top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

అమ్మ తప్పిపోయింది

Janaki Sarma

జానకి శాస్త్రి

యింకా తెలతెలవారుతుండగానే పడవలాంటి కారు ఆ వీధిలోకి వచ్చింది

.

యింటి ముందు ముగ్గులుపెడుతున్న ఆమ్మాయిలు, ముగ్గుబుట్టలు అక్కడే పడేసి యింటిలోకిపోయి తలుపులు ఓరగా వేసేసీ, తలుపుల మధ్య నుంచీ తొంగితొంగీ వీధిలోకి చూస్తున్నారు.

పొలాలకి బయలుదేరిన రైతులు అక్కడే నడి వీధిమద్యనే ఆగిపోయీ, కొందరు వింతగా మరి కొందరు భయం, భయంగా ఆ కారువేపు చూస్తూ కొయ్యగట్టి నిలబడిపోయారు. అపుడు తెల్ల యూనిఫారం వేసుకొన్నఒకతను తలుపు తెరిచీ పట్టుకొంటే ఎంతో ఠీవిగా కారులోంచి దిగాడు ఆయన.

“వూరికే భయపడకండిరా. మన అమ్మగారి పిల్లోడే, అదే మనూరి అబ్బాయిబాబు వచ్చాడురా,” అంటూ ఒక ముదుసలి కర్ర కొట్టుకుంటూ ఆ కారు దగ్గరికీ చేరాడు.

“ఒరేయ్ అబ్బాయి బాబూ, అమ్మగారిని కూడా తెచ్చావా. ఆ మహాతల్లిని చూసీ అర్దపుష్కరం అయిపోయినాది బాబూ. ఆ మహాతల్లిని చూడానికే ఈ ముసలి ప్రాణం పోకుండా పాకులాడుతోంది,” అన్నాడు జలజలా జారుతున్న కన్నీళ్లని భుజంమీద తుండుగుడ్డతో తుడుచుకొంటూ.

 

 ఆ పెద్దమనిషి , అదే ఆ అబ్బాయిబాబు  ఏమీ జవాబుచెప్పలేదు. కారువేపు చూడగానే నలుగురు పోలీసులు లాటీలూ, తుపాకులూ పట్టుకొని దిగీ అతని ఎదురుగా నిలుచున్నారు.

“వెళ్లండి, ప్రతీ గడపా చూడండి. వీళ్లంతా కలసీ మా అమ్మని బొంబాయి నుంచీ ఎత్తుకొచ్చేసారు. అన్ని యిళ్లూ, పూరిగుడిసేలూ, పొలాల్లోకూడా వెతకండి. ఎలాగైనా సరే నా అమ్మ నాకు కావాలి. కావలసివస్తే కర్రలు వుపయోగించండి, తుపాకులు వద్దు. ఈ వూళ్లో వాళ్లెవ్వరైనా నా వలన చచ్చిపోతే నా అమ్మ నన్ను క్షమించదు.  యిది మా అమ్మ ఊరు.”

 యింతలో జారిపోతున్న పంచేని ఒక చేత్తో పట్టుకొనీ పరుగెట్టుకొంటూ వచ్చాడు రఘు.

“అయ్యగారూ, అమ్మ, మా అమ్మమ్మకి, కాదుకాదు మీ అమ్మగారికి ఏమయిందండీ. అమ్మగారిని వెతకడానికి యిక్కడకెందుకొచ్చారూ. అమ్మని మీరే మీతోనే తీసుకెళ్లారుకదా.”

“ఆపరా బడిపంతులూ, నీ తర్కాలూ నాదగ్గర పని చేయవురా.”

“అయ్యగారూ, మీరేమంటున్నరో తెలియడంలేదు.”

“వుండురా భ్రష్టుడా. మొదట వీడి యిళ్లు వెతకండీ. యింటి వెనకాల ధాన్యపు కొట్టును బాగా గాలించండీ. వీడే నా అమ్మని ఎత్తుకొచ్చేసాడు. ఏరా? నా యింటికే ఎసరుపెడతావురా. వుండు నీ వుద్యోగం పీకించేస్తాను, నీకు నీ తమ్ముడికీ తాగడానికి నీళ్ళు కూడా వుండవురా. నే తలుచుకొంటే, నీ వునికినే  లేకుండా చేసేస్తానురా. నాతోనా నీ ఆటలూ. మొదట నా అమ్మని ఎక్కడదాచేవో నిజంచెప్పు, లేకపోతో నువ్వూ నీ పిల్లలూ తిండిలేక మలమలమాడి పోతారురా. నా సంగతేమిటో నీకు తెలియదురా. మంచీవాళ్లతో మంచిగా వుంటానురా, నీ లాంటి దొంగలని ఏంచేస్తానో నువ్వు కలలోకూడా వూహించలేవురా.” కొపంతో వూగిపోయాడు ఆ పెద్దమనిషి.

రఘు అయ్యగారి మాటలువింటూ నిలువుగుడ్లేసికొనీ , కన్నీళ్లి కారుస్తూ నిలబడిపోయాడు.

“అబ్బాయిబాబూ, ఏటా మాటలూ, పంతులుబాబునే ఎరగరా. అమ్మగారు యీడెందుకొస్తారూ. అమ్మగారు వస్తే, మాకుతెల్యదా,” అ పెద్దాయన  నచ్చచెప్పబోయాడు.

“వూరుకోరా ముసలోడా, నాకే పాఠాలు చెపుతావా. మీరందరూ కలిసీ మాఅమ్మని ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే  ఈవూరినే నాశనం చేసేస్తాను.” కోపంతో వూగిపోతూ తన కారుని  కాళ్లతో తన్నాడు. మళ్లా కారుని పట్టుకొనీ వూపేసాడు.

“బాబూ కారు పడిపోతాది. అలా వూపకండి. సూడండి కారు ఎలా సొట్టపోయిందో.”

“కారే కాదురా ముసలోడా, నువ్వు నోరుమూసుకోపోతే నీ నోరుకూడా సొట్టపోతుంది.” ఆ ముదుసలి కర్రకొట్టుకొండూ దూరంగా పోయీ ఒక చెట్టుక్రింద నిలబట్టాడు. యీడు మన అబ్బాయిబాబు కాడు అంటూ తనలో తనే గొణుకొన్నాడు.

అప్పటికే వూరువూరంతా అక్కడికి చేరుకొనీ వింతగా అక్కడ జరుగుతున్న చోద్యాన్ని చూస్తూ నిలబడ్డారు. ఆ నలుగురు పోలీసులూ వూరంతా తిరగీ వుత్తిచేతులతో తిరిగి వచ్చారు.

“సార్, మేడమ్ ఎక్కడా లేరు. అన్నిచోట్లా వెతికాం. అటకలూ, గోదామలూ అన్ని చోట్లా వెతికాం. మా ఛాంపియన్ ఎక్కడున్నా వెతకగలడు సార్.”

“యూజ్లెస్ ఫెలోస్. మా అమ్మని వెదకండీ లేకపోతే యిప్పుడే మీ అందరినీ పనిలోంచి తీసేస్తాను. గెట్లాస్ట్.”

 ఆ నలుగురు పోలీసులు సెల్యూటుకొట్టీ , వాళ్ల కుక్క ఛాంపియన్ను తీసుకొనీ నడుచుకొంటూ వెళ్లిపోయారు.

ఊరు వూరంతా ఆబ్బాయిబాబు చుట్టూ నిలుచొని జాలిగా చూస్తూంటే అబ్బాయి బాబు నేలమీద, ఆ మట్టినేలమీదే చతికిలబడీ రెండుచేతులతో మొఖాన్ని కప్పుకొనీ వలవలా ఏడ్పస్తూంటే అందరూ వింతగా చూస్తూ నిలబడ్డారు. అప్పుడు రఘు ముందరకొచ్చీ ఆయన్నిలేపి నిలబెట్టీ ఆతని బట్టలకి అంటుకొన్న మురకిని తన గావంచాతో దులిపీ, రెండుచేతులూ పట్టుకొనీ వలవలా ఏడ్చాడు.

“అయ్యగారూ, మా తప్పయిపోయినాది. మా వూళ్లో మీకు తగు సహాయంకూడా చేయలేకపోయాము. మా వూరంతా మట్టి రోడ్లే. యింట్లోకి పదండి మీ బట్టలు వుతికీ ఆరేసి శుభ్ర పరుస్తాను. అంతవరకూ లోపలికి వచ్చీ విశ్రాంతి తీసుకోండి అయ్యగారూ.”

“ఆపరా బడిపంతులూ, నీ వేషాలు నా దగ్గిరా. కల్లబొల్లి మాటలుచెప్పీ ఈ వూరివాళ్లని నమ్మించగలవు, కానీ నేను నీమామనురా. నా అమ్మని నాకు అప్పచెప్పూ, లేకపోతో నీ వుద్యోగం పీకించేస్తానురా. నీ తమ్ముడి పొలాన్ని పంటకుకాకుండా చేస్తానురా. ఈ యిల్లుకూడా  మా అమ్మదిరా. ఎదో దయతలచి యిన్నాళ్లూ మిమ్మల్ని వుండనిచ్చానురా. రేపే యిది అమ్మేసీ నీకు నిలువనీడ లేకుండా చేస్తానురా బడి పంతులూ.  నా సంగతేమిటో నీకు తెలియకుండా వుంది. నాతో పెట్టుకోకు. మర్యాదగా ఆఖరిసారిగా అడుగుతున్నాను. నా అమ్మని ఎక్కడ దాచావురా చెప్పు. లేపోతే ఒక్క ఫోను కొడుతేచాలు నిన్ను జైల్లో పెట్టాడానికి.” కోపంతో పెట్రేగిపోతూంటే ఆ వూరి పెద్దలు కలుగజోసుకొన్నారు.

“అబ్బాయిబాబూ అసలు అమ్మగారు ఎలాగ తప్పిపోయింది, ఎక్కడ తప్పిపోయింది బాబూ?”

“వూరికే ఆమెని కష్టపెట్టారా ఏంటి?”

“ఏమో ఏదో వృధ్దాశ్రమంలో పడేసాడేమో ఎవరికి తెలుసూ,” ఒక యువకుడు అందరికీ వినపడట్టుగానే అన్నాడు.

“అసలు యీయన యిళ్లు అమ్ముకొందుకు వచ్చాడు. రఘుబాబును వీధిలోకి పడేయడానికి ఈ ఎత్తులన్నీ.”

“అవునురా, యియన్నీ పట్టణం బాబుల చమత్కారులూ.” అక్కడున్న యువకులు వాళ్లకి తోచినట్టుగా  విమర్శలు చేస్తున్నారు.

“నాయిల్లు నేను అమ్మకొంటానంటే ఏరైనా ఏమంటారు, అమ్ముకోనీ. మనూరి రఘుబాబుకు మనమంతా లేమా,” ఒక నడివయస్కుడు రఘు దగ్గరకిచేరి నిలుచున్నాడు. వెంటనే మరికొందరు యువకులు రఘు పంతులుగారి చుట్టూ గుమికూడారు.

మరి కొందరు గోప్యంగా తనగురించే ఏవో గుసగుసలాడుతూంటే అబ్బాయిబాబు మరింత కోపంతో రెచ్చిపోయాడు.

“ఏదో పెద్దవాళ్లని వూరుకొంటున్నాను. మా అమ్మని ఎక్కడో ఓల్డోజిలో పెట్టేస్తే  వెతుక్కొంటూ యిక్కడికెందుకొస్తానూ. మీ రంతా కలసి మా అమ్మని నాకుకాకుండా చేస్తున్నారు.” కోపంతో వగరుస్తూ, వెంటనే వలవలా ఏడ్చాడు.

“యిదేదో పెద్దనాటకంలాగ వుందిరోయ్, వూరికే మొసలికన్నీళ్లు రాలుస్తున్నాడు,” ఎవ్వడో కిస్సుకున నవ్వాడు.

“అవునవునూ, యిల్లు అమ్మేయడానికి వచ్చీ యిక్కడ యీ నాటకం ఆడుతున్నాడు.”

“యింతకీ ఈ యిల్లు రఘుబాబుపేర అమ్మగారు ఎప్పుడో మార్చేసారుకదురా.”

“అందుకేనూ ఈ తతంగమంతా, ఎటో సూడడానికి అందరూ పెద్ద మనుషులే కానీ గుండెలో యిసుమంత జాలికూడా లేదు.”

యిలా ఎవరికి తోటినట్టుగా వాళ్లలో వాళ్లే చేప్పుకొంటూంటే అబ్బాయిబాబు  అతి దీనంగా అందరివేపూ చూస్తూ కన్నీరు కారుస్తూ నిలుచుండిపోయాడు.

“ఆపండిరా, మీసూదిపోటు మాటలూ, సూడడంలేదూ అబ్బాయిబాబు ఎలా చితికపోయాడో,” అంటూ చెట్టుక్రింద నిలుచున్నఆ ముదుసలి కలుగజేసుకొని కొందరినోళ్లు మూయించేడు. అబ్బాయిబాబు భుజంమీద చేయేసీ అతి నెమ్మదిగా అడిగాడు- “అయితే అబ్బాయిబాబూ, యింతకీ అమ్మగారు ఎక్కడ ఎలాగ తప్పిపోయారూ, ఎప్పుడు తప్పిపోయారు బాబూ?” 

“అదే తెలియడంలేదు తాతయ్యా. అమ్మకి ఏంలోటుచేసాననీ. పెద్ద గదీ, అది ఎంతా విశాలమయిన గదో తేలుసా, అది ఈ పంతులుగాడి యిల్లుకన్నా పెద్దది, అది కూడా పూర్తి ఎ సి తో. అమ్మని చూసుకోడానిక యిద్దరు పనిమనుషులూ, వాళ్లిద్దరూ అమ్మని ఒక్క క్షణంకూడా వదలకుండా ఆమెకి కావలసినవన్నీ కూర్చున్నచోటుకు అందిస్తారు. ఆమె కదలకుండా అడుగులకు మడుగులొత్తుతూ చూసుకొంటున్నారు. వంటవాడు అమ్మకి ఏది కావాలంటే అది చేస్తున్నాడు, నాకు యిష్టమనీ వాడకి చిట్టిబూరెలు చేయండంకూడా అమ్మే నేర్పంది. అలాగే నా కిష్టమయిన పరవాన్నం, ఆవపెట్టిన అరటిదువ్వకూరా, చామదుంపలవేపుడూ అన్నీ వటింటికి దూరంగా  మాహారాణీలాగ కుర్చీమీద కూర్చొనీ వంటవాడికి నేర్పించింది. ఆ మరాటీవంటవాడికి మన తెలుగు వంటలన్నీ నేర్పించింది. నా భార్యకికూడా అమ్మ వంటలే నచ్చుతున్నాయి. అమ్మ నాదగ్గర ఎటువంటి ఒడుదుడుకులూ లేకండా వున్నాది. అలాంటిది యిల్లు వదలీ ఎలాగ వెళ్లపోతూందో మీరే చెప్పండీ. ఎవ్వరో ఎత్తుకుపోయారు.”

“మరీ, అమ్మగారు ఎలా తప్పిపోయారూ బాబూ?”

“అదేనండీ. ఎప్పుడూ నాపిల్లలూ అంటూ  ఈ భ్రష్టులని తలచుకొంటూంటుంది. ఒక్కసారి విసుగు వచ్చీ అమ్మా నేను నీకేమీ కానా అని అడిగాను.”

“అమ్మగారు ఏటన్నారూ బాబూ?”

“అయ్యో పిచ్చితండ్రీ నువ్వు నా కొడుకువిరా, నువ్వే నాకు కొరివిపెట్టాలిరా. ఎన్నో వ్రతాలూ పూజలూ చేసానురా నీగురించీ అబ్బాయీ. నవ్వు నా కొడుకువిరా. నీతర్వాతే ఎవ్వరయినా.”

“అయితే అమ్మా ఎప్పుడూ నా పిల్లలూ అంటూ ఆ బడిపంతులని తలుచుకొంటావెందుకూ. ఆ పల్లేటూర్లో నీకేముందనీ. ఒక్క ఫేనుకూడా లేదు. అన్ని పనులూ నువ్వే చేసుకొంటున్నావు. యిక్కడ నీకు కావలసిన అన్ని సదుపాయాలూ వుంచాను కదమ్మా. మళ్లా ఆ భ్రష్టుల గురించీ ఆ లోచించకు. కావాలంటే వాళ్లకి కొంత డబ్బు పంపించేస్తానులే. నీకు ఏంకావాలో అడిగి చేయించుకో అమ్మా. యిది నీయిల్లు, నువ్వే నాయింటికి పెద్దదిక్కు అనికూడా చెప్పానండీ.”

“మరీ ఎలాగ తప్పిపోయింది అబ్బాయిబాబూ?”

“అదా ఆ రోజు పార్కుకనీ పనివాళ్లద్దరూ కలసీ అమ్మని తీసుకెళ్లారు. అక్కడ ఒక బెంచీమీద కూర్చో పెట్టీ వాళ్ళిద్దరూ మాటల్లో పడినట్టుగున్నారు. కొంతసేపటికి ఆ బెంచీ వేపు చూసేసరికీ అమ్మ అక్కడలేదు. వెంటనే పోలీసులుచేత వెతికించాను, కానీ నా అమ్మ ఎక్కడా కనుపించలేదు. నా అమ్మని ఎవ్వరో ఎత్తుపోయారు,” మళ్లా భోరుమన్నాడు అబ్బాయిబాబూ.

“అమె నగలుకోసమనీ ఆ పనివాళ్లేమైనా చేసారోమో.”

“లేదండీ అమ్మ ఒక్క జత గాజులు తప్పా ఏనగలూ పెట్టుకోదు. ఆ గాజులైనా పాతపడిపోయీ యిత్తడి గాజలులాగ వుంటాయి. అవి బంగారం అన్నా ఎవ్వరూ నమ్మరు.”

“అయా, నాకు తెలుసుబాబూ. ఎనిమిదోయేట, క్రొత్తకోడలుగా మావురిలోకి అడుగుపెట్టింది మహలక్షమ్మ. అప్పుడు పెద్దయ్యగోరే తన ఒక్కగానొక్క కోడలికి మా వూరి కంశాలిచేతే ఆ రెండుకడియాలుచేయించీ యిచ్చాడు బాబూ. ఆ యమ్మ వాటిని ఎప్పుడూ తీయదు. ఆరోజులే వేరు.”

“అలాగా, ఎప్పడో నేను చిన్నప్పుడు కాసులపేరంటే యిష్టమంది. బొంబాయి వెళ్లగానే పొడాగాటి కాసులపేరు చేయించానండీ. అది అమ్మ బీరువాలోనేవుంది, ఎప్పుడూ వేసుకోలేదు.”

“పాపం అమ్మగారు ఎక్కడున్నారో.”

“అదేనండీ నాకూ భయం. నా అమ్మనాకు కావాలి. ఒరేయి రఘూ  నీకు నాలుగు వారాలు టైము యిస్తున్నాను. మర్యాదగా నా అమ్మని నాకు అప్పగించూ, లేకపోతే నిన్ను పూర్తిగా నాశనం చేసేస్తానురా. నీ వూరి వాళ్లందర ముందరా చెపుతున్నాను. నాలుగు వారలు, నాలుగంటే నాలుగే,  ఆపైన ఒక్కరోజుకూడా ఆగనురా. నాలుగువారాల తరువాత వచ్చీ నీఅంతు చూస్తాను.” అరుస్తూ, వగర్చుకొంటూ ఆ పడవలాంటి కారులో కూర్చొనీ వెళ్లిపోయాడు అబ్బాయిబాబుగారు. వూరంతా చేతలుడిగీ నిలుచుండిపోయారు. 

 మామయ్యా మీ అమ్మని ఎక్కడున్నా వెతికి తెచ్చినీకు అప్పగిస్తాను మామాయ్యా, మనసులోనే నిశ్చయించుకొన్నాడు రఘు.

 

ఆ వూరి పెద్దలందరికీ నాలుగేళ్లక్రిందటి సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి.

నాలుగు సంవత్సరాల క్రిందట ఆ ఊరు అప్పుడప్పుడే తెలతెల వారూతోంది. ఆ వూరు పల్లెకి పెద్ద, పట్టణానికి చిన్న. కానీ మమతలకీ, ఆప్యాలకీ పెట్టిందిపేరు. ఆమె అందరికీ అమ్మ, మహలక్షమ్మ.

“అమ్మగోరూ, మీ అబ్బాయిగోరు లండనుకాడ నుంచీ వస్తాడుటమ్మా.”

“అప్పుడే నీ కెవరు చెప్పారే, మంగా?”

“సెప్పేదేటుందమ్మగోరూ, వూరంతా కోడైకూస్తుంటే.”

“వుండవే నీసోది వినడావికి నాకు టైములేదే, వెళ్లి నీపని చూసుకోవే.”

“ఓలమ్మో ఓలమ్మో, అప్పుడే అమ్మగోరూ యింగిలీచు సెపుతున్నాదే.”

“పోవే నువ్వూ నీపరాచికాలు, టైమంటే యింగిలచుకాదే, టైమంటే టైమేనే.” అమ్మ నవ్వుకొంటూ వంటింటిలోకి వెళ్ళిపోయింది.

యిరుగూ పొరుగూ కలసీ అబ్బాయికి యిష్టమైన పిండివంటలు తయారు చేసారు, అరిసెలూ, పూర్ణం బూరెలూ, చక్కిలాలూ, జంతికలూ అప్పుడే తయారయిపోయాయి.

“అమ్మగారూ బొబ్బట్లు చేసేసేనా.”

“వద్దే వాడికి వేడివేడి బొబ్బట్లు నెయ్యివేసీ కాలుస్తేనే యిష్టమే. వాడు వచ్చాక నేనే చేస్తానులేవే.”

“అమ్మగారూ పాతికెళ్లయినా మీకన్నీ జ్ఞాపకంవున్నాయా?”

“నా వూపిరిని నేను ఎలా మరచిపోగలనే.”

సరిగ్గా రెండుగంటలకల్లా అబ్బాయిని టాక్సిలో తీసుకు వచ్చాడు రఘు. వూరువూరంతా అతనికి స్వాగతం పలికింది. ఎంతో వినయంగా అందరినీ పలకిరించాడు అబ్బాయి.

“పిల్లడంటే అలా వుండాల, ఎక్కడైనా గర్వం వుందా. లండనోడూ అంటే ఏరైనా నమ్ముతారా.”

“గర్వం దేనికంటా, ఆడిబాబు లాగే వీడికీ మంచీ మర్యాదా తెలియదా.”

పరాచికాలూ, పలకరింపులూ అయినాక అందరూ అబ్బాయిని వాడమ్మకి వదలీ వెళ్ళిపోయారు..

అబ్బాయికి తను చేసిన వంటలు కొసరి కొసరీ తినిపించింది అమ్మ. అతను మనస్ఫూర్తిగా తిన్నాడు. రెండు రోజులు అందరితో ఎంతో కలుపుకోరుగా వున్నాడు అబ్బాయి.

మూడోరోజున ప్రొద్దన్న లేస్తూనే, అమ్మదగ్గర కూర్చొనీ కాఫీ తాగుతూ, అమ్మా అన్నాడు.

“ఏంటిరా అబ్బాయీ, ఏదైనా చేయమంటావా, నాదగ్గర మొఖమాటందేనికిరా, చెప్పు ఏంచేయమంటావూ.”

“అమ్మా నీసామానులు సర్దుకో పన్నేండుకల్లా మనం బయలుదేరాలి. బట్టలూ అవీ అఖ్కరలేదులే. ఏవో నీ దేవుడి సామానులాంటివే పెట్టలో పెట్టు, అంతా కలిపీ ఒక చిన్న పెట్టెచాలులే. అక్కడ నీకు కావలసిన వన్నీ తెచ్చేవుంచానే అమ్మా.”

“ఎక్కడికిరా ప్రయాణం. వచ్చీ రెండురోజులైనా కాలేదు అప్పుడే వెళ్లిపోకురా, నీతో నాలుగు రోజులైనా మనసుకు తృప్తిగా గడపాలనీ వుందిరా అబ్బాయీ.”

“నాలుగు రోజులేం యిక అన్నిరోజులూ నాతోనే వుంటావమ్మా. యిప్పుడు నీకొడుకు పెద్ద వ్యాపారవేత్త. బొంబాయిలో నీకు కావలసినవన్నీ తెచ్చి వుంచానమ్మా. నిన్ను పూవుల్లో పెట్టిచూసుకొంటానమ్మా. పద మనింటికి మనం పోదాం.”

“మామయ్యా, అమ్మని తీసుకు వెళ్లపోతావా, మరీ..”

“ఏంటిరా మరీ మరీ, నా అమ్మని నేను తీసుకుపోతానంటే అలా గునుస్తావేంటిరా. యింకా ఎన్నాళ్లు నా అమ్మచేత వూడిగం చేయించుకొంటావురా రఘూ?”

“అది కాదు మామయ్యా, అమ్మమ్మ చేతవూడిగం చేయించుకోలేదు మామయ్యా, నీకు అమ్మ, నీ అమ్మే కానీ మాకు..”

“ఒరేయ్ నాతో వాదనలు పెట్టుకోకు. నా అమ్మని నేను తీసుకు వెళ్లిపోతున్నాను, అంతే.”

“అమ్మమ్మా వెళ్లిపోతావా,” రఘు ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకొన్నాడు.

“అబ్బాయీ వీళ్లు పసివాళ్లురా, వాళ్లని వదలి నేనుండలేనురా.”  

“యింకా పసివాళ్లేమిటి అమ్మా, రఘు ముడ్డిక్రిందకి రమారామి ముఫ్ఫై ఏళ్లు వచ్చాయాలేదా?”

“అవునురా, వయ్యస్సుకేమి, వయస్సు వచ్చేదికానీ పోయేది కాదుకదా. అదీకాక చిట్టి కాలేజీ చదువైపో తుంది. దాన్ని ఒకయ్య చేతిలో పెట్టాలిరా. మధ్యవాడు పొలం పనులమీద పట్టణానికి వెళ్లాడురా, పోనీ వాడు వచ్చేదాకైనా వుండురా.”

“ఎవరి గురించీ నేనేం వుండనఖ్కరలేదు. నాకు అక్కడ బోలెడు పనులున్నాయి. అవన్నీ ప్రక్కనపెట్టీ నిన్ను తీసుకువెళ్లడానికే వచ్చానమ్మా, నాతో వచ్చీతీరాలి, అంతే,” గునుస్తూ అమ్మకొంగుపట్టుకొన్నాడు.

“ఒరేయి అబ్బాయీ నీ చిన్నతనం యింకా పోలేదురా. అప్పుడుకూడా యిలాగే గునుస్తూ నాకొంగు పట్టుకొనీ నీకు కావలసినవన్నీ చేయించుకొనేవాడివి. కొంచెం నన్ను ఆలోచించుకోనియ్యరా అబ్బాయీ.”

“యిందులో ఆలోచనకు ఏంవుదమ్మా, నీఒక్కగానొక్క కొడుకు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఒక మహారాణిలాగ వుంచుతానమ్మా. ఒక మాట చెప్పమ్మా , రఘువాళ్లు నాకన్నా నీకు ఎక్కువయ్యారా. ఏదో దిక్కులేనివాళ్లనీ యిన్నాళ్లూ పెంచావు, యికచాలు.”

“అబ్బాయీ ఆపురా, వాళ్లెవరనుకొంటున్నావురా. ఈ పిల్లలు నా చిన్ననాటి స్నేహితురాలు, అమ్మాయమ్మ మనవలురా. అది పోతూ పోతూ తల్లీ తండ్రీ లేని తన ముగ్గురు మనవలనీ నాచేతుల్లో పెట్టీ మరీ పోయిందిరా.”

“అయితే, యింకా ఎన్నాళ్లు ఈ అనాధలకి సేవ చేస్తూంటావూ?”

“నేనుండగా నా మనవలు అనాధలుకారురా. వాళ్లు నాపిల్లలురా అబ్బాయీ.”

“అయితే అమ్మా నే నెవరినీ నీకు?”

“నువ్వు నాకొడుకువిరా, పాతికేళ్లక్రిందట నన్నూ మీనాన్నగారినీ వదిలేసి ఇంగ్లాండు వెళ్లిపోయిన నా కొడుకువిరా. మీ నాన్నగారు పోయినప్పుడుకూడా నువ్వురాలేదు. ఆయనకి రఘుబాబే కొరివిపెట్టాడురా. వీళ్లు నా పిల్లలురా. వాళ్లు ముగ్గురూ ఒక దరికి చేరినంతవరకూ నేనెక్కడికీ రాను అబ్బాయీ.”

“అమ్మా అవును నేను ఎవ్వరికీ చెప్పకుండా దేశం విడిచీ వెళ్లిపోయాను అది నాతప్పే. ఆ తప్పునే సరిదిద్దుకొందుకు నాతో నువ్వురావాలమ్మా.” భోరున ఏడుస్తూ అమ్మ కాళ్లు పట్టుకొన్నాడు అబ్బాయి.

“అలాగయితే నా పిల్లలని కూడా నాతో తీసుకురానా?”

“అక్కడేంచేస్తారమ్మా. రఘు చిన్న బడిపంతులు, వాడు అక్కడ పెద్ద పట్టణంలో ఏంచేస్తాడూ. శీను పొలందున్నుకొంటాడు, అక్కడ వాడేం చేస్తాడూ. యిక చిట్టి సంగతా పట్టణంలో చదువైపోగానే నేనేదాని పెళ్లి ఖర్చులన్నీ పెట్టుకొనీ పెళ్లి చేస్తానమ్మా.”

“మీ నాన్నలాగే అరటిపండు ఒలచినట్టుగా మాటలు చెప్తావురా. మాటలకేమీ ఎవ్వరైనా చెప్పగలరు.”

“ఒరేయ్ రఘూ, సెలవలకి మీరందరూ బొంబాయిరండిరా, నేనే రైలు టికెట్టులు పంపిస్తాను. కానీ నాఅమ్మని నాకు కాకుండా చేయకురా,” రఘు చేతులు పట్టుకొనీ బ్రతిమాలాడు. ఆ రాత్రంతా రఘు అమ్మమ్మని బొంబాయి వెళ్లడానికి ఒప్పించాడు.

అది నాలుగేళ్ల క్రిందటి మాట.

 ఆ నాలుగేళ్లలో తనమ్మని ఒక్కసారికూడా పల్లెకు పంపించలేదు అబ్బాయి. ఆఖరికు చిట్టీ పెళ్లికి కూడ అమ్మని పంపించలేదు, కానీ చిట్టికి అమ్మపేరున ఒక గిఫ్టు పంపించాడు. చిట్టి పెళ్లి తరువాత రఘుకూడా ఆ వూరి పిల్లనే పెళ్లి చేసుకొన్నాడు. శీను పెళ్లికూడా జరిగింది.       అదుగో అప్పుడు మళ్లా తిరిగీ వచ్చాడు అబ్బాయిమామయ్య. వస్తూనే రఘుమీద చేయికూడాచేసుకొన్నాడు.

అబ్బాయిగారు యిచ్చిన నాలుగు నెలల గడువూ పూర్తయిపోయింది కానీ అమ్మ ఎక్కడా దొరకలేదు. అబ్బాయిబాబు, తరుచూ రఘుని తిడుతూ, బెదిరిస్తూ, వుత్తరాలు రాస్తూనే వున్నాడు, కానీ మళ్లా ఆ ఊరు రాలేదు.

కాలగమనంలో మరో రెండు వసంతాలు గడిచిపోయాయి. రఘు స్కూలుకి యిద్దరు ఎన్ ఆరై లు, యిద్దరు అమెరికన్లను తీసుకు వచ్చీ ఆ చిన్నస్కూలుని పెద్దది అంటే హైస్కూలుని చేయడానికి ముందుకొచ్చారు.  వాళ్లు చూస్తామంటే రఘు వాళ్లని బృందావనం  తీసుకు వెళ్లవలసి వచ్చింది. అక్కడికి చేరగానే ఆ యిద్దరు ఎన్ ఆరైలు అక్కడేవున్న తమ భందువులని కలియడానికి వెళ్ళిపోయారు.. రఘు ఆ అమ్రికన్లను బృందావనం అంతా చూపించాడు. మధ్య మధ్యన చిన్ని కృష్టడి కధలు చెపుతూంటే వాళ్లు చిన్నపిల్లలాగ ఆసక్తిగా వింటూ అవన్నీ తమ విడియోలో బంధించారు.

అక్కడ గుడి ముందర రోజూ ఒంటరిగా దిక్కులేని విధవలూ, ముసలి ఆడవాళ్ళు ఒక లైనులో కూర్చొంటే గుడికి వచ్చిన భక్తులు వాళ్లకి భిక్ష వేయడం ఒక ఆనవాయితీ. ఆ యిద్దరు అమెరికన్లు ఆ భిక్షుకులకి వీడియో తీస్తూన్నారు. అందరూ తలొంచుకొనీ మౌనంగానే భిక్షని తీసుకొంటూంటే వాళ్ల మధ్యన కూర్చొన్న ఒక పెద్దావిడ మాత్రం, రెండు భిక్షలు కావాలి, నాకొడుకుకీ, నా పిల్లలకీ అంటూ బేలగా అడుగుతూంటే కొందరు భక్తులు రెండుసార్లు భిక్షలు వేసారు, మరి కొందరు ఛీత్కారించుకొంటూ వెళ్ళిపోయారు..

 

“ఏదో దయతలచీ వేస్తున్న భిక్షని తీసుకోకుండా నాకు రెండు కావాలంటూ పేచీలేమిటీ,” ఒక భక్తురాలు సణిగింది.

“అవునండీ అసలు భిక్షలువేసీ మనమే ఈ బధ్ధకిస్తులని పాడు చేస్తున్నామేమో.”

“వూరికే వస్తే ఎవ్వరైనా ఎన్నైనా అడగగలరు.”

“అందుకో కాబోలు వాళ్ల యింటివాళ్లు వీళ్ళని తన్ని తరిమేసారు.”

“మీకు తెలుసో లేదో కానీ, వీళ్ల పిల్లలు మంచి పదవుల్లో వున్నారుట.”

“ఏంపదవులూ, తమ తల్లిని దిక్కులేనిదానిగా వదిలేసిన పదవులు దేనికీ.”

“అదీ కాదండీ, ఈ అమ్మలు వాళ్ల పిల్లలని ఎంత పీడించుకు తిన్నారో ఏంటో మనకేం తేలుసూ?”

“ఏమో, తల్లిలేని యిల్లు అసలు యిల్లే కాదు.”

“మాటలు చెప్పడం సులువండీ, యింతకీ మీఅత్తగారిని ఎక్కడ పెట్టారూ?”

“ఆ దేవుడే తీసుకువెళ్లిపోయాడు, వుంటే..”

“అదీ, అదీ అలాగనండీ, ఏదో సామెతుందికదా అత్తలేనీ కోడలూ...”

“సామెతలు నాకూ తెలుసండీ, నిజంగానే మా అత్తకాని వుంటే పువ్వులో పెట్టీ చూసుకొనేదాన్ని.”

 ఆ భక్తులు వాళ్లలో వాళ్లే వాదించుకొంటూంటే, ఆ అమెరికన్లు అదంతా తమ వీడియోలో బంధించారు.. 

 

మామూలప్పుడవుతే రఘు వాళ్లకి తగిన సమాధానంచెప్పేవాడు. కానీ అప్పుడు ఆ క్షణాన్ని రఘు వదులదలచుకోలేదు. ఆమె ముందర కూర్చొనీ ఆమె కాళ్లు పట్టుకొనీ వలవలా ఏడ్చాడు. ఆమె రఘువేపు వింతగా చూసింది. నా కొడుకూ, నా పిల్లలూ అంటూ మళ్లా కొంగు జాచింది. రఘు మరేమనకుండా ఆమెను రెండుచేతులతో ఎత్తుకొనీ కారులో కూర్చోపెట్టీ, వెంటనే అబ్బాయిగారికి ఫోను చేసి చెప్పాడు. వింతగా చూస్తున్న తన అథిదులకి ఆమె తమ వూరిదనీ మతి భ్రమించీ తప్పిపోయిందని చేప్పీ తనూరికి తీసుకు వెళ్లాడు.

ఆ మరునాడే పెద్దకారులో, డాక్టరుని వెంటపెట్టుకొనీ  మరీ వచ్చాడు అబ్బాయిబాబు. 

కొంచెం వుపచారంచేసాక అమ్మతేరుకొంది కానీ ఎవ్వరినీ గుర్తు పట్టలేకపోయింది. నా కొడుకూ, నాపిల్లలూ అంటూ పలవరిస్తూనే వుంది. తన అమ్మ పరిస్థితి చూసీ అబ్బాయి ఏడుస్తూ కూలబట్టాడు. కొంతసేపటికి తేరుకొనీ తననే వింతగా చూస్తున్న పిల్లలిని చూసీ కళ్లు తుడుచుకొన్నాడు.

అతనికి కొంచెం దూరంగానే నిఠారుగా నిలబడీ ఆ యిద్దరు చిట్టి పాపలూ ఆయన్ని వింతగా చూస్తూ నిలబడ్డారు.

“మీ తాతనిరా, రండి, దగ్గరికి రండి,” అంటూ చిన్న చిరునవ్వుతో పిలిచాడు అబ్బాయిబాబు. ఆ పిల్లలు అడుగులో అడగేసుకొంటూ వచ్చీ కొంచెం దూరంగానే నిలబడ్డారు.

“యిలా రాపాపా, నీపేరేంటీ?”

“మాలచ్చమి తాతయ్యా,” అంటూ కిస్సుక్కున నవ్వింది ఆ మూడేళ్లపాప.

“ఎందుకే ఆ నవ్వూ, తప్పు,” అన్నాడు రఘు.

“తాతయ్య వూ వూ అంటూ చిన్న పాపాయిలాగ ఏడుస్తూంటే,” అని పకపకా నవ్వింది.

“మరేం అనుకోకు మామయ్యా, చిట్టిలక్ష్మి వుత్తి చిచింద్రీ. అమ్మమ్మగారి పేరే పెట్టుకొన్నాము మామయ్యా.”

 కొంచెం దూరంగా రెండుచేతులూ వెనక్కి కట్టుకొనీ నిలబడ్డ బాబుని చూస్తూ కిసుక్కున నవ్వాడు మామాయ్య. తనుకూడా యిలాగే ఎప్పుడూ రెండుచేతులు వెనక్కి కట్టుకొనే నిలబడేవాడు.

“ఒరేయి హీరో నీ పేరేంటి?”

“నా పేరూ చాలా పెద్దపేరు, మీరు పలకలేరేమో,” అన్నాడు ఆ అయిదేళ్ల బాలుడు.

“అబ్బో అంత పెద్దపేరా?”

“అవును తాతయ్యా. నాపేరు వీర వెంకట బాల సుభ్రమణ్య ప్రసాద్.”

“అబ్బో చాలా పెద్దపేరే, వీర వెంకట బాల సుభ్రమణ్య ప్రసాద్. దాన్నిమోయగలవా చిన్నోడా?”

“చిన్నోడా, మా నాన్నగారు నన్నుఅలాగే పిలుస్తారు, మీకెలాగ తెలుసూ తాతయ్యా?”

“మా అమ్మ కూడా మీ నాన్నని అలాగే పిలిచేదిరా చిన్నోడా,” అంటూ మళ్లా వలవలా ఏడుస్తూంటే పిల్లలిద్దరూ బిక్కచచ్చిపోయీ నిలుచుండిపోయారు. వాళ్లమ్మ లక్ష్మి వాళ్లిద్దరినీ పెరటిలోకి తీసుకుపోయింది.

కొంచెం సేపటికి తేరుకొనీ రఘూ అంటూ కళ్లనీళ్లు పెట్టుకొన్నాడు మామయ్య.

“అవును మామయ్యా మీ పేరుపెట్టుకొనీ నా పిల్లలని పిలుస్తూంటే అమ్మమ్మ లేని లోటు తీర్చుకొంటున్నాము. బాబుకు నీ పేరు పెట్టామనీ నీకు కోపంలేదుకదూ మామాయ్యా. మా బాబుకూడా నీలాగే..”.

“వద్దురా రఘూ వద్దు. మమతలని నా హోదాతో కొలవాలనీ నా అమ్మని పోగొట్టుకొన్నానురా. మళ్లా ఈ జన్మలో అమ్మ కనుపిస్తుందనుకోలేదురా రఘూ. మనందరికీ తల్లిలేకుండా చేసాను కదురా. అమ్మ  ఎంత కుమిలిపోయిందో,” అంటూ మళ్లా భోరుమని ఏడ్చాడు.

కొద్ది రోజుల తరువాత అమ్మ మెల్లగా తేరుకొంది. మొట్టమొదట తనకొడుకునే గుర్తు పట్టంది. అబ్బాయీ అని పిలవగానే ప్రాకుకొంటూ ఆమె దగ్గరికి చేరాడు అబ్బాయి.

మెల్లమెల్లగా అందరినీ తనూరినీ కనులారా చూసుకొనీ కన్నీళ్లు పెట్టుకొంది ఆ అమ్మ. అందరూ కలసీ సరదాగా కొన్నిరోజులు గడిపారు.

“ఒరేయ్ రఘూ, యిక నేను వెళ్లాలిరా. అక్కడ ఎన్నో పనులున్నాయి. రేపేనురా.”

“మామయ్యా శీను వాడి అత్తగారివూరు వెళ్లాడు, యివాళో రేపోతండ్రికాబోతున్నాడు. మరి క్రొద్దిరోజులు వుండు మామయ్యా వాడు వచ్చేస్తాడు.”

“లేదురా రఘూ, నేను వెళ్లాలిరా.”

“సరే మామయ్యా, అన్నీ సర్దేయనా?”

రఘూ మామయ్యవాళ్ల ప్రయాణం రేపేనని చెప్పగానే లక్ష్మి పిండివంటల చేయడం ప్రారంభించిది. మామాయ్యగారికి యిష్టమయిన వన్నీ చేసింది. అరిశేలూ, పూర్ణంబూరెలూ, చక్కిలాలూ, జంతికలూ చేసేసింది. అమ్మమ్మగారికనీ  ప్రత్యేకంగా సున్నుండలూ చేసింది.

“అన్నీ తయ్యారయిపోయాయి. రేపు ప్రొద్దున్నే బొబ్బుట్లుచేసీ, వేడి డబ్బాలో పెట్టి యిస్తాను, వాళ్లు దారిలోతినవచ్చు. కొన్నిబోండాలుకూడా పెట్టండి, ఆ బాటిలు నీళ్లకంటే తీయగా చల్లగా వుంటాయి,” అని రఘూకి చెప్పింది లక్ష్మి.

అది వాళ్లకి అమ్మమ్మతో ఆఖరి రాత్రి. అందరూ కలసీ పెరట్లో అరుగుమీద కూర్చొనీ, చిన్నానాటి ముచ్చట్లూ, ఆ వూరి వాళ్ల ఆప్యాతలూ, పేరు పేరునా అందరినీ తలచుకొంటూ మాట్లాడుకొన్నారు. వాళ్ల కబుర్లకి అంతంలేదూ. ఎప్పుడూ చందమామ ప్రక్కకితప్పుకొనీ, సూర్యభగవానునికి త్రోవయిచ్చాడో వాళ్లకి తెలియనే లేదు. మళ్లా రేపు అన్నది వాళ్లకి వుంటూందే లేదో అన్నట్టుగా  ఆబగా, తృప్తిగా మాట్లాడుకొన్నారు. మధ్యమధ్యన ఏడుస్తూ మళ్లా వెంటనే పకపకా నవ్వుతూ  ఆ రాత్రిని గడిపారు. పిల్లలిద్దరూ అమ్మమ్మ ఒడిలోనే నిద్దురపోయారు.    

ఆ మరునాడు ఊరు వూరంతా అమ్మగారకీ, అబ్బాయిబాబూకీ వీడ్కోలు చెప్పడానికి కారు చుట్టూ చేరారు. అపటికే రఘూ తిండిసామానంతా డిక్కీలో పెట్టేసాడు. క్రొద్ది క్షణాలు అబ్బాయిబాబు ఆ వూరివాళ్లందరివేపూ చూస్తూ నిలుచున్నాడు. అతని కళ్లవెంట జలజలా కన్నీళ్లు కారాయి.

“అబ్బాయిబాబూ, అప్పుడప్పుడు అమ్మగారిని యిక్కడికి తీసుకువస్తూ వుండుబాబూ,” అని ఒక పెద్దాయన కోరాడు. అలాగే అందరూ అమ్మగారూ వస్తూండండీ అంటూంటే అమ్మ కారుతున్న కన్నీళ్లు తన కొడుకుకి కనుపించకుండా తుడుచుకొంది.

“అబ్బాయీ పదరా మనింటికి పద. నా పిల్లలని కనులారా చూసుకొన్నాను. యిక ఫరవా లేదు, పద నీతో వస్తాను.”

“వద్దమ్మా, నువ్విక్కడే నీ పిల్లలతో, నీ వూరి వాళ్లతో వుండు. నేనే తరచూ వచ్చీ నిన్నుచూస్తాను.”

“ఫరవాలేదురా అబ్బాయీ, మళ్లా పారిపోయీ నిన్ను అనవసరంగా అల్లరిపెట్టనురా అబ్బాయీ. పద మనింటికి పోదాం.”

“వద్దమ్మా! నిన్ను ఆ ఖులాసా ఖైదులో వుంచనమ్మా. నీ కొడుకూ  మరీ అంత చెడ్డవాడు కాదమ్మా. నీ తల్లిమనస్సు అర్ధం చేసుకోలేకపోయాను. అందుకే అంటారుకదా పుట్టిన ప్రేమకంటే పెంచిన ప్రేమే ఎక్కువనీ.”

“అదేంకాదురా అబ్బాయీ, నాకు నా కొడుకూ కావాలి, నా పిల్లలూ కావాలి, ఏంచేయనూ,” దీనంగా అంది, ఆ అమ్మ, అమ్మమ్మ.

“ఒరోయ్ రఘూ నాఅమ్మని జాగ్రత్తగా చూసుకో, నేను లేననీ మా అమ్మ చేత వూడిగం చేయించుకోకేం.”

“ఫరవా లేదులే మామయ్యా, యిప్పుడు అన్నీ చేయడానికి యిద్దరు లక్ష్మిలున్నారుకదూ!”

“అంటే నేను పనులు చేయాలా, అమ్మో నాచేతులు నలికిపోవూ,” అంటూ గునిసింది చిట్టి లక్ష్మి. అందరూ పకపకా నవ్వారు.

OOO

bottom of page