
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
జనవరి-మార్చి 2023 సంచిక
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
వ్యాస మధురాలు
అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 9
జుట్టుపీకుడు రుగ్మత

చింతపల్లి గిరిజా శంకర్
"ఒక ఫలానా జబ్బుకి ఏదో కొత్త మందు వచ్చిందిటకదా మార్కెట్ లోకి, నీకేమయినా తెలుసా?" అని నన్ను అడిగాడు నాతో పనిచేసే సైకోలజిస్ట్.
"తెలుసు" నా సమాధానం.
"అయితే మా చెల్లి ఆర్జెంటీనాలో ఉంటుంది, విజిట్ కి వచ్చింది టెక్సాస్. రేపు చూడగలవా? మళ్ళీ తను రెండు వారాల్లో వెళ్ళిపోతుంది?"
"తప్పకుండా" అని నా సెక్రటరీ కి ఫోన్ చేసి మర్నాడు 9 గంటలకి అప్పాయింట్మెంట్ ఇచ్చాను.
మర్నాడు సరీగ్గా 9 గంటలకి వచ్చింది. దేవలోకం నించి దిగి వచ్చిన దేవత లాగా ఉన్నది. ఆమె అందం చెప్పడానికి వీల్లేదు. నా ఫ్రెండ్ చెప్పిన జబ్బుకి ఈమెకీ అసలు సంబంధం కనబళ్ళేదు. పొరపాటున ఇంకెవరయినా వచ్చారేమోనని నేను కంగారు పడటం చూసి, నవ్వుతూ, "డాక్టర్. నేనే. మీ ఫ్రెండ్ సిస్టర్ ని. భయపడకండి." అని చెప్పి మొదలు పెట్టింది "వస్త్రాపహరణం"
మొట్టమొదట అందమయిన జుట్టుని పట్టి ఉంచిన రబ్బర్ బ్యాండ్. ఆ తరువాత సన్నటి వంకీలు గల అందమయిన జుట్టుని టపుక్కున తీసేసింది. అది విగ్. తీసేస్తే బోడి గుండు. తిరుపతి క్షవరం చేసినట్టుంది. నా ఆశ్చర్యాన్ని చూసి మందహాసం చేస్తూ నెమ్మదిగా కనుబొమలు పీకేసింది. తరవాత కనురెప్పలు పీకేసి టేబుల్ మీద పెట్టి చిరునవ్వుతో, "ఇప్పుడర్థమయిందా, నా జబ్బు?" అన్నది.
తేరుకోవటానికి నాకు కొంచెం టయిం పట్టింది. Beauty is just make up deep అని ఎందుకంటారో అనుభూతిలోకొచ్చింది నాకు అకస్మాత్తుగా. మన చీరెల షాపుల్లో చీరెలు కట్టి షో కేస్ లో పెట్టే బోడిగుండు బొమ్మ మేనిక్వీన్ లాగా కనబడింది.
ఆమె తిరుపతి ఎందుకు వెళ్ళిందా అని మీరు ఆశ్చర్యపడకండి. ఆర్జెంటీనా లో వెంకటేశ్వరస్వామి గుడీ లేదు. మరి ఏమిటీ విపరీతం? ఆ జబ్బు పేరు Trichotillomania. అది గ్రీక్ నించి దిగుమతి అయిన మాట. Tricho అంటే జుట్టు; Tillo అంటే పీకడం; mania అంటే మానసిక జబ్బు. అంటే మన భాషలో దీన్ని "జుట్టుపీకుడు రుగ్మత" అని తర్జుమా చేయొచ్చు.
ఈ జబ్బుగలవాళ్ళు, 1. ఏదో ఒక చోటినుండి జుట్టు పీక్కుంటారు. 2. కొంతమంది చాలా చోట్లనించి కొంచెం కొంచెం పీక్కుంటారు. 3. ఒక్క తలనీలాలే కాదండోయ్ కొంతమంది మిగిలిన చోట్లనించి గూడా పీకుతారు. 4.మానవ శరీరంలో ఎక్కడ జుట్టు ఉన్నా దాన్ని పీకగల సమర్థులున్నారు.
5. కొంతమంది ఒకసారి ఒకచోట మరోసారి మరోచోట జుట్టు పీకుతారు. 6. చాలామంది చదువుకునేటప్పుడు, ఏదన్నా పరీక్ష రాస్తున్నప్పుడూ చేతి వేళ్ళతో తలవెంట్రుకల్ని తిప్పుతూ ఆడుకుంటారు.
ఇంతకీ దీనికి కారణాలేమిటి? దీన్ని సైకియాట్రీ లో Impulse control disorder, obsessive compulsive disorder అనే గ్రూప్ లో జతపరచారు. స్థూలంగా ఈ జబ్బు లక్షణాలేమిటంటే, 1. ఏదో పని చేస్తున్నప్పుడో, ఆలోచిస్తున్నప్పుడో, ఒకరకమయిన anxiety[కంగారు, ఆందోళన] వస్తుంది. అది పోవాలంటే ఇట్లాంటి చర్య ఏదయినా చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఎవరయినా [ముఖ్యంగా తలిదండ్రులు] బలవంతంగా ఈ చర్యని అరికట్టడమో, లేదా పనిష్మెంట్ ఇవ్వడమో చేస్తే జబ్బు ఇంకా ఎక్కువ బాధిస్తుంది.
భారత దేశం లో ఈ జబ్బు ఎంతగా వుందో చెప్పడం కష్టం. చాలామంది బయట చెప్పరు. తరవాత మన ఆచారాల్లో కొంత మాయమయిపోతుంది. ఉదా: తిరుపతి, సిమ్హాచలం, శ్రీశైలం వగైరా పుణ్యక్షేత్రాలు సవాలక్షల చోట తలనీలాలు సమర్పిస్తారుగదా! మళ్ళీ జుట్టు పూర్తిగా రావటానికి కొన్నాళ్ళు పడుతుంది. ఆ సమయంలో వాళ్ళు జబ్బుని మర్చిపోవచ్చు. లేదా ఇంకో ప్రక్రియ ద్వారా ఆందోళన ఉపశమనాన్ని పొందుతారేమో?
Western society లో దీని prevalence 2 శాతందాకా ఉంటుందని అంచనా. సరిగ్గానో ఇదమిద్దంగానో ఇదని చెప్పడం కష్టం ఇక్కడ గూడా. ఎంచేతంటే, చాలామంది ఈ జబ్బుని బయట పెట్టరు. పైగా మేకప్ వాడటం artificial hair, lashes, nails వాడటం చలామణీ అవుతుంది గాబట్టి. ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందని చెబుతారు. వాళ్ళల్లో stress ఎక్కువ వున్న కాలంలో [ఉదా; బహిష్టు సమయం] ఉధృతంగా లక్షణాలుంటాయి.
ఇదే కోవకి చెందిన కొన్ని జబ్బులు, గోళ్ళు కొరుక్కోవడం, చొక్కా బొత్తం తో ఆడుకోవడం ఇత్యాదివి గూడా ఈ కోవలోకే వస్తాయి.
ఇంతకీ ఆ మందు పేరు చెప్పనేలేదు నేను. దాని పేరు "Anafranil" ఆ మందు వచ్చిన కొత్తల్లో పేరు మారుమోగింది గానీ తరువాత కాలంలో అది అంత గొప్ప విచిత్రమేమీకాదన్నారు. prozac అనే మందుగూడా ఈ జబ్బుకి పనిచేస్తుంది. అంతే కాకుండా Counseling గూడా అవసరం.
**
నన్ను చూసిన ఆ "దేవత" కొన్నాళ్ళు మందు వేసుకుంది. కొంత నయమయిందని నాకు కబురు చేసింది.
**
Triskadekaphobia అంటే తెలుసా 13 నంబర్ అంటే భయం. ముఖ్యంగా western society లో. మనదేశంలో గూడా 'తీన్ , తేరహ్ , ఆఠ్, అఠారా " అని విన్నారు గదా.అంటే అవి కొన్ని పనులకి మంచి రోజులు కావని కొందరి నమ్మకం. ఉదాహరణకి, "అష్టమినాడు ఎవరయినా పెళ్ళిచేసుకుంటారా?" అంటుంది సూర్యకాంతం "పెళ్ళి చేసి చూడు" సినిమాలో.
ఇల్లాంటి phobiaలు దాదాపు 50 దాకా ఉన్నాయి Claustrophobia అందరికీ తెలిసిందే . ఇలాటిదే Hoarding Disorder నాకు తెలిసిన ఒక పేషంట్ దగ్గర 50 సంవత్సరాల newspapers ఉన్నాయి. అన్నీ తేదీవారీగా, సంవత్సరవారీగా కట్టలు కట్టి garage లో స్థాపించాడు. దానికోసం extend చేయించాడు. కారు బయట పెట్టుకుంటాడు. వాడేగనక ఈ పేపర్లు భారతదేశంలో అమ్మితే లక్షలొస్తాయి. ఇదిగూడా obsessive compulsive disorder కిందే వస్తాయి.
****