కవితా వాణి
కవితా వాణి
నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు
పచ్చని పసుపుకొమ్ము లాంటి అమ్మ తనువు పూర్ణ కుంభంలా...
నిండుగా...తృప్తిగా కళకళ్లాడుతోంది…
ఆమె కన్నుల్లో కోటి ఆశలు
కొత్తగా తొంగి చూస్తున్నాయి…
పవిత్రమైన ఆ హస్తాలు అందమైన దుస్తులల్లుతున్నాయి
పాంచజన్య శంఖం లాంటి ఆ కంఠం,
చిన్ని చిన్ని లాలిపాటలు
మధురంగా ఆలపిస్తోంది…
రాబోయే కమ్మని కాలానికి, మదిలో
మమతల పునాది వేసి,
మురిపెంగా ముడులు వేస్తూ
అందమైన సౌధాలు నిర్మిస్తోంది…
బంగరు ఊహల ఉయ్యాలలూపుతూ
నట్టింట్లో అపరంజిని జోకొడుతోంది…
పెరుగుతున్న పేగుబంధానికి
ఊసులుచెపుతూ ఊపిరి పోస్తోంది…
ఆనందం, అలసట అన్నీ త్యాగం చేసి,
సుతిమెత్తని పూల పొత్తిళ్ళు
సిధ్ధం చేస్తోంది…
గుడిలాంటి ఒడిలో బాలసార పేరంటమని,
అక్షరమాలతో నామ జపం చేస్తోంది…
ఆ వాత్సల్య వారిధిలో
మునకలేయాలని,
ఆ సుందర వదనం ముద్దాడాలని,
అమృతకలశాల్లాంటి ఆ గుండెలపై ఆడుకోవాలని
ఆమె గర్భంలో నేనూ తపిస్తున్నాను…
ఆమె జపమో....నా తపమో....
ఆ రోజు , నిజంగా ఆ రోజు....
.....నెలలు నిండి వాకిట్లో
నిలిచింది
అంతలోనే.....!
ఆమె ఆశలగూళ్ళు నేల కూలాయి
లాలిపాటలు గాలిలో గిరికీలు కొట్టాయి
వెండిగిన్నెలో వెన్నముద్దల్ని
విధి....విషంగా మార్చింది…
చేతులు అమృత హస్తాలంటారే..అమ్మవి మాత్రమే కాబోలు..
కాని..! కొందరి చేతలు విషపూరితాలైనాయి…
అరిచాను....ఆగమన్నాను....వేడుకున్నాను...
నా మూగ గొంతు అమ్మ ఏడుపులో కలసిపోయింది…
..ఎవరో...ఏం చేసారో అమ్మకెలా తెలుపను?
నా బెంగంతా అమ్మ గురించే......
కేర్ మనే లోపే ...భోరుమని ఏడ్చాను
కనురెప్ప విడకుండానే కాలం తీరిపోతోంది...
గండిపడిన అమ్మ కళ్ళ గోదారి వరద హోరులో...
కలిసిపోయి......కొట్టుకుపోయి......
కాని...!!.ఆశ్చర్యం...!!
పాపంటే...ఇష్టంలేని నాన్న…
అయ్యో...పాప....మని విలపిస్తుంటే...నా చిన్ని గుండె విస్తుపోయింది...!!
****
భారతంబునందు పరమాత్ము పదసాక్షి
'రైలు’లో ప్రయాణమాలకింప
కరము చెడ్డ రోత కలిగించుచుండెను
అతిశయంబు గాదు, "అమ్మ తోడు"!
వేళ పాళ లేక వెర్రి గొంతుకలతో
ఆమ్లేటు, వడ, యిడ్లి యనెడువారు
కాఫి, టీ యంచును గావుకేకల తోడ
తలనొప్పి 'పుట్టించ’ గలుగువారు
కులుకుల నడలతో 'కొజ్జా'ల బృందాలు
వెరిపింతయును లేక తిరుగువారు
'బూటు పాలిషు’ వాండ్రు, పోకిరి వెధవలు
వెకిలి చేష్టల మదపిచ్చివారు
కుంటి, గుడ్డివారు - కొట్లాడు వారును
కూర్మి సుతకు చన్ను గుడుపువారు
ఆకలియును మరచి ‘పేకాట’ తోడనే
బ్రతుకు ఘనుల నేను రైళ్ళ గంటి !
బిచ్చగాండ్ల బెడద - పిన్న పెద్దలదైన
'సెల్లు ఫోన్ల’ ధ్వనుల చెడ్డ గొడవ!
సుంతనైన గూడ, శుచియు శుభ్రత లేని
పాత డొక్కు రైళ్ళె భారతాన!
చుక్క నీరు రా(లే)ని సొగసు పంపులు కొన్ని
ధార తోడ వృధగ పారు కొన్ని
'కష్ట కష్ట’ తుదకు- గడియలు లేనట్టి
రైళ్ళ 'బాతురూము’లవ్వి గంటి!
రైలు బండిలోన రాత్రి ప్రయాణము
బ్రతుకు పైన ఆశ వదలుటయ్యె
దొంగలు నడిరాత్రి - దోచుట ఖాయమ్ము
లాగ, 'చైను’ బండి ఆగదాయె!
****

వయసు.. పారుతున్న నదీ ప్రవాహం
సముద్రంలో లీనమయ్యే దిశలో ప్రయాణం!
పండుతున్న దేహంలో..
మనసు పండించుకోవాల్సిన సంధ్యాసమయం!
స్థితి మారుతున్న జీవితంలో
గతి మారుతున్న మనసుకు
ప్రతికూల ప్రతిధ్వనులు!
నాడు కని పెంచిన బంధాలు
వలసలతో ఖాళీ అయిన పక్షి గూళ్ళు!
సుదీర్ఘ సంసార యానంలో
ఎన్నో కష్టాల కౌగిళ్లు
అనుకోని మార్పులకు సాక్ష్యాలు!
నిత్య నూతనంగా నిలువని ఇల్లులాంటి శరీరం
ఆత్మకు నిలయమైనా.. ఎప్పుడో ఒకప్పుడు
కాలంతో పాటు కూలే కళేబరం!
వివాహ బంధం
ఇద్దరి నడుమ అగుపడని ఒప్పందం!
ఏడడుగులు వేసిన నాటి నుండి
మరో ఏడు పదులు కలిసి నడవాలి
యుక్త వయసులో శరీరాలు సహకరించినట్లే
వృద్ధాప్యంలో మనసులు సహకరించాలి
‘ఎమోషనల్ యునిఫికేషన్ టిల్ ద ఎండ్!’
ముద్దులు లేకున్నా.. అవే ముచ్చట్లు
సరసం తగ్గినా.. అదే ఆనందం
ఊపిరి బరువైనా.. ప్రాణానికి ప్రాణం
నెమ్మదించినా.. తగ్గని సమర్థతతో
ఇరువురి స్వేచ్చకు, వ్యక్తిగతానికి గౌరవంతో
అలవాట్లలో, ఆలోచనల్లో మార్పుతో
సృజనాత్మక జీవితం ‘యయాతి చందం’!
****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...
click here to post your comments...
కం. : బిగువు జటలు గట్టిన నీ
సిగ పట్టును యేల సడలజేసితివయ్యా
యుగములు ఇరుకుననుండిన
పగతో భువినంత ముంచె భాగీరథిదే
కం. : ప్రళయముతో ముంచెత్తుచు
కలవరపెట్టేను గంగ కైలాసపతీ
తలపై బరువైనా నీ
తలపుననే దాచుకోక తగునే విడగన్
కం.: అడుగంగా శ్రీనాథుడు
విడిచితివొక గంగధార వినతిని దీర్చన్ పడలేమిక ఈ బాధలు
విడువక నీ జటలయందె బిగియించవయా
కం.: వాడల పరుగుల యాటలు
ఆడేందుకు లేక శిక్షయనుకోకుండా
మేడలపైనుండిననూ
ఓడలతో ఆడుచుండిరుత్సాహమునన్
కం.: గూడుసమసి వీధినపడి
మాడిన కడుపులు కనంగ మనసుకరుగగన్
కూడలిలో విద్వాంసులు
పాడమమృతవర్షిణియని బలికరితీర్పున్
****

1. మీన మేషపు లెక్క
పక్క నెట్టోయ్ చక్క
పనుల కొచ్చును రెక్క
ఓ జాబిలమ్మ
2. విత్తు మొలిచిన తీరు
పోరి గెలిచిన వారు
చరిత మరుగుకు పోరు
ఓ జాబిలమ్మ
3. చిన్న తనంపు హాయి
చదువు సందెల పోయి
మనసులాయెను రాయి
ఓ జాబిలమ్మ
4. గెలుపు నెరుగని చరిత
పిలుపు నోచని భవిత
కలుపు! ముదుసలి మమత
ఓ జాబిలమ్మ
5. చేతి ‘ఫోన్లో’ జగం
మమత లాయెను సగం
మనిషి ఆయెను మృగం
ఓ జాబిలమ్మ
6. మనసు చీకటి బాపు
వెలుగు దారులు చూపు
కాలమొచ్చును రేపు
ఓ జాబిలమ్మ
7. పాడి పంటల సిరులు
పడుగు పేకల విరులు
పల్లెనొదిలిన ఝరులు
ఓ జాబిలమ్మ
8. ఆకు ఆకుకు పెట్టు
మంచు పూవుల బొట్టు
కరిగి, నేలను తట్టు
ఓ జాబిలమ్మ
9. గుడికి లోపల వారు
గుడికి బయటన వీరు
బిచ్చమొకటే తీరు
ఓ జాబిలమ్మ
****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...
click here to post your comments...
ప్రపంచీకరణం పెనుముప్పై పోతోంది
విషసంస్కృతి వాడ వాడలా వ్యాపిస్తోంది
నిద్రాహారాలు లేకుండా
దూరదర్శనులు దుర్బోధ చేస్తున్నాయి…
అంతర్జాలం అంగాంగ ప్రదర్శన చేస్తున్నది…
చేతిలో చరవాణి పచ్చిశృంగారాన్ని ఒలకబోస్తోంది
''భ్రమర కీటక న్యాయంలో"
ఆబాల గోపాలం కీటకాలై పోతున్నారు
ఇక నడతలో నాణ్యత ఎక్కడుంటుంది
అరాచకాలు అక్రమాలు అన్యాయాలు
అబద్ధాలు అశ్లీలాలు అసాంఘికాలు
వీటి చెప్పు చేతల్లో నడత నాట్యం చేస్తోంది
ఆ!... అందుకే...!..!...!
పట్ట పగలు కలువలు వికసిస్తున్నాయి
చక్రవాకాలు కనువిందు చేస్తున్నాయి
పడక గదుల గోడలు బద్దలుకొట్టుకొని
అందాలు ఆరు బయటకు వస్తున్నాయి
ఎన్నాళీ బంధనాలు
ఎన్నాళీ బానిసబ్రతుకులని
లోదుస్తులు పై దుస్తులను తరిమేశాయి
"రవిగాననిచో కవి గాంచు నెయ్యెడన్"
అంటూ వెనకటికన్నాడో కవి
ఇప్పుడు బజారు జనులందరూ చూస్తున్నారు
వయసొచ్చిన పిల్లలు ఇంట్లో తిరుగుతున్నా
పట్టపగలు పడక గదుల తలుపులు మూసుకుంటున్నాయి
ఇంక విలాసాల మత్తులో కళాశాల పిల్లలు
చాటింగ్ డేటింగ్ క్లబ్బులు పబ్బులు
ఇదే నేటి తరం రేపటి తరం నడత…
లంచాలను మంచాలను ఆశించేవారే అందరూ
ఇదే అదునుగా
కల్మష చిత్తులు కల్తీలు చేస్తున్నారు
కల్తీ లేనిది కలియగంలో లేదు
అబద్ధాలు ఆశువుగా వస్తున్నాయి
చిన్న పిల్లల్లో సైతం...
ఇది ఈ తరం నడత...
****

నీవులేని జగము…
~దొరవేటి చెన్నయ్య
సీll సంయమీంద్రులలోన చక్కగా గలవన్న,
వారణాసి శపింప వ్యాసుదలచె;
చక్రవర్తులలోన చాలగా గలవన్న,
ఖండించెను ఋషిని కార్తవీర్యు;
శ్రీరామచంద్రుని చిత్తాన గలవన్న,
అంబుధిపైననే అలిగెనతడు;
శివునిలోనైన సుస్థిరముగా గలవన్న,
మరుని దహించెను మారహరుడు...
తేII స్త్రీల, పురుషులలోలేవు; శిశువులందు
పశువులందునయిన లేవు; పండితులను
పామరులలోనలేవు; ప్రపంచమందు
సహనమా! ఎక్కడున్నావు? జాడదెలుపు
శాII చెన్నొందన్ గనిపింతువే సతిపతీచిత్తమ్ములందెప్పుడో,అన్నల్ దమ్ములయందు కొన్నియెడలన్ అందంబుగానుందు, వా
సన్న స్నేహితులందు చాలగను యెంచక్కంగ గన్పించుచున్
యున్నట్లుందువుగాని ఓ సహనమా! ఉన్నావొ లేవో కలిన్!
సీII పసిపిల్లలను కాస్త పరికించి చూడగా
ఏడ్పు కత్తితొ నిన్ను యేరివేతు
రమ్మనాన్నలలోన నవలోకనము సేయ
చెంపదెబ్బతొ నిన్ను చెరిపివేతు
రధ్యాపకుల తీరునధ్యయన మొనర్చ
శిక్షతో నిన్నుహింసింపవత్తు
రధికారగణము నందాలోచనము జేయ
చూపుతోనే నిన్ను మాపివేతు
తేII రంతరింపగ జేసెదరంత నిన్ను
ఎపుడు, యెచటను, యేరీతి నెవరిలోను
ఉండనీయక తరిమెదరుర్విలోన
సహనమా నీవు లేకున్న శాంతి గలదె?
సీII శ్రేష్ఠమైన తపస్సు చేయువారైనను
నీ దయలేకున్న నిలువలేరు!
వేయిరీతుల పూజ సేయువారైనను
నీ కరుణయెలేక నిలువలేరు!
స్థిరచిత్తమున సేవ జేయువారైనను
నీ చూపుదగులక నిలువలేరు!
పట్టుదలతొ నెంత పని చేయువారైన
నీవు గానకయున్న నిలువలేరు!
తేII ముక్తిసాధనకును నీవె ముఖ్యశక్తి
కార్యసాధనకును నీవె ధైర్యశక్తి
విజయసాధనకును నీవె విజితశక్తి
సహనమా నీవు లేకున్ననిహము సున్న!
సీII ఆగజాలరు బస్సు అగపడువరకైన
‘ఆటో’లకు బతుకులంకితమ్ము
మౌనమూన రెదటి మాట ముగియుదాక
తగవులపార్థాల దగులు మిగుల
నిలువజాలరు కార్యములు ముగిసెడిదాక
ఫలితములన్ని నిష్ఫలమునీయు
ఉండజాలరు అన్నముమగీలు దాకైన
రుచుల భేదమున పౌరుషములెసగు
తేII అత్తకోడళ్ళకే గాదు ఆలుమగల
మధ్యనైననులేదు సయోధ్య యెపుడు
నీవులేనందు వలననే నేటి జగము
సంకుచితమాయె సహనమా! సరిగ నిలువు!
ఆII ఇంటిలోన మంట, కంటిలోనను మంట,
వీధిలోన పోరు విరివియగుట,
తీవ్రవాదమవని తీండ్రించుచుండుట
సహనమ! నువు లేక శాంతి సున్న!
****
అనాదిగా యుగాది భూరి పాడి ప౦టలి౦ట
భేరి మోదియై వినోది యై ప్రమోదితా మహోన్నతై
ప్రవీణ మాధురీణియై కళా౦జలై, ఫలా౦జలై
విరి౦చి విశ్వ సు౦దరై, ఫలి౦చు స్వప్న మ౦జరై
మహా సుధాత్రి సోయగాలలోన తూలి తృళ్ళి మళ్ళి
కు౦దనాది చ౦దనాది బ౦ధనారవి౦దమై
తుర౦గమై, తర౦గమై, ప్రజా మనోవికాసమై,
నిర౦తమై, అన౦తమై, ఫలి౦చు స్వప్న మీ
యుగాది భర్జరీ పునాది, దీన దుర్భలీ విరోధి,
చిగురు సు౦దరీ వినోది, శగల ప౦జరీ నిరోధి
జీవ హి౦సి జీవి హారి, ధీర జనుల చిత్త చోరి,
మావి చిగురు మత్తు లహరి, భావి జీవితా కుబేరి.
పుత్తడి మడి, మత్తుల జడి, గుత్తుల సుడి,
విత్తపు నుడి, చిత్తము హరి, హత్తెరి, గమ్మత్తుల గడి
పట్టి మిన్ను ముట్టి, యీ యుగాది పల్లకెక్కి,
మ౦డుటె౦డ లె౦డ బట్టి, చుట్టుప్రక్కలన్ని చుట్టి, చూడ
గడిని చేత బట్టెనే, యుగాది భారతి
శా౦త కనులతోటి నిల్చెనె ప్రభాత ప్రకృతై
మ్రొక్కి యి౦టి లోకి బిల్వరే, యిచ్చి హారతి
****
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...
click here to post your comments...
