాలో” అంది డాక్టర్ సుమ.
“పిల్లవాడికేం ఫరవాలేదు కదా” అడిగింది భవాని.
“పిల్లవాడి ఆరోగ్యం ఇతరత్రా బాగానే వుంది. స్పెషలిస్టుల పరీక్షలు కానివ్వండి. అప్పుడు చూద్దాం తర్వాత ఏం చేయాలో..” అని శివతో అంది, “ఇవన్నీ అయేటప్పటికి సాయంత్రమవుతుంది.. మీరిక్కడ వుండి చేసేదేమీ లేదు. మీ పనులు చూసుకుని రండి. నేనిక్కడే వుంటాను”
ఒక పది నిమిషాలు భవాని పక్కనే కూర్చుని, అప్పుడు వెళ్లాడు శివ.
అప్పుడే భవాని అంది, “పిల్లవాడికి ఫరావాలేదంటారా.. ఎంత బాగున్నాడో పసి వెధవ” అంది పిల్లవాడిని ముద్దుపెట్టుకుంటూ.
పసివాడి చేయి నిమురుతూ, “చక్కగా వున్నాడు. పెరిగిన కొద్దీ మామూలుగా అవుతాడు అన్నది కదా డాక్టర్. అంతా ఆ పరమేశ్వరుడి దయ. ఏమవుతుందో చూద్దాం. మనం డాక్టర్లం కాదు కదా!” అన్నాడు శివ.
“నీకెలా వుంది” అడిగాడు శివ.
భవాని చిన్నగా నవ్వి, “నాకేం, బాగానే వున్నాను” అంది.
౦ ౦ ౦
వాళ్ళు చెప్పినదానికన్నా ముందే ఆసుపత్రికి వచ్చాడు శివ.
“పిల్లవాడిని వేరే గదిలోకి తీసుకువెళ్ళి ఏవేవో పరీక్షలు చేసి, ఇప్పుడే తీసుకువచ్చారు ఇక్కడికి. అలసి పోయినట్టున్నాడు, బాగా నిద్ర పోతున్నాడు” అంది భవాని బాబుని దగ్గరకు తీసుకుంటూ.
“డాక్టర్లు ఏమయినా చెప్పారా?” అడిగాడు.
“మీరు రాగానే పక్కనే వున్న డాక్టర్ సుమగారి ఆఫీసు గదికి రమ్మన్నారు”
శివ వెంటనే అక్కడికి వెళ్లాడు. ఒకళ్ళు కాదు అక్కడ నలుగురు డాక్టర్లు వున్నారు.
డాక్టర్ “రండి. ఇప్పుడే అన్ని టెస్టులూ పూర్తిచేశారు. దాని గురించే మాట్లాడుకుంటుంన్నాం” అంది.
“పిల్లవాడికి ఏమీ ప్రమాదం లేదు కదా.. అసలు ఎందుకిలా జరిగింది” అడిగాడు శివ ఆత్రుతగా.
“పిల్లవాడి ఆరోగ్యానికేం ప్రమాదం లేదు. ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తున్నాయి. ఊపిరి బాగా పీలుస్తున్నాడు. రక్తంలో ఆక్సిజన్ లెవల్ 98 శాతం వుంది. ఇది కండరాలు అనవరంగా పెరగటం వల్ల తప్ప వేరే ఏమీ కాదు. ప్లాస్టిక్ సర్జరీ చేసి తీసివేయవచ్చు. ఇప్పుడు, ఇంత పసి వయసులో, అలాటి ఆపరేషన్ చేయటం మంచిది కాదు. కొన్ని నెలలు ఆగి ఆ ఆపరేషన్ చేసి సరిచేద్దాం. వేరే సమస్యలు ఏమీ వస్తాయో తెలియదు కనుక, మరీ చాలా రోజులు ఆగటం మంచిది కాదనిపిస్తున్నది. నెల నెలా ఊపిరి తిత్తులు ఎలా పని చేస్తున్నాయో, రక్తంలో ఆక్సిజన్ లెవల్ ఎంత వుందో పరీక్ష చేసి, మనం అప్రమత్తంగా వుందాం” అంది డాక్టర్ సుమ.
అంతకన్నా తను చేయగలిగింది కూడా ఏమీ లేదు కనుక, యాంత్రికంగా తల వూపాడు శివ. మనసులో
తనకి ఇష్టదైవమైన ఈశ్వరుడికి, అంతా సవ్యంగా జరిగితే శ్రీశైలం వస్తానని మొక్కుకుని, దణ్ణం పెట్టుకున్నాడు.
డాక్టర్ సుమ చెప్పిందంతా తూచా తప్పకుండా భవానికి చెప్పాడు.
“ప్రాణ భయం లేదన్నారు కదా, అదే చాలు. కొన్ని నెలలు ఆగి ఆపరేషన్ చేయిద్దాం” అంది భవాని.
“ముఖ్యమైన మనవాళ్ళు తప్ప అందరూ వాడిని అలా చూడటం నాకు ఇష్టం లేదు. సాధ్యమైనంత వరకూ గుప్తంగా వుంచి, ఆ ఆపరేషన్ ఏదో అయాకనే అందరికీ చూపిద్దాం” అన్నాడు శివ.
౦ ౦ ౦
కానీ అలా జరగలేదు. దానికి కారణం శివకు కావలసిన మిత్రుడు రాఘవ.
ఆసుపత్రి నించీ ఇంటికి వచ్చిన మర్నాడే వచ్చి పిల్లవాడిని చూశాడు రాఘవ.
“శివా! నువ్వు, భవానీ అదృష్టవంతులు. సాక్షాత్తూ వినాయకుడే మీ ఇంట మళ్ళీ పుట్టాడు. కాదు కాదు మీ ఇంట వెలిశాడు. మీరిద్దరూ శివ భక్తులు. మీ పేర్లు కూడా శివుడూ, భవానీ. పార్వతి కడుపున మళ్ళీ పుట్టాడు వినాయకుడు” అన్నాడు.
పిల్లవాడికి చేతులెత్తి నమస్కారం పెట్టాడు రాఘవ.
శివ అతన్ని ఆశ్చర్యంగా చూశాడు.
’తనకింత వరకూ ఆ ఆలోచనే రాలేదు సుమా’ అనుకున్నాడు.
భవాని రాఘవ తమాషా చేస్తున్నాడని ముందు అనుకుంది. అతని ముఖం చూశాక అతను నిజంగానే అంటున్నాడని అర్ధం చేసుకుంది. కొంచెం కోపం కూడా వచ్చింది.
తమాయించుకుని “ఇది పుట్టుకలో వచ్చిన లోపం. బర్త్ డిఫెక్ట్ అంటారే, అది. అపరేషనుతో సులభంగా సరిచేయవచ్చు అన్నది డాక్టర్. అంతేకానీ దేవుడూ కాదు, దయ్యమూ కాదు” అన్నది.
“మీరు నిజాన్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. బర్త్ డిఫెక్ట్ అయితే చేతికి ఆరు వేళ్లో, గుడ్డి, కుంటి వాడిలా పుట్టటమో... ఇలాటివి చూశాం కానీ అచ్చం వినాయకుడిలా ఎలా పుడతాడు? ఇది ఎంతో అసాధారణ విషయం. ఎవడో డాక్టర్ ఏదో చెప్పాడని, మీ అదృష్టాన్ని కాలదన్నుకుంటారా?” అన్నాడు రాఘవ కోపంగా.
భవాని జవాబు చెప్పకుండా కళ్ళు మూసుకుంది. ఆమె ముఖం కోపంతో బాగా ఎర్రగా వుంది.
‘మా అమ్మా నాన్నా బ్రతికి వుంటే, ఇతన్ని ఇంటిలో నించి బయటికి పంపించి వుండేవారు’ అనుకుంది.
౦ ౦ ౦
మర్నాడు మధ్యాహ్నం భవాని పిల్లవాడిని సోఫాలో దుప్పటివేసి పడుకోబెట్టి, పక్కనే కూర్చుని ఏదో జోల పాట పాడుతుంటే, తలుపు చప్పుడు అయింది
భవానీకి సహాయం చేయటానికి వచ్చి అక్కడే వున్న ఆమె ప్రియ స్నేహితురాలు శ్యామల, కిటికీలో నించీ బయటికి చూసి ఆశ్చర్యపోతూ, “బయట చాలామంది వున్నారు. వాళ్ళల్లో కొంతమంది చేతుల్లో కెమెరాలు కూడా వున్నాయి. టీవీ వాళ్లేమో.. నేను తలుపు తీయను” అంది.
భవాని ఆశ్చర్యపోతూ “అదేమిటి? రాఘవ అప్పుడే ఈ విషయం అందరికీ చెప్పేశాడా.. “ అన్నది.
ఆమెకి ఏదో భయం కూడా వేసింది.
“మంచి పని చేశావు. తలుపు తీయకు. లోపల గడియ కూడా సరిగ్గా పెట్టినట్టు లేదు. వేసేయి” అన్నది
శ్యామలతో.
ఇంతలోనే ముందు గది తెలుపు తెరుచుకుంది. ముందుగా శివ, అతని వెనుకనే రాఘవ వచ్చారు.
వాళ్ళ వెనకాలే ఎలా వచ్చారో కానీ, ఇద్దరు ముగ్గురు ఫోటోగ్రాఫర్లు, కెమేరాలతో టీవీ వాళ్ళూ తోసుకుంటూ లోపలికి వచ్చారు. అది చూసి శివ గబగబా వెళ్ళి వాళ్ళని బయటికి పంపించి తలుపు వేశాడు. వాళ్ళు వారిస్తున్నా, వెళ్ళమని మొండికేస్తున్నా శివ వూరుకోలేదు. బలంగా అందర్నీ నెట్టేసి తలుపు వేశాడు.
ఈలోగానే భవాని ఏది వద్దనుకున్నదో అదే జరిగింది. పేపరు వాళ్ళు చకచకా ఫోటోలు తీసుకున్నారు, టీవీ వాళ్ళు ఆ పసివాడిని తమ కెమెరాలలో బంధించారు.
“వాళ్ళని చూసి కూడా మీరు తలుపు ఎందుకు తెరిచారు?” శివతో కోపంగా అంది భవాని.
“ఎంతసేపని బయట నుంచోమంటావు? చివరికి వాళ్ళని తోసుకుంటూ రావలసి వచ్చింది. నాతోపాటే వాళ్ళు ఇలా వస్తారనుకోలేదు” అన్నాడు శివ.
రాఘవ దగ్గరికి రాగానే పసివాడికి నమస్కారం పెట్టాడు.
అతనితో పాటే శివ కూడా నమస్కారం చేస్తుంటే భవాని ఒక్కసారిగా బిత్తరపోయింది.
“అదేమిటి.. “ అంది తత్తరపాటుతో.
ఆమె గొంతు నూతిలో నించీ వస్తున్నట్టుంది.
“ఏమో.. పిల్లవాడిని చూడగానే వినాయకుడిని చూసినట్టు అనిపించింది..” అన్నాడు శివ తను చేసిన పని అసంకల్పితంగా జరిగిందే అని చెప్పకనే చెబుతూ.
౦ ౦ ౦
తర్వాత కథ అనుకోనంత వేగంగా నడిచింది.
రెండు మూడు గంటల్లో టీవీలో – ఇప్పుడే అందిన వార్త, ప్రత్యేక ప్రకటన, బ్రేకింగ్ న్యూస్ లాటి మకుటాలతో – వినాయకుడు మళ్ళీ పుట్టాడు అనే వార్త ఆ వూరిలోనే కాక, ఎన్నో రకాలుగా మార్పులు చెంది, దేశంలో దశదిశలా చకచకా వ్యాపించింది.
ముఖపుస్తకంలోనూ, ట్విట్టర్లోనూ, ఇతర సోషల్ మీడియాలోనూ ఫోటోలు. ఎవరికీ తోచినట్ట వాళ్ళు వ్రాసిన వార్తలు. కొంతమంది ఫోటోల్లో ఆ పసివాడిని చుట్టూ రంగురంగుల పూలతో అలంకరించి, అటూ ఇటూ దీపాలు కూడా వెలిగించి మరీ ఫోటోలు పెట్టారు.
భవాని ఇవన్నీ చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది.
శ్యామల దగ్గరే వుండి, ఆమె ముఖం మీద నీళ్ళు చల్లి, ఒక గ్లాసెడు మజ్జిగ తనే నెమ్మదిగా ఆమె నోటికి అందించింది.
౦ ౦ ౦
“నా తప్పేం లేదు. మీడియా వాళ్ళు ఇంతగా దిగజారతారని నేను అనుకోలేదు” అన్నాడు శివ భవానీతో.
“స్వంత కొడుకుకి మీరే దేవుడని దణ్ణం పెడుతుంటే, పరాయివాళ్ళు అలా అనుకోవటంలో ఆశ్చర్యం ఏముంది?” అన్నది భవాని కోపంగా.
“ఏమో.. వాడిని చూస్తుంటే నా ఇష్ట దైవం వినాయకుడే కనిపిస్తున్నాడు” అన్నాడు శివ.
శ్యామల నచ్చచెప్పింది శివకి. “వాడు ఇంకా కళ్ళు తెరవని పసివాడు. మీకు వాడిని చూస్తే ఏమనిపించినా, అది మీతోనే వుంచుకోండి. ఎక్కడా పైకి అనకండి. మీరే ఆ మాట అంటే, ఈ గుడ్డి జనం విర్రవీగి పోతారు. ఇంట్లో తాళాలు వేసుకుని వుండండి కొన్నాళ్ళు. బయటికి వెళ్ళినా జాగ్రత్తగా, రహస్యంగా వెళ్ళి వస్తే సరి. నేను వచ్చినప్పుడు కూడా, ఎవరూ చూడకుండా తలుపు దగ్గరికి వచ్చాక సెల్ ఫోన్లో పిలుస్తాను. కొన్నాళ్ళు ఆగితే ఇదే చల్లారిపోతుంది” అంది.
శివ శ్యామల వేపు చూశాడు.
అతని ముఖంలో ఏ భావాలూ కనపడలేదు భవానీకి.
౦ ౦ ౦
మూడు రోజుల తర్వాత బజారులో కలిసినప్పుడు, “నాకెందుకో వాడిని చూస్తే వినాయకుడే కనిపిస్తున్నాడు. కళ్ళు మూసుకున్నా కూడా నన్ను చూసి దీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది” శివ అన్నాడు రాఘవతో.
“అంటే అర్ధం ఏమిటి? తనెవరో తనే నీకు చెబుతున్నాడు భగవంతుడు. ముందే చెప్పానుగా నీ అంత అదృష్టవంతుడు లేడని. దేవుడు మీ ఇంట్లో ఇలా వెలిసి రావటం మామూలు విషయం కాదు” అన్నాడు రాఘవ.
“మరి డాక్టర్లు చెప్పటం.. “ నసిగాడు శివ.
“శాస్త్రజ్ఞులకి అందుబాటులో లేని, వారి పరిజ్ఞానానికి అందని విషయం ఇది. నమ్మకంతో మతపరంగా ఇలాటి వాటిని చూడాలే కానీ, ఎందుకిలా జరిగిందనే ప్రశ్నలతో కాదు. అలా ప్రశ్నిస్తే దేవుడి వునికినే ప్రశ్నించినట్టు కదూ!” అన్నాడు రాఘవ.
“అయితే మరి ఏం చేద్దాం?” అన్నాడు శివ తన ఆలోచనలు పరిపరి విధాలుగా పోతుంటే.
“ఏం చేస్తావ్? ఆమాత్రం తెలీదా.. నీ స్వార్ధంతో వినాయకుడిని ఇంట్లో దాచుకోకు. పదిమందికీ దర్శనం చేయించి, నీ పుణ్య ఫలాన్ని అందరితో పంచుకో.. నీకు తర్వాత ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పుడతారు. కానీ దేవుడు మాత్రం మళ్ళీ పుట్టడు. ఆలోచించు..” అన్నాడు రాఘవ.
“ఆ పసికూనలో ఎంత వినాయకుడు కనిపించినా వాడు నా కొడుకు. వాడిని అలా బజారు పాలు చేయటం మంచిది కాదేమో అనిపిస్తున్నది” అన్నాడు శివ.
గొంతు తగ్గించి నెమ్మదిగా అన్నాడు రాఘవ. “బజారు పాలు చేయటం ఎలా అవుతుంది? రావలసిన పబ్లిసిటీ ఎలాగూ వచ్చేసింది. మీ ఇంటి ముందు చూశావా, ఎంతమంది జనం వున్నారో! వాళ్లకి దైవ దర్శనం కావాలి. పళ్ళు, పూలే కాకుండా, వాళ్ళ చేతుల్లో డబ్బులూ వున్నాయి. నగలూ వున్నాయి. ఆరు నెలల్లో నువ్వు ఉద్యోగం మానేయవచ్చు. నీ దశ తిరిగిపోతుంది. ప్రజల్లో ఇంతకుముందెన్నడూ లేని మూర్ఘత్వం ఈ రోజుల్లో వుంది. చూస్తున్నావుగా, ప్రతి వూర్లోనూ బాబాలు, స్వాములార్లు. ఒక్కొక్కడికీ ఎయిర్ కండిషన్డ్ ఆశ్రమాలు! ”
“అంటే పసివాడిని చూపించి వ్యాపారం చేయమంటావా? నేనలాటి పనులు చేయను” అన్నాడు శివ అదిరిపడి.
నవ్వాడు రాఘవ. ”నాలాటి వాడు అలా వ్యాపారం చేద్దామనుకున్నా ఎవరూ నమ్మి ముందుకు రారు. నీకు అలా కాదు. వాళ్ళే ఇంటికి వచ్చి, తలుపులు బాదుతున్నారు. అదృష్టం అంటే అదే! ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి అని తెలుగులో ఒక సామెత వుంది. ఆలోచించుకో!” అన్నాడు.
౦ ౦ ౦
రెండు రోజుల తర్వాత శ్యామల, ఆ శనివారం సాయంత్రం, భవాని ఇంటికి వచ్చింది. ఆమెతో పాటూ పక్కనే శ్యామల అన్నయ్య భాస్కర్ వున్నాడు.
శ్యామల భాస్కర్ని, భవానికీ శివకీ పరిచయం చేసింది. “మా అన్నయ్య. పేరుపొందిన సైకాలజిస్టు. చెన్నైయూనివర్సిటీలో ప్రొఫెసర్. బయట కౌన్సెలింగ్ కూడా చేస్తున్నాడు. నన్ను చూసిపోదామని ఇవాళ ప్రొద్దున్నే వచ్చాడు. నేనెలాగూ వస్తున్నాను కదా అని నాతో తీసుకు వచ్చాను” అంది.
“నైస్ టు మీట్ యు బోత్!” అన్నాడు భాస్కర్.
“కూర్చోండి. మా దగ్గరి బంధువుల్లో ఎవరూ ఇక్కడ లేకపోవటం వల్ల, శ్యామల రోజూ వచ్చి నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నది. నాకు చెల్లెలు లేని లోటు తీరుస్తున్నది” అన్నది భవాని.
“అవును. శ్యామల మొదటినించీ అంతే. నాకు పేరుకి చెల్లెలే కానీ, అప్పుడప్పుడూ మా అమ్మలా కనిపిస్తుంటుంది” అన్నాడు భాస్కర్ నవ్వుతూ.
శివ కూడా నవ్వి “అవును. శ్యామల స్నేహానికి ప్రాణం పెడుతుంది” అన్నాడు.
“అన్నయ్యకి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం” అంటూ శ్యామల పసివాడిని భాస్కరుకి అందిస్తే, భాస్కర్ అతన్ని చేతుల్లోకి తీసుకుని ఆడిస్తున్నాడు. పసివాడి పొడుగాటి ముక్కు అతనికి కొత్తగా వున్నట్టు లేదు.
“అన్నయ్యకి జరిగినదంతా చెప్పాను. సర్జరీ అయేదాకా ఎవ్వరికీ చెప్పడు లెండి” అంది శ్యామల నవ్వుతూ.
భవాని లోపలికి వెళ్ళి, ఏవో తినుబండారాలు తెచ్చి అక్కడ బల్ల మీద పెట్టింది.
భాస్కర్ ఎంతో కలుపుగోలుగా మాట్లాడుతుంటే, శివకి కొంచెం ధైర్యం వచ్చి, “మిమ్మల్ని ఒక్కమాట అడుగుతాను. ఏమీ అనుకోరు కదా?’ అన్నాడు.
భాస్కర్ నవ్వి “అనుకోవటమెందుకు... అడగండి” అన్నాడు.
“మా అబ్బాయిని చూస్తే మీకేమనిపిస్తున్నది?” అడిగాడు శివ నెమ్మదిగా.
భాస్కర్ నవ్వి, “ఏముంది అనిపించటానికి.. చక్కగా ఎర్రగా, బొద్దుగా వున్నాడు. ఆరోగ్యం చాల బావుందని డాక్టర్లు చెప్పారని శ్యామల చెప్పింది. మీ ఇద్దరి పోలికలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడాను ...” అన్నాడు.
శివ సాలోచనగా అన్నాడు, “అదికాదు. అంత పొడుగు ముక్కు .. వినాయకుడి తొండంలా లేదూ..”
భాస్కర్ అన్నాడు. “ఇది పుట్టుకతో వచ్చిన శారీరక అస్వభావికమైన లోపం. డాక్టర్లు దీనివల్ల, ఆరోగ్య దృష్ట్యా ఏమీ లోపం లేదనీ, ఇది పూర్తిగా బయటకు కనిపించే శారీరక లోపమేననీ అంటున్నారుట కదా. నాకూ అలాగే అనిపిస్తున్నది. ప్లాస్టిక్ సర్జరీ చేసి సరి చేయటం ఈరోజుల్లో చాల సులభమే కాక, పిల్లవాడికి ఏమీ ప్రమాదం లేకుండా చేయవచ్చు. ప్లాస్టిక్ సర్జరీలో ఎన్నో కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి. ఏమాత్రం భయపడనవసరం లేదు. కానీ, పిల్లవాడు ఇంకా పసికందు కనుక కొన్నాళ్ళు ఆగి, డాక్టర్లు ఎప్పుడు చేస్తే బాగుంటుంది అంటే అప్పుడే చేయించండి” అన్నాడు భాస్కర్.
శివ నెమ్మదిగా అన్నాడు, “నాకు వాడిని చూసినప్పుడల్లా, నా ఇష్ట దైవం వినాయకుడు కనిపిస్తాడు..”
భవాని అంది, “మా ఆయన రోజూ కొడుకుకి దణ్ణాలు కూడా పెడుతున్నాడు”
భవాని మాటల్లో హాస్యం కానీ, వెటకారం కానీ లేదు. కోపం వుంది.
భాస్కర్ ఒక్కసారి గొంతు సర్దుకుని అన్నాడు. “నా అనుభవంలో ఇలాటి కేసులు కొన్ని వచ్చాయి. దీన్ని మా సైకాలజీ పరిభాషలో “Delusion Thinking” అంటారు. అంటే అది ఒక భ్రాంతిలో పడి, దాని గురించే ఆలోచిస్తూ, చివరికి అదే నిజమనుకోవటం. దీనిలోనే “Religious Delusion” అని కూడా ఒక రుగ్మత వుంది. ఇది ఒక మానసిక రుగ్మత. నాటకాల్లోనో, సినిమాల్లోనో ఇరవై ముఫై సార్లు, రాముడిగానో కృష్ణుడిగానో నటించిన నటుడు, తానే కారణజన్ముడిగా మనిషి రూపం దాల్చాడని మనసా, వాచా నమ్మటం కూడా ఇలాటి రుగ్మతే. మీరు సప్తపది అనే తెలుగు సినిమా చూసేవుంటారు. గుడిలో ప్రోద్దుటినించీ, రాత్రి దాకా అమ్మవారి సేవలో గడిపే పూజారికి, కొత్త భార్య అమ్మవారిలా నృత్యం చేయటం చూసినప్పటినించీ, భార్య కూడా అమ్మవారిలా కనిపిస్తుంది. ఆమెకి నమస్కారం చేస్తాడే కానీ, ఆమెని తాకలేడు. ఇదీ అలాటిదే. ఈ మానసిక రుగ్మత అన్ని మతాల్లోనూ వుంది. ఇప్పుడు మతం పేరుతో జరుగుతున్న చాల ఉగ్రవాద చర్యలకు కూడా, ఇది చాల వరకూ అన్వయిస్తుంది. దీనిని ముదరక ముందే సరిచేయటం చాల సులభమైన పని. కాకపొతే ఈ రుగ్మత వున్నవారు, సైకాలజిస్టులతో ఎంతో సహకరించ వలసి వస్తుంది...”
“దొంగ బాబాలు. దొంగ సన్యాసులు కూడా ఇలాటి వారేనా..” అడిగింది శ్యామల.
“అక్కడా ఇక్కడా చాల కొద్దిమంది నిజమైన వారు వుండవచ్చు. కానీ వారిలో ఎక్కువమంది డబ్బుకోసం వేషాలు వేసే మోసగాళ్ళు. వాళ్ళని, అలాటి వారిని నమ్మేవాళ్ళకి వదిలేద్దాం” అన్నాడు భాస్కర్ నవ్వుతూ.
అది విని భవాని శివతో అంది. “ఆ రాఘవని ఇక మనింటి ఛాయలకు రానీయకండి. అతన్ని చూస్తే, మన వాడి పేరుతో వ్యాపారం చేసే బాపతులా వున్నాడు. అతనికీ, దొంగ బాబాలకీ, దోపిడీ స్వాములకీ ఏమిటి తేడా? మీరు కూడా అతనిలాగానే ఆలోచిస్తుంటే, నాకు మీరూ అఖ్కర్లేదు. నేను తొమ్మిది నెలలు మోసి కన్న, నా పిల్లవాడు చాలు నాకు. డాక్టర్ల సహాయంతో వాడే మామూలుగా అవుతాడు. ఒకవేళ అలా జరగక పోయినా, నాకే ఇబ్బందీ లేదు. ముక్కు పోడుగయినా, కాలు సొట్టయినా, అందహీనుడైనా .. నేను కన్న నా బిడ్డ నా బిడ్డే. వాడి మీద ఎవరు చేతులు వేసినా వాళ్ళ కాళ్ళు విరగకొడతాను” ఆమెలో కోపం తెలుస్తూనే వుంది.
ఆ మాతృప్రేమనీ, కన్నబిడ్డ మీద ఆరాటాన్ని మనసారా చూస్తున్న శ్యామలకు, ఆమె అనురాగానికి భవానీని అమ్మగారిలా చూడాలో, ఆ కోపానికి అమ్మవారిలా చూడాలో అర్ధం కాలేదు.
భవానీ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, మృదువుగా నొక్కింది.
శివ తలవంచుకున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడని తెలుస్తూనే వుంది.
రెండు నిమిషాలు ఆగి, శివతో భాస్కర్ అన్నాడు, “పిల్లవాడికేమీ ఫరవాలేదు. ఇతరుల మాటల వల్ల, మీకు అలాటి భావన వచ్చినట్టుంది కానీ, సహజంగా కాదు అనిపిస్తుంది నాకు. కనుక మనిద్దరం కొన్నిసార్లు మాట్లాడుకుంటే, కథ సుఖాంతం అవుతుంది. ఏమంటారు?” అడిగాడు భాస్కర్.
భవాని శివ ముఖంలోకి ఆత్రుతగా చూస్తున్నది.
సరేనని తల వూపాడు శివ, కొడుకుని చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతూ!
*****
సత్యం మందపాటి
తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయ పురంలో పుట్టి గుంటూరులో పెరిగిన సత్యం మందపాటి గారు కాకినాడ, విశాఖపట్నం లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టభద్రులు. త్రివేండ్రం లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పదేళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ నాటి యువ, జ్యోతి ల నుండి ఈ నాటి రచన, ఆంధ్రభూమి, నవ్య, చతుర, కౌముది, సుజన రంజని మొదలైన అనేక పత్రికలలో ఐదు దశాబ్దాలుగా 200 కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు, పత్రికలో దీర్ఘకాలిక శీర్షికలు రచించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో కథలు రచించిన కథకుడు సత్యం గారే. ఆయన రచనలు ఇంచుమించు అన్ని తెలుగు పత్రికలలోనూ ప్రచురించబడి అనేక పురస్కారాలని అందుకున్నారు. కథా సంపుటులు, నవలలు, కవితా సంపుటి వెరసి 10 పైగా గ్రంధాలు ప్రచురించారు. గేయ రచయితగా ఆయన రచించి ప్రదర్శించిన సంగీత రూపకం “వేయి వసంతాలు” సాలూరి వాసూ రావు సంగీత దర్శకత్వంలో ఎస్.పి. బాలూ, శైలజ ఆలపించారు. 1998 నుంచి ఆరు నెలలకొకసారి టెక్సస్ లోని అనేక నగరాలలో టెక్సస్ సాహిత్య సదస్సుల నిర్వహణ లో కీలక పాత్ర వహిస్తున్నారు. పిల్లల కోసం తెలుగు బడి, భాషాప్రియులకోసం నెల వారీ ఆస్టిన్ సాహిత్య సమావేశాలూ నిర్వహిస్తున్న సత్యం మందపాటి గారు సతీమణి విమల గారితో నాలుగు దశాబ్దాలుగా ఆస్టిన్ నగర నివాసి.
*****